ప్రజల గొంతుకగా పత్రికలు నిలవాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మన బాధ్యత : ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్
విద్యా, వైద్యం ప్రజల హక్కు : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
సెప్టెంబర్ 25 వరకు వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ ఉత్సవాలు : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్
సమాజంలో నెలకొన్న అసమానతలపై పోరాటంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అన్నారు. పత్రికలు ప్రజల గొంతుకగా నిలిచి, సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలకు అండగా నిలవాలని చెప్పారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికలాంగుల వాయిస్’ మాసపత్రిక 12వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యాంగ హక్కులు–భావ ప్రకటన స్వేచ్ఛ–సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ పెట్టారు. పత్రిక సంపాదకులు ఎం.అడివయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 12వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను జ్యోతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడే శక్తులకు పత్రికలు దోహదపడతాయన్నారు. వికలాంగులకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ‘వికలాంగుల వాయిస్’ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళా వికలాంగులపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏండ్ల మోడీ పాలనలో దేశంలో అసమానతలు పెరిగాయని తెలిపారు. ప్రశ్నించే వారిని అర్బన్ నక్సల్స్ అని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దోపిడీ, అసమానతలు లేని వ్యవస్థ కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.అబ్బాస్ మాట్లాడుతూ.. పత్రికలు ప్రజల హక్కుల కోసం జరిగే ఉద్యమాలకు వారధిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని జైళ్లలో పెడుతున్నారని, వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే హక్కు పాలకులకు ఎక్కడిదని నిలదీశారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. విద్య, వైద్యం పేదలకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం వల్ల పేదలు రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారానే పేదలు సాధించుకున్న హక్కులు, చట్టాలను పరిరక్షించుకోగలమని స్పష్టం చేశారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం పెంపొందించేందుకు 2014లో ‘వికలాంగుల వాయిస్’ మాసపత్రికను ప్రారంభించామని తెలిపారు. 12 ఏండ్లుగా పత్రికను కొనసాగించేందుకు పట్టుదలతో కృషి చేస్తున్నామని చెప్పారు. వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలను వారికి చేరువ చేస్తూ చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కులను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. వికలాంగుల హక్కుల చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వికలాంగుల వాయిస్’ మాసపత్రిక 12వ వార్షికోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.వరమ్మ, అధ్యక్షులు కె.వెంకట్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. చిన్న వయసులోనే వైకల్యాన్ని గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.పద్మశ్రీ మాట్లాడుతూ.. వికలాంగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారిలో చైతన్యం తీసుకురావడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, ఉపాధ్యక్షులు కె.యశోద, బి.స్వామి, వి.ఉపేందర్, సహాయ కార్యదర్శులు నాగలక్ష్మి, కాశప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగారయ్య, దుర్గ, షాహిన్‌బేగం, రమేష్, లలిత, వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



