Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమాచార హక్కు చట్టం పౌరుడి వజ్రాయుధం

సమాచార హక్కు చట్టం పౌరుడి వజ్రాయుధం

- Advertisement -

సమాచారం అందించే బాధ్యత పబ్లిక్‌ అథారిటీలది
ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులమని మరువొద్దు : రాష్ట్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌ రెడ్డి
నల్లగొండ కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పారదర్శకత, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజలు అడిగిన వెంటనే సమాచా రాన్ని అందించే బాధ్యత పబ్లిక్‌ అథారిటీలపై ఉందని అన్నారు. ప్రతి పబ్లిక్‌ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతగా సేవలు అందించేందుకు సమాచార హక్కు చట్టం ఉపయోగ పడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని మరువరాదని సూచించారు. అధికార యంత్రాంగాలు పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా సమాచార హక్కు చట్టం, సెక్షన్‌ 4(1)బి ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా ఉండాలని చెప్పారు.

ముఖ్యంగా పబ్లిక్‌ అథారిటీ బాధ్యతలు, విధులకు సంబంధించి ఎప్పటికప్పుడూ 4(1)బి రిజిస్టర్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని, వీటన్నిటి గురించి ప్రజలకు తెలిసే విధంగా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందన్నరు రాష్ట్రవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం కింద 1,20,000 దరఖాస్తులు వస్తే లక్ష మందికి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 15000 నుంచి 20వేల వరకు అప్పీల్స్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌కు వస్తున్నాయన్నారు. పది నెలల్లో 15 వేల కేసులను రాష్ట్ర సమాచార కమిషన్‌ పరిష్కరించినట్టు వెల్లడించారు. కావాలని సమాచారం ఇవ్వని 15 మంది పౌర సమాచార అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. 18 జిల్లాల్లో రాష్ట్ర సమాచార కమిషన్‌ పర్యటించిందని, 4, 5 సంవత్సరాల పాత కేసులు అన్నింటినీ పరిష్కరించామని అన్నారు. ప్రస్తుతం కమిషన్‌ వద్ద 10 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మే 15 నాటికి రెవెన్యూ, మున్సిపల్‌ తప్ప తక్కిన అన్ని కేసులనూ పరిష్కరిస్తామని చెప్పారు. పీఐవోలు, అధికార యంత్రాంగాలు ప్రజల పక్షాన ఆలోచించి అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు.

రాష్ట్ర సమాచార కమిషన్‌ కమిషనర్‌ దేశాల భూపాల్‌ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగాలు, పీఐఓలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. కమిషనర్‌ భోరెడ్డి అయోధ్యరెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడూ 4(1) (బి) రిజిస్టర్‌ వివరాలను అప్‌డేట్‌ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందన్నారు. కమిషనర్‌ పివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంలోని 6(3) కింద దరఖాస్తును బాగా పరిశీలించి, చదివి ఇతర పీఐఓలకు పంపించాలని సూచించారు. మొదటి అథారిటీ సరైన విధంగా చర్య తీసుకుంటే రెండో అప్పిలెట్‌ అథారిటీకి ఎలాంటి అప్పీల్స్‌ రావని చెప్పారు. కమిషనర్‌ మోషిన్‌ పర్వీన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర సమాచార కమిషన్‌ ద్వారా వచ్చే నోటీసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫోర్‌ వన్‌ బి రిజిస్టర్‌, దరఖాస్తుల రిజిస్టర్‌, ఫస్ట్‌ అప్పిలేట్‌ అథారిటీ తదితర అంశాలను వివరించారు. జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా ఎప్పటికప్పుడూ దరఖాస్తులపై జిల్లా, మండల అధికారులతో సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్‌, రెవెన్యూ అదనపు కలెక్ట్‌ జె.శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌ రెడ్డి, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, ఆర్‌డీఓలు, జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -