జీపీ లో జరిగిన అవినీతిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న పాలకవర్గం సభ్యులు

– వెంకటేశ్వర్ల పల్లి జిపి లో జరిగిన అవినీతి పై ప్రజావాణిలో ఫిర్యాదు
నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామ పంచాయతీలో హై మాస్ట్ లైట్ లలో జరిగిన అవినీతి , జిపి కార్యాలయ ఆవరణంలో అక్రమ రేకుల షెడ్డు నిర్మాణం, గ్రామ కార్యదర్శి అవినీతి లపై సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో జిపి పాలకవర్గం సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర్ల పల్లి గ్రామపంచాయతీలో తీర్మానం లేకుండా 10 ఐమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారని, ఒక్కొక్క లైట్ కి 40 వేల రూపాయల విలువ ఉన్నప్పటికీ ,దాని విలువ 88 వేల రూపాయలకు పైగా వేసి గ్రామ సర్పంచ్ పంచాయతీ నిధులు సుమారు పది లక్షలు దుర్వినియోగపరిచారని వారు ఆరోపించారు. దీనిపై గతంలో 23 ఆగస్టు 2022 న జిల్లా కలెక్టర్, డి పి ఓ లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అప్పుడు అట్టి బిల్లును పెండింగ్ లో పెట్టాడని తెలిపారు. ఇప్పుడు ఆ బిల్లును జిపి పాలకవర్గ సభ్యులకు ఎవరికి తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్నారని వారు చెప్పారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ సాధారణ మీటింగులో ప్రశ్నించగా గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి సమాధానం చెప్పకుండా, ఏం చేస్తారో చేసుకోండి అని బూతులు తిడుతూ పాలకవర్గ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసారని వారన్నారు. పంచాయతీ కార్యాలయము స్థలంలో అక్రమ రేకుల షెడ్డు నిర్మాణం చేసిన గ్రామ సర్పంచ్, అతని అనుచరులపై 23 నవంబర్ 2022, 2 జనవరి 2023 న జిల్లా కలెక్టర్ ,డి పి ఓ లకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దీనిపై విచారణ చేసిన హుజురాబాద్ డిఎల్పిఓ అక్రమ నిర్మాణం తొలగించాలని గ్రామ కార్యదర్శికి చెప్పినప్పటికీ, తొలగించలేదని పైగా ఆ అక్రమ నిర్మాణం చేసిన వారి నుండి వేలాది రూపాయలు తీసుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. స్మశానవాటికలో కొత్త వాటర్ మోటార్ బిల్లు పెట్టి గ్రామపంచాయతీ నుండి బిల్లు తీసుకున్నారని, కానీ అక్కడ ఎలాంటి మోటారు పెట్ట పెట్టలేదని వారు పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనంలో కూడా చాలావరకు అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. గ్రామ సర్పంచ్ తన ఇష్టం వచ్చినట్లు పంచాయతీ తీర్మానం లేకుండా పనులు చేస్తూ, తన ఇష్టం వచ్చినట్లు బిల్లులు పెట్టుకుంటున్నాడని వారు ఆరోపించారు. దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన, గ్రామంలో అవినీతి మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతికి సహకరించిన గ్రామ ఉపసర్పంచ్, కార్యదర్శులపై విచారణ చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తీర్మానం లేకుండా చేసే పనులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ను వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిపి పాలకవర్గం సభ్యులు బి భాగ్య, జి సౌభాగ్య ,బి లక్ష్మి ,ఆర్ మధుసూదన్, ఎం లక్ష్మి, ఆర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Spread the love