గోతులు తవ్వి వదిలేశారు…

– వర్షపు మడుగులా గ్రామపంచాయతీ కార్యాలయ గోతులు
– వృద్ధి చెందుతున్న దోమలు..జ్వరాల బారిన ప్రజలు
– అధికారుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రజలకు జవాబుదారిగా ఉద్యోగ భాద్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులు భాద్యతారాహితంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు మండల అధికారుల పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గ్రామాలలో నెల కొన్న సమస్యలను, పారిశుద్య పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీ కారదర్శి సైతం మా గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని దబ్బనూతుల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మా ణం కోసం ఐటిడీఏ ద్వారా రూ.20 లక్షల నిధులు కేటాయించారు. నూతన భవన నిర్మాణం కోసం పనులు దక్కించుకున్న గుత్తేదారు గత 15 రోజుల క్రితం గోతులు తీసి బేస్‌మెంట్‌ లెవెల్‌ ఫిల్లర్‌ ఏర్పాటు చేసి వదిలేశాడు. తీసిన గోతులు పూడ్చక పోవడంతో పాటు వర్షాకాలం కావడంతో తీసిన గోతులలో వర్షపు నీరు నిలిచి పంచాయతీ కార్యాలయ ప్రదేశం వర్షపుమడుగులా దర్శనం ఇస్తోంది.
వృద్ది చెందుతున్న దోమలు
నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం కోసం పనులు దక్కించుకున్న గుత్తేదారు గత పదిహేను రోజుల క్రితం గోతులు తీసి వదిలి వేశాడు. దీంతో ఆ గోతులలో వర్షపు నీరు చేరి మడుగులా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందడంతో పాటు చుట్టు పక్కల ఉన్న కుటుంబాలు జ్వరాల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామస్తుల ఆరోపణల్లో నిజం లేదు : కణితి సురేష్‌ జీపీ కార్యదర్శి
తాను చుట్టపు చూపుగా వస్తున్నానని గ్రామస్తులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తాను ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జీపీ కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండడం జరుగుతుందని నవతెలంగాణకు తెలిపారు. నిత్యం గ్రామాల్లో తిరుగుతూ పారిశుధ్య పనులను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. డ్రైడే సందర్భంగా ఇంటింటికి తిరుతూ పారిశుధ్య కార్మికుల చేత నీటి తొట్లల్లో నీళ్లు పారబోయడంతో పాటు ఆయిల్‌ బాల్స్‌ వదలడం జరుగుతుందన్నారు. పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న సోంది వెంకట్రాముడు అనే వ్యక్తి బెల్ట్‌ షాపు నిర్వహిస్తూ ఉంటాడని అతను బీరు సీసాలు అమ్ముకోవడం కోసం వాటిలో నీరు నిల్వ ఉండడం వలన లార్వా పెరిగి ఆ కుటుంబం జ్వరాని బారిన పడిందన్నారు. భవన నిర్మాణ సమయంలో పనులకు వచ్చిన వారిని వెంకట్రాముడు అనే వ్యక్తి తిట్టడం మూలంగానే పనులు చేపట్టడానికి వచ్చిన కూలీలు తిరిగి వెళ్లి పోయారని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడడం జరిగిందని రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
గ్రామస్తులు గుత్తేదారును ఇబ్బందులకు గురి చేశారు : వెంకటేశ్వరరావు ఐటీడీఏ ఏఈఈ
గ్రామపంచాయతీ నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం ఐటిడీఏ ద్వారా రూ.20 లక్షల నిధులు మంజూరు అయ్యాయని పనులు త్వరిత గతిన పూర్తి చేసేందుకు షెట్టర్లు ఏర్పాటు చేసి పిల్లర్స్‌ కూడా పోయడం జరిగింది. గ్రామస్తులు వినాయక చవితి పేరుతో గుత్తేదారును అధిక మొత్తంలో డబ్బు లు డిమాండ్‌ చేయడంతో పాటు పనులు చేయ డానికి వచ