రసవత్తరంగా బెంగాల్‌ రాజకీయం

The politics of Bengal is juicy– దీదీ, మోడీ ప్రభుత్వాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– పుంజుకుంటున్న వామపక్షాలు
– బలోపేతమైన ఇండియా ఫోరం
– జె.జగదీష్‌, నవతెలంగాణ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు ఈ సారి రసవత్తరంగా మారనున్నాయి. మోదీ నియంతృత్వ పోకడలకు, మమతా బెనర్జీ అహంకార ధోరణులకు వ్యతిరేకంగా ఇండియా ఫోరం పోరాటం కానుంది. కుంభకోణాలు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ, కమ్యూనిస్ట్‌- కాంగ్రెస్‌ ఫోరం మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మమతా బెనర్జీ, బీజేపీకి ఈసారి పార్లమెంటు ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. 2019లో 22 నియోజకవర్గాల్లో నెగ్గిన తృణమూల్‌ కాంగ్రెస్‌, 18 స్థానాల్లో గెలిచిన బీజేపీకి ఈసారి సగం స్థానాలైనా నెగ్గుతాయన్నది అనుమానమే. వరుస స్కామ్‌లు, స్కామ్‌లలో చిక్కినవారిని రక్షించే వైఖరి, నార్త్‌ 24 పరగణాల జిల్లా సందేశ్‌ ఖలీలో భూకబ్జాలు, మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డ షాజహాన్‌ షేక్‌ ను రక్షించేందుకు చేసిన యత్నాలు, ప్రజల్లో టీఎంసీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అలాగే ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, సీఏఏ వంటి వాటివల్ల మోడీ సర్కార్‌ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. బెంగాల్‌లో బీజేపీి కుల, మత విభజనకు పాల్పడుతోంది. అక్కడ ప్రజాస్వామ్య వాతావరణాన్ని ధ్వంసం చేస్తూ ప్రజలు ఐక్యంగా ఉండకుండా విభజనను సృష్టించింది.
ఏ పార్టీ, ఎన్ని సీట్లలో పోటీ? 
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాయి. అప్పటి వరకు ఇండియా ఫోరంతో కలిసి నడిచిన మమతా బెనర్జీ, చివరి నిమిషంలో ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. బీజేపీ కూడా ఒంటరి పోరుకే సిద్ధపడింది. ఇండియా ఫోరంలో భాగంగా సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు పోటీ చేస్తున్నాయి. టీఎంసీ, బీజేపీలు 42 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండియా ఫోరం పార్టీల్లో సీపీఐ(ఎం) 23, కాంగ్రెస్‌ 12, ఆర్‌ఎస్పీ 3, సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌లు చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ పేరుతో ముస్లింలు ప్రత్యేకగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు, చతుర్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. 2019లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 22 టీఎంసీ, 18 బీజేపీ, 2 కాంగ్రెస్‌ గెలిచాయి.
రాష్ట్ర రాజధాని కలకత్తాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీపీఐ(ఎం) తరపున ఈసారి ఎక్కువ మంది యువకులు పోటీ చేస్తున్నారు. విద్యార్థి, యువజన నాయకులు, న్యాయవాది, ఉపాధ్యాయ రంగాల నేతలు సీపీఐ(ఎం) తరపున బరిలో ఉన్నారు. సీపీఐ(ఎం) పోటీ చేసే 23 స్థానాల్లో 20 మంది అభ్యర్థులు 45 ఏండ్ల లోపు వారే. వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వ అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్‌ఖలి అంశాలపై ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. సీపీఐ(ఎం) నేత సుజన్‌ చక్రవర్తి డమ్‌డమ్‌ నుండి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంత కార్మికుల దుస్థితి గురించి బాగా అర్ధం చేసుకున్న చక్రవర్తి ఈసారి తన గెలుపునకు అవకాశాలు బాగుంటాయని ఆశిస్తున్నారు. జాదవ్‌పూర్‌ నుండి వామపక్ష అభ్యర్ధిగా బరిలోకి దిగిన సృజన్‌ భట్టాచార్య, ముర్షిదాబాద్‌ నుంచి మహ్మద్‌ సలీంలు కూడా స్థానిక సమస్యలతోపాటూ సందేశ్‌ఖలిపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. సీపీఐ(ఎం) తరపున మీనక్షి ముఖర్జీ, శత్రూప్‌ ఘోష్‌, అభాస్‌ రారు చౌదరి, ఎండి సలీంలు ప్రచారం చేస్తున్నారు.
