తెలంగాణలోనూ ఇవే ఫలితాలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌
కర్నాటక ఫలితాలే తెలంగాణలో పునరా వృతం కాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని అన్నారు. భారత్‌ జోడోయాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌ వచ్చింద న్నారు. జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌ వరుస విజయాలు సాధిస్తోందని ధీమా వ్యక్తం
చేశారు. కర్నాటక ఫలితాలనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాయకులు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె జానారెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. హిమాచల్‌లో తొలి విజయం, కర్నాటకలో రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామన్నారు. చివరికి ఫైనల్స్‌ లో 2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్‌ జెండా ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడం ద్వారా మోడీని, జేడీఎస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌ ను ఓడించామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలవొద్దని ప్రయత్నించిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆలోచనలను కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించారని చెప్పారు. కర్ణాటకలో మత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి మతం ఒక విశ్వాసమే కానీ..రాజకీయ అంశం కాదన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టి మోడీ నాయకత్వాన్ని ఓడించారని తెలిపారు.
భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ నఫ్రత్‌ చోడో అంటూ ఇచ్చిన సందేశాన్ని విశ్వసించి కర్ణాటక ప్రజలు మోదీని ఓడించారన్నారు. రాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలను కోవడం బీజేపీ మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ సర్వశక్తులు ఒడ్డిందనీ, ఆ ఫలితాలు తమకు వెయ్యి ఎనుగుల బలానిచ్చాయని తెలి పారు. దక్షిణ భారతంలో బీజేపీకి స్థానం లేదనీ, అక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారని గుర్తు చేశారు. కుట్రలు, కుతంత్రాలతో జేడీఎస్‌ను గెలిపించి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న కేసీఆర్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని వ్యాఖ్యానించారు.కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు బీఆర్‌ఎస్‌ కు ఇష్టం లేదనీ, అందుకే కర్నాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోవని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారన్నారు. ‘కాంగ్రెస్‌ గెలుపును కెేటీఆర్‌ ప్రజాతీర్పుగా అభివర్ణించలేదు. కర్ణాటక తీర్పు తెలంగాణ మీద ఉండదు అంటున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు వారికిష్టం లేదు. మోడీ ఓడిపోతే టీఆర్‌ఎస్‌ వాళ్లు ఎందుకు అంత బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు’ అన్నారు.

Spread the love