Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'బాయి'లో 'బడాయి' పలుకులు

‘బాయి’లో ‘బడాయి’ పలుకులు

- Advertisement -

​సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై పార్టీల ఫోకస్
స్పష్టత లేకున్నా ప్రచార జోరు
రెండేండ్లకోసారి జరగాల్సిన కోల్ బెల్ట్ ఎన్నికలు
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ మాటల తూటాలు
అవినీతి ఆరోపణలే అస్త్రాలుగా విపక్షాల క్యాంపెయిన్
లోపాలపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) పోరాటం

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ (ఎస్సీసీఎల్) గుర్తింపు సంఘం ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికలు ఎప్పుడు అనేది స్పష్టత లేనప్పటికీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఆయా పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. సింగరేణి సంస్థలో చోటుచేసుకున్న రూ. వేలకోట్ల కుంభకోణమే అస్త్రంగా ఎన్నికల ప్రచారానికి పార్డీలు పూనుకున్నాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గెలుపొందాయి. వీటి అధికారిక గడువు సెప్టెంబర్ 2026 వరకు పొడిగించారు. తాజా గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కోల్‌బెల్ట్ ప్రాంతంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మోహరిస్తున్నాయి. ప్రచారాలు, సభలతో కార్మికులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.​సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు కేవలం కార్మిక సమస్యలకే పరిమితం కాకుండా ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 11 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల రాజకీయ భవిష్యత్తును సైతం ప్రభావితం చేస్తాయి.

రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి తదితర 11 మైనింగ్ డివిజన్లలో ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టా త్మకం గా జరుగుతాయి. సింగరేణిలో నేరుగా ఓటు హక్కు కలిగిన శాశ్వత కార్మికులు సుమారు 40 వేల మంది ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు, దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక వ్యాపార వర్గాలను కలుపుకుంటే దాదాపు 4 -5 లక్షల మంది ఓటర్లపై ఎన్నికల ప్రభావం ఉంటుంది. అందుకే కోల్ బెల్ట్ ప్రాంతంపై పట్టు సాధించాలని ఆయా పార్టీలు ప్రయత్నిస్తుం టాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార పార్టీ సంఘం ఐఎన్టీయూసీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా వాడుకునేందుకు ఆయా పార్టీలు, సంఘాలు సిద్ధమయ్యాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ వైఫల్యాలనూ ఎండగట్టేందుకు ముమ్మర ప్రచారానికి షెడ్యూల్ సైతం ఏర్పాటు చేసుకున్నాయి. ‍

​స్పష్టత లేకున్నా ప్రచార పరవళ్ళు
వాస్తవంగా రెండేండ్లకోసారి జరగాల్సిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు తరచూ వాయిదా పడుతూ ఉన్నాయి. సెప్టెంబర్‌లోనూ ఎన్నికలు నిర్వహిస్తారనే నమ్మకం లేనప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) విజయం సాధించింది. ఏకఛత్రాధిపత్యం కొనసాగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. తదనం తరం జరిగిన సింగరేణి ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ) అత్యధిక ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా అవతరించిం ది, కాంగ్రెస్ అనుబంధ సింగరేణి కోల్ మైండ్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా ఉంది. రెండేండ్లకోసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ క్రితం సారి ఎన్నికల్లో గెలిచిన సంఘాలకు ఎనిమిది నెలల పాటు సంస్థ ధ్రువీకరణలు ఇవ్వకపోవడం అప్పట్లో చర్చనీయాం శంగా మారింది.

​వ్యూహ ప్రతివ్యూహాలతో
ఆయా పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సింగరేణిపై పూర్తి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తున్నది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగారు. కార్మికులకు కారుణ్య నియామక పత్రాల పంపిణీ, మెడికల్ బోర్డుల పునరుద్ధరణ వంటి చర్యలతో హడావుడి చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని వదిలి హింద్ మజ్జూర్ సభ(హెచ్‌ఎంఎస్‌)తో కలిసి ప్రచార నిర్వహించడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ‘సింగరేణి బాయి బాట’ చేపట్టారు. మరోవైపు బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’ నిర్వహిస్తున్నది. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కూడా సంస్థలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తూ కార్మికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు మంగళవారం కొత్తగూడెంలో టీబీజీకేఎస్ తరపున కార్మికులతో సమావేశమయ్యారు.

​అవినీతి, ఆరోపణలే ప్రచారాస్త్రాలు
ఈసారి ఎన్నికల అజెండా కేవలం వేతనాలు, ఉద్యోగ భద్రతకే పరిమితం కాలేదు. దాదాపు రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు నిల్వల మాయంపై వస్తున్న ఆరోపణలు, టెండర్లలో అవకతవకలు, సింగరేణి ప్రైయివేటీకరణ ప్రయత్నాలు, డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి.

​సింగరేణిని నిలువునా దోచేస్తున్నారు
సింగరేణిని నిలువునా దోచేస్తున్నారు. ఇటు గుర్తింపు సంఘం, అటు ప్రాతినిధ్య సంఘం, మరోవైపు ప్రభుత్వం.. ఇవేవీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహ రించింది. కార్మికుల కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను రెండేండ్లకోసారి నిర్వహిం చాల్సి ఉండగా.. నాలుగేండ్లకు ఓసారి నిర్వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌‌లో జరగాల్సిన ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సాగదీశారు. ఇప్పుడు కూడా ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందేహాలు ఉన్నాయి. కార్మికుల సంక్షేమం, గనుల అభివృద్ధి ఇవేవీ పట్టని పార్టీలు, ప్రభుత్వాలు ప్రస్తుతం బొగ్గుబావుల్లో హడావుడి సృష్టిస్తున్నాయి. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నికరంగా పోరాడుతోంది.
మందా నరసింహారావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -