డైరెక్టర్‌ శంకర్‌కు భూమి కేటాయింపు సబబే

– తెలంగాణ హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రముఖ సినిమా డైరెక్టర్‌ ఎన్‌.శంకర్‌కు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లాలో 5 ఎకరాల భూమిని స్టూడియో నిర్మాణం కోసం ఇవ్వడాన్ని హైకోర్టు సమర్థించింది. భూమిని కేటాయిస్తూ జీవో నెం.75ను జారీ చేయడాన్ని ఆమోదించింది. ప్రభుత్వం ఊరికే ఏమీ భూమి ఇవ్వలేదని, ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున రూ.25 లక్షలు చెల్లించారని చెప్పింది. 2019లో జీవో నెంబర్‌ 75 జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్‌ 2020లో దాఖలు చేసిన పిల్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం తీర్పులో పేర్కొంది. సినీ రంగానికి, క్రీడారంగానికి చెందిన ప్రముఖులకు భూములు కేటాయించే అధికారం రాష్ట్ర్ర ప్రభుత్వానికి ఉందని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అదే తరహా ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామం సర్వే నెంబర్‌ 8లో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలను శంకర్‌కు కేటాయింపు సమర్ధనీయమని చెప్పింది. శంకర్‌ 40 ఏండ్ల్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారని, స్టుడియో నిర్మాణంతో పలువురు కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పింది. భూమి కేటాయింపును సమర్ధిస్తూ ప్రభుత్వం చేసిన వాదనను ఆమోదించింది.
క్రీడల కోటాలో పారా స్పోర్ట్స్‌ను చేర్చండి
స్పోర్ట్స్‌ రిజర్వేషన్ల కోటాలో పారా స్పోర్ట్‌ క్రీడాకారులను చేర్చాలని, ఆ కోటా కింద ఇచ్చే 2 శాతం రిజర్వేషన్లను వాళ్లకూ అమలు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. స్పోర్ట్స్‌ కోటాపై ప్రభుత్వ జీవో నెం.74లో పారా స్పోర్ట్స్‌ కోటా లేదని, పారా స్పోర్ట్స్‌ కోటాను కూడా అందులో చేర్చాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు చెప్పింది.
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియాకమకాల్లో ఈ రిజర్వేషన్‌ వర్తింపజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన ఆర్‌.నరేష్‌యాదవ్‌ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ బెంచ్‌ తీర్పు చెప్పింది. జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీలో కూడా పారా స్పోర్ట్స్‌ కోటా కింద రిజర్వేషన్లు ఇవ్వాని సూచించింది. ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల్లో స్పోర్ట్స్‌ కోటాలో పారా స్పోర్ట్స్‌ కోటా అమలు చేయాలని ఆదేశించింది.
వాళ్లను డ్రైవర్‌ పోస్టులకు అనుమతించండి
చట్టప్రకారం లైసెన్స్‌ ఉన్న వాళ్లను అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ పోస్టుల భర్తీకి అనుమతించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. రెండేండ్ల హెవీ మోటార్‌ వెయికిల్‌ లైసెన్స్‌ ఉంటే డ్రైవర్‌ పోస్టులకు అర్హులని బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. చట్ట ప్రకారం లైసెన్స్‌ గడువు ముగిసిన ఏడాదిలోగా రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉందని, అయితే బోర్డు నోటిఫికేషన్‌లో ఆ విధమైన అవకాశం కల్పించలేదంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ పి.మాధవీదేవి తీర్పు చెప్పారు. మోటార్‌ వెయికిల్‌ చట్టానికి 2019లో చేసిన సవరణలకు అనుగుణంగా గడువు ముగిసిన ఏడాదిలోగా రెన్యువల్‌ చేసుకున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల పరీక్షల ఫలితాల వెల్లడించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు.
కోర్టుధిక్కరణ కేసులో నోటీసులు
మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఆస్తులను ఏపీ సీఐడీ జప్తు చేయడం, ఆ సంస్థ ఎండీ శైలజకు లుక్‌అవుట్‌ నోటీసు ఇవ్వడాన్ని తప్పుపడుతూ మార్గదర్శి, శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించింది. తమపై కఠిన చర్యలు తీసుకోరాదన్న ఉత్తర్వులకు వ్యతిరేకంగా జప్తు, లుక్‌అవుట్‌ నోటీసు వంటి చర్యలకు ఉపక్రమించడం కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. దీనిని విచారించిన హైకోర్టు వ్యక్తిగత హౌదాలో ఏపీకి చెందిన అధికారులకు నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

Spread the love