రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మనందరి బాధ్యత
కులగణన ద్వారా సామాజిక న్యాయం దిశగా అడుగులు
అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ గొప్ప దార్శనికుడని, ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం పయనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బాబాసాహెబ్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్‌టీఆర్ మార్గ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. అంబేద్కర్ అద్భుతమైన ప్రతిభాశాలి అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యానికి పునాదులు వేసి, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రతి పౌరుడికీ సమాన హక్కులు కల్పించడమే కాకుండా, ఓటు హక్కు ద్వారా సామాన్యుడిని పాలకుడిగా మార్చిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అని అభివర్ణించారు. మహిళా సాధికారతపై అంబేద్కర్ అప్పట్లోనే ముందుచూపుతో ఆలోచించారని గుర్తు చేశారు. తొలి న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి, దాని ఆమోదం కోసం తన మంత్రి పదవిని వదులుకున్న త్యాగధనుడు అని చెప్పారు. పని గంటలను 8 గంటలకు తగ్గించేలా పోరాడి విజయం సాధించారని, ప్రసూతి సెలవులు, కార్మిక చట్టాల రూపకల్పనలో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘మన హక్కులను కాపాడుకోవాలంటే అందరం ఏకమై, ‘జై భీమ్’ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలి” అని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఇందిరమ్మ ప్రభుత్వం పూర్తిగా అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటిసారిగా కుల గణనను చేపట్టిందని వెల్లడించారు.
దేశంలోనే తొలి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
అంబేద్కర్ జీవితం, ఆయన తత్వం, దేశ నిర్మాణంలో అందించిన సేవలను ప్రతిబింబించేలా మ్యూజియంను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలి ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సందర్శకులకు అంబేద్కర్ జీవన ప్రస్థానాన్ని కండ్లకు కట్టినట్టు చూపేలా ఐదు ప్రత్యేక విభాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. బాబాసాహెబ్ చిన్ననాటి నుంచి మహోన్నత శిఖరాలకు చేరుకున్న ప్రస్థానం.. సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం, ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర, దేశ అభివృద్ధికి అంబేద్కర్ అందించిన దిశానిర్దేశంతోపాటు ప్రపంచ స్థాయిలో ఆయనకు ఉన్న గుర్తింపు తదితర వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ మ్యూజియంను కేవలం ప్రదర్శనశాలగానే కాకుండా, అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను మేళవించి రూపొందిస్తున్నారు. ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, కాంస్య శిల్పాలు, మల్టీమీడియా సౌకర్యాలతో అంబేద్కర్ స్ఫూర్తిని నేటి యువతకు, భావి తరాలకు అర్థమయ్యేలా వివరిస్తారు. త్వరలోనే మ్యూజియంను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.
అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం బ్రోచర్, ప్రివ్యూ వీడియో ఆవిష్కరణ
ఎన్‌టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘డాక్టర్ బిఆర్.అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం’కు సంబంధించిన బ్రోచర్, ప్రివ్యూ వీడియోను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులతో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.
బాబాసాహెబ్ అడుగుజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



