కృష్ణా జలాలపై హక్కులను వదులుకున్నారు

– రాష్ట్రానికి తీరని అన్యాయం చేశావు
– మాజీ సీఎం కేసీఆర్‌కు చల్లా వంశీచంద్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను వదులుకుని తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత అన్యాయం చేశారని ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు గురువారం మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన అన్యాయంపై ఆయన ఆధారాలతో సహా బహిరంగ లేఖ రాశారు. చేతగానితనంతో రాష్ట్రం హక్కులు వదులుకుని తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర మీదని పేర్కొన్నారు. తెలంగాణ వాటాగా న్యాయంగా రావాల్సింది 575 టీఎంసీనే…కేసీఆర్‌ 299 టీఎంసీలకే కేంద్రం వద్ద అంగీకరించారని తెలిపారు. న్యాయమైన వాటాను వదులుకుని కృష్ణా పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు కట్టకుండా, పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకుండా తెలంగాణను బీడు చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని విమర్శించారు. కమిషన్ల కోసం కాళేశ్వరం పేరుతో నకిలీ కట్టడాలు చూపించి కేసీఆర్‌ వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. మేడిగడ్డ సందర్శన పేరుతో బీఆర్‌ఎస్‌ చేసే సర్కస్‌ ఫీట్లను తెలంగాణ అసహ్యించుకుంటోందని తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే, రాష్ట్రానికి న్యాయమైన వాటా తెలంగాణకు దక్కే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఎస్‌ఎల్బీసీ, ఆర్డీఎస్‌ విస్తరణ, మహబూబ్‌నగర్‌లోని 10 టీఎంసీల ఎత్తిపోతల పథకాలు, పాలమూరు ఎత్తిపోతల పథకం, బీమాను ఎందుకు నిర్లక్ష్యం చేశారో కేసీఆర్‌ తెలంగాణకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.సంగం బండ రిజర్వాయర్‌లో బండ పగలగొడితే 20వేల ఎకరాలకు నీరు అందుతుందని మొత్తుకున్నా కేసీఆర్‌ పట్టించుకోలేదని తెలిపారు. సంగం బండ బాధితులకు న్యాయం చేస్తూ, ఆగమేఘాల మీద నిధుల విడుదల చేసిన సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Spread the love