పని విధానమే కారణం…

పని విధానమే కారణం...కరోనా సమయం నుండి చాలా సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పించాయి. అయితే కరోనా తర్వాత కూడా ఇదే సదుపాయాన్ని కొన్ని సంస్థలు కొనసాగించాయి. అయితే మరికొందరు వారంలో కొన్ని రోజులు ఇంటి నుండి పని చేసి కొన్ని రోజులు ఆఫీస్‌కి వెళ్ళే విధంగా ఉద్యోగులకు అవకాశమిచ్చారు. దీని వల్ల సంస్థ ఉత్పాదన పెంచుతూనే మహిళా ఉద్యోగులకు తమ వర్క్‌ లైఫ్‌ను బ్యాలన్స్‌ చేసుకునేందుకు కొంత వెసులుబాటు దొరికింది. ఈ పని విధానాన్ని ఈ ఏడాది చాలా సంస్థలు అమలు చేశాయి. ఈ పద్ధతిని హైబ్రీడ్‌ పని విధానం అంటున్నారు. అయితే ఈ పద్ధతి వల్ల మహిళలకు ఇంట్లోనే ఉండి పని చేస్తున్నామనే కాస్త ఆనందం దొరికినా కొన్ని విషయాల్లో మాత్రం భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇది కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రేపటితో ఈ ఏడాది ముగియబోతున్నది. ఈ సందర్భంగా ఈ పని విధానం జంటల మధ్య బంధాన్ని ఎలా కనుమరుగు చేస్తుందో తెలుసుకుందాం…
సాధారణంగా మహిళలకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటి పనులు, ఆఫీస్‌ పనులతోనే సమయం సరిపోతుంటుంది. అలాంటప్పుడు జంటలు ఒకరితో ఒకరు గడపడానికి తగిన సమయం కూడా దొరకదు. కానీ ఇంటి నుండి పని విధానంలో ఈ లోటు కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా వారంలో సగం రోజులైనా ఇద్దరూ ఇంట్లోనే కలిసి పని చేసే అవకాశం దొరుకుతుంది. దీంతో ప్రయాణ సమయం వృథా కాకుండా… ఆ సమయం ఇద్దరూ కలిసి గడపడానికి వెచ్చించవచ్చు. అయితే కొన్ని జంటలు ఇలా మిగుల్చుకోవాల్సిన సమయాన్ని కూడా పనికి కేటాయిస్తున్నట్టు, ఇంట్లో ఉన్నా ఈ అదనపు పని వేళల వల్లే ఇద్దరి మధ్య పొరపచ్ఛాలొస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ భేదాభిప్రాయాలు క్రమంగా ఇద్దరి అనుబంధాన్ని దూరం చేస్తున్నాయని వారంటున్నారు. ఇకపై ఇలా జరగకుండా ఉండాలంటే వేళకు పని ముగించుకోవడం, భాగస్వామికి తగిన సమయం కేటాయించేలా ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి అంటున్నారు.
వ్యక్తిగత సమయం
దాంపత్య బంధం దృఢమవ్వాలంటే ఇద్దరూ కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో ఎవరికి వారు కాస్త వ్యక్తిగత సమయం కేటాయించుకోవడమూ అంతే ముఖ్యం. అయితే హైబ్రిడ్‌ వర్కింగ్‌ కారణంగా చాలా జంటలకు ఈ సమయమే కరువవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ పని విధానంలో భాగంగా ఇద్దరూ కలిసి ఇంట్లో దగ్గరగా పని చేసుకోవడం వల్ల. దొరికిన ఆ కాస్త సమయం కలిసి గడపడానికి వెచ్చించడం లేదంటే ఆ సమయంలో ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంతోనే సరిపోతుందని, ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ ఇద్దరిలో మానసిక ఒత్తిళ్లకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. మరికొంతమంది తమ భాగస్వామి వ్యక్తిగతంగా వారి పనుల్లో నిమగమైనా దాన్ని నెగెటివ్‌ భావనతో చూడడం, వారిపై అనుమాన వ్యక్తిగతంగా వారి పనుల్లో నిమగమైనా దాన్ని నెగెటివ్‌ భావనతో చూడడం, వారిపై అనుమాన పడడంతోనూ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొస్తున్నాయంటున్నారు. అనుబంధంలో చిచ్చుపెట్టే ఈ సమస్యను అధిగమించాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, నమ్మడం, ఎవరికి వారు కాస్త వ్యక్తిగత సమయం కేటాయించుకోవడం దాన్ని గౌరవించడం వంటి అంశాలన్నీ కీలకమే.
అదనపు పనులు వద్దు
హైబ్రిడ్‌ వర్కింగ్‌లో భాగంగా కొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసినంత మాత్రాన అటు ఆఫీస్‌ పనులు, ఇటు ఇంటి బాధ్యతలు ఏమాత్రం తగ్గవు. కాకపోతే ఆఫీస్‌కెళ్లేందుకు వెచ్చించే ప్రయాణ సమయం మాత్రం ఇక్కడ కలిసొస్తుంది. అయితే ఈ సమయాన్నీ అదనపు పనులకు కేటాయించడం వల్ల వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ అదుపు తప్పుతుంది. ఇదే మానసిక ఒత్తిడి, ఆందోళన, యాంగ్లైటీ వంటి సమస్యలకు దారి తీస్తుంది. పోనీ ఈ మానసిక సమస్యల్ని భాగస్వామితో పంచుకుందామంటే కొంత మంది ఈ విషయంలోనూ ఆసక్తి చూపకపోవడం, వాళ్ల పరిస్థితి విన్నా అండగా నిలబడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇద్దరి మధ్య సఖ్యత కొరవడుతుంది. ఇదే అనుబంధాన్ని బీటలు వారేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఇద్దరూ ఇంటి నుంచి పని చేసినా, ఆఫీస్‌కెళ్లినా ప్రతి పనినీ కలిసి పంచుకోవడం, ఒకరి మానసిక సమస్యల్ని మరొకరు పంచుకోవడం అర్థం చేసుకోవడం వల్ల మనకంటూ భాగస్వామి తోడున్నారన్న భరోసా ఉంటుంది. ఈ మద్దతే ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచుతుంది.
డిజిటల్‌ డీటాక్స్‌ అవసరం
ఇంట్లోనే ఉన్నా ఈ రోజుల్లో కొందరు ఫోన్లు, వాట్సప్‌లలోనే మాట్లాడుకోవడం, సందేశాలు పంపుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక వర్క్‌ ఫ్రం హౌం పని విధానంలో బిజీగా ఉన్న భర్యా భర్తల్లో చాలా మంది ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారంట. దీని వల్ల ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపే సమయం కూడా కనుమరుగవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అది అప్పటికప్పుడు అనుబంధపై ప్రతికూల ప్రభావం చూపకపోయినా రోజులు గడిచే కొద్దీ జంటల మధ్య అన్యోన్యతను దెబ్బ తీస్తుందంటు న్నారు. ఇలా జరగకూడదంటే జంటలు రోజులో కాసేపు డిజిటల్‌ డీటాక్స్‌ పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. అలాగే మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ వంటి వాటిని దూరం పెట్టి ఇద్దరూ కలిసి సమయం కేటాయించడమే దీని ముఖ్యోద్దేశం. మీరు ఆఫీస్‌కి వెళ్లినా, ఇంటి నుంచి పని చేసినా ఈ అలవాటును రోజూ కొనసాగిస్తే అనుబంధాన్ని దృఢం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Spread the love