పరీక్షల పవిత్రత దెబ్బతింది

పరీక్షల పవిత్రత దెబ్బతింది– మాకు సమాధానాలు కావాలి
– నీట్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై సుప్రీం సీరియస్‌
– కేంద్రానికి, ఎన్‌టీఏకు నోటీసులు
– జులై 8కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : నీట్‌ యుజి 2024 పరీక్షా ఫలితాలను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి సుప్రీం కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై మీ స్పందన ఏమిటో తెలియచేయాల్సిందిగా వారిని కోరింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ ఇతర సంబంధిత కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ నిర్వహణపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. పేపర్‌ లీక్‌ అయిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం స్పందించింది. పరీక్షల పవిత్రత దెబ్బతిందని, అందువల్ల దీనిపై తమకు సమాధానాలు కావాలని కోర్టు కోరింది. అయితే అడ్మిషన్ల కోసం జరుగుతున్న కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలుపు చేయడానికి తిరస్కరించింది. యథాప్రకారం కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమనుల్లాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వద్ద పెండింగ్‌లో వున్న పిటిషన్‌తో శివంగి మిశ్రా, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి జులై 8న విచారిస్తామని తెలిపింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి అవకతవకలు జరిగాయని వివిధ దశల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. మార్కుల స్కోర్లలో అనేక వ్యత్యాసాలు వున్నాయని, కొంతమంది విద్యార్ధులకు ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యత ఇచ్చారని సుప్రీం విచారించిన తాజా పిటిషన్‌ పేర్కొంది. మే 5న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్షలు నిర్వహించాలని ఆ పిటిషన్‌ కోరింది. గ్రేస్‌ మార్కులు కలపడంలో కూడా చాలా తేడాలున్నాయని, వాటిల్లో లాజిక్‌ కనబడడం లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఈ పిటిషనర్లు పేర్కొన్నారు. ‘పైగా పరీక్షా సమయాన్ని కొంత మేరకు కోల్పోవడం వల్లనే ఈ గ్రేస్‌ మార్కులు కలిపామని కారణం చెబుతున్నారని, ఆ పరీక్షా సమయం కోల్పోవడమేంటో ఇంతవరకు వెల్లడించలేదని వారు పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణలో మోసాలు జరిగే ప్రమాదాలువున్నాయని, శాస్త్ర, సాంకేతిక, వైద్య పరిజ్ఞానానికి సంబంధించి లోతైన అవగాహన కలిగివుండాల్సిన ఇటువంటి పరీక్షల్లో మోసాలు లేదా అక్రమాలు జరిగితే అది అంతిమంగా రోగుల ప్రాణాలకే ముప్పు తీసుకువస్తుందని పిటిషన్‌ హెచ్చరించింది.

Spread the love