ఎమ్మేల్యే అధికారిక క్యాంపు కార్యాలయం సీజ్

– కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: ప్రభుత్వం కేటాయించిన అధికారిక క్యాంపు కార్యాలయాన్ని సకాలంలో ఖాళీ చేయకపోవడమే కాకుండా, లోక్ సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పటికీ క్యాంపు కార్యాలయాన్ని రాజకీయ కార్యక్రమాలకు వినియోగించుకున్నందుకుగాను నాగార్జునసాగర్ ప్రాజెక్టు హిల్ కాలనీలోని శాసనసభ్యుల అధికారిక క్యాంపు కార్యాలయాన్ని తక్షణమే సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు గాను ప్రభుత్వం శాసనసభ్యులకు అధికారిక క్యాంపు కార్యాలయాలను కేటాయించడం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన క్వార్టర్ ను పూర్వపు శాసనసభ్యులకు అధికారిక క్యాంప్ కార్యాలయంగా కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే ఇటీవలి రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నూతన శాసనసభ్యులకు సదరు క్వార్టర్ ను శాసనసభ్యులకు క్యాంపు కార్యాలయంగా కేటాయించడం జరిగిందని తెలిపారు. అధికారిక క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని పూర్వపు శాసనసభ్యులకు గతంలో నోటీసులు జారీ చేయడం జరిగిందని, అంతేకాక గత నెల 16 న మరోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయలేదని తెలిపారు. అయితే పూర్వపు శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడమే కాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను దృష్టిలో ఉంచుకుని, మంగళవారం రెవిన్యూ, పోలీస్ అధికారులతో నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉన్న శాసనసభ్యుల అధికారిక క్యాంపు కార్యాలయాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

Spread the love