సామాజిక సమీకరణలు
పశ్చిమ బెంగాల్‌లో అన్ని సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. అక్కడ మైనార్టీలు కూడా బలమైన ప్రజా సమూహంగా ఉన్నారు. అయితే బీజేపీి మతోన్మాద చర్యలతో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తీవ్రమైన కుట్ర పన్నుతోంది. మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీలను ఉసుగొల్పుతుంది. సీపీఐ(ఎం) నేతృత్వంలో 34 ఏండ్ల సుదీర్ఘ వామపక్ష ప్రభుత్వం హయాంలో మత హింసకు చోటు లేదు. మమతా బెనర్జీ వచ్చిన తరువాత, రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించింది. దీంతో బీజేపీ మెజారిటీ మత రాజకీయాలకు పాల్పడితే, మమతా బెనర్జీ మైనార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోంది. ఫలితంగా హింస, తగాదాలు, దాడులు పరస్పరం పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో మత సామరస్యం మంటగలుస్తోంది.ఈ రెండు పార్టీల మత రాజకీయాలను వ్యతిరేకంగా సీపీఐ(ఎం), వామపక్షాలు పోరాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఒబిసి 17 -20 శాతం, ఒసి 15-18 శాతం, ఎస్సీలు 23.51 శాతం, ఎస్టీలు 5.8 శాతం, ముస్లింలు 30 శాతం సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు. ఎస్సీలో మూడు ప్రధాన ఉప కులాలు రాజబన్షి 18.4 శాతం, నామసుద్ర 17.4 శాతం, బగ్డి 14.9 శాతం ఉన్నారు. ఎస్సీల్లో 90 శాతం బంగ్లాదేశ్‌ మూలాలు ఉన్నవారే. అందుకే బీజేపీ సీఏఏ తెచ్చి లాభపడింది. పెద్ద నగరాల్లో ఆధిపత్యం చెలాయించే బ్రాహ్మణ, వైద్య, క్యస్త అగ్రకులాలు 15 నుండి 18 శాతం ఉన్నారు. వీరిలో మతం పేరుతో బీజేపీ చొరబడింది.
ప్రధాన సమస్యలు
పశ్చిమ బెంగాల్‌లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్‌ మిల్లు కార్మికులు, జూట్‌ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్‌ మిల్లులు, జూట్‌ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయలేయడం లేదని కాంగ్రెస్‌, వామపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఏడు దశల్లో పోలింగ్‌
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లకు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే భగబంగోలా, బారా నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే7న, జూన్‌ 1న ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ ఎన్నికలు తొలిదశలో ఏప్రిల్‌ 19న కూచ్‌ బెహర్‌, అలీపు ర్దువార్స్‌, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్‌ 26న డార్జిలింగ్‌, రారు గంజ్‌, బాలూర్‌ ఘాట్‌, స్థానాలకు, మే 7న మూడో దశలో మాల్దా ఉత్తర్‌, మాల్దా దక్షిణ్‌, జంగిపూర్‌, ముర్షిదాబాద్‌ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో మే 13న బహరాంపూర్‌. కృష్ణానగర్‌, రాణాఘాట్‌, బర్ధమాన్‌ పుర్బా, బుర్ద్వాన్‌-దుర్గాపూర్‌, అసన్సోల్‌, బోల్పూర్‌, బీర్భూమ్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఐదో దశలో మే 20న బంగావ్‌, బరాక్పూర్‌, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్‌, హుగ్లీ, ఆరాంబాగ్‌ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మే 26న ఆరో దశలో తుమ్లుక్‌ , కాంతి, ఘటాల్‌, ఝుర్‌ గామ్‌, మేదినీ పూర్‌, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 1న చివరి దశలో డమ్‌ డమ్‌, బరాసత్‌, బసిర్హాట్‌, జయనగర్‌, మధురాపూర్‌, డైమండ్‌ హార్బర్‌, జాదవ్‌ పూర్‌, కోల్కతా దక్షిణ్‌, కల్‌కత్తా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్‌తో ఎన్నికలు పూర్తి అవుతాయి.
పుంజుకున్న సీపీఐ(ఎం), వామపక్షాలు
పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం), వామపక్షాలు పుంజుకున్నాయి. రాష్ట్ర ఆందోళనలు, క్షేత్రస్థాయి పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన సీపీఐ(ఎం) అందుకను గుణంగా కార్యాచరణలోకి వెళ్లింది. గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర స్థాయి నేతలు క్షేత్ర స్థాయికి వెళ్లి ఆందోళనల్లో పాల్గొనేవారు. ఇటీవల కాలం రాష్ట్ర రాజకీయాల్లో యువజన సంఘం కీలక పాత్ర పోషించింది. డీివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ మూడు వేల కిలోమీటర్ల మేర ”ఇన్సాఫ్‌” యాత్ర జరిగింది. ఈ యాత్రలో 12 లక్షల మంది ప్రజలు భాగస్వామ్య మయ్యారు. అనంతరం కలకత్తాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జస్టిస్‌ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా బెంగాల్‌లో సీపీఐ(ఎం), వామపక్షాల పాత్రపై మీడియాలో చర్చనీయాంశమైంది.
మొత్తం ఓట్లు- 7,58,37,778
మహిళలు – 3,73,04,960
పురుషులు – 3,85,32,818
మొత్తం లోక్‌సభ స్థానాలు- 42

Spread the love