– పిల్లలను చైతన్యపర్చే బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లదే
– కులం, మతం కాదు..మానవత్వమే ముద్దు : సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
– ఉత్తేజభరితంగా ముగిసిన కులనిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో కుల జాఢ్యాన్ని తొలగించే బాధ్యత ఇంటి నుంచే ప్రారంభం కావాలని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఆకాంక్షించారు. కులం, మతం కాదు మానవత్వమే ముద్దు అనే భావనను పిల్లల్లో పెంపొందిం చాలనీ, ఆ దిశగా పిల్లలను చైతన్యపర్చే బాధ్యతను తల్లిదండ్రులు, టీచర్లు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కులనిర్మూలన సాంస్కృతికోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాలుగురోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులకు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని ఆయన సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్, టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి.రమేశ్, ట్రస్టు మెంబర్ బుచ్చిరెడ్డి, కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ..సమాజంలో కుల, మత వైషమ్యాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో కుల నిర్మూలన కోసం ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం సాహసోపేతమైన కార్యక్రమం అని కొనియాడారు. కులం అనే విద్వేషాన్ని, జులుంను చిన్నప్పటి నుంచే పిల్లల నుంచి దూరం చేయాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. తాను రెండో తరగతి చదువుతున్న సమయంలోనే కులం పేరిట ఎదురైన అనుభవాన్నీ, దళితుడైన తన స్నేహితుడినీ నాన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టించి మనమందరమూ మనుషులమే అన్న భావనను తనలో నాటారని గుర్తుచేశారు. ‘నా, నీ కులాలు మాసిపోనీరు..గతాల నాటి పాతరకం పాడు మతం పాసవికత పోనీరు..రానీయి జగాల నిండా ఒకే మతం మానవత్వం..ఒకేకులం మనిషుకులం..మనిషుకులం…కుల ద్వేషం రగిలించే కుట్రలన్నీ తగులెట్టు.. అంబేద్కరుడు అన్న మాటను అంబరాన నిలబెట్టు…కలోల్లాలుంటాయా..కుల ఘర్షణలుంటాయా…’ అంటూ తనదైన స్వరంతో పాట పాడుతూ సభను ఉర్రూతలూగించారు.
ముగింపు సభకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మాస్టర్‌జీ ‘రండిరో దళితన్న’ అని పాటపాడుతుండగా అతని బృందం నృత్యప్రదర్శన చేసింది. నవీన్ రచించి సుజావతి దర్శకత్వం వహించిన ‘కులం వద్దు, మతం వద్దు..మానవత్వమే ముద్దు’ అనే నాటికను ఎస్వీకే బృందం ప్రదర్శించింది. డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి జావేద్ ప్రదర్శించిన ‘భగత్‌సింగ్’ ఏకపాత్రాభినయం ఆకట్టుకున్నది. అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తులసీ తీర్థం నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకం ద్వారా మూఢత్వాలను, మత దురాచారాలను ఎత్తిచూపుతూ మనుషులంతా ఒక్కటే అన్న భావనను చాటి చెప్పారు. విశ్వజన కళామండలి వారు ‘ఓ సమతాసాగర గౌతమబుద్ధ’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఎస్వీకేలోని ట్యూషన్ పిల్లలు ‘అణగారిన బతుకుల్లో అక్షరనారి సావిత్రీబాయి ఫూలే..’ అనే పాటకు చక్కటి నృత్యాన్ని ప్రదర్శించారు. బోయగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థునులు అంబేద్కర్ పాటపై డ్యాన్స్ చేశారు.
ఉత్సాహంగా..చైతన్యం నింపేలా..
కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు నాలుగురోజుల పాటు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచేలా కొనసాగాయి. ప్రతి ఆటా పాటా కుల నిర్మూలన దిశగా కొనసాగాయి. కులాన్ని కడిగేసే చైతన్య స్రవంతిలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మనుస్మృతి చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన ఒక జ్ఞాన దీపికలా కార్యక్రమాలను కళాకారులు నిర్వహించారు. భారత సమాజానికి పట్టిన కుల చీడను తొలగించే కార్యక్రమాలను బస్తీలు, గ్రామాల స్థాయికి తీసుకెళ్తామని ప్రతిమబూనారు. 68 మంది కవులు తమ అక్షరాయుధాలతో కులం, మతంపై ఎక్కుపెట్టారు. సమసమాజం దిశగానే తమ కవితలు, రాతలుంటాయని ఎలుగెత్తి చాటారు. నాలుగురోజుల సాంస్కృతిక ఉత్సవాలు ఒక వైజ్ఞానిక యజ్ఞంలా సాగాయి. సామాజిక రుగ్మతలను కడిగిపారేసే కళారూపాలు, సమానత్వపు సూర్యున్ని ఆహ్వానించనట్టుగా సంబరాలు కొనసాగాయి. నిజచరిత్రకు ఆనవాలుగా జీహెచ్‌ఎంసీ కార్మికురాలు నర్సమ్మ ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ నిలిచింది. అంతిమంగా సాంస్కృతిక ఉత్సవాలను కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని జయప్రదం చేశారు.
కులజాఢ్యం ఇంటి నుంచే పోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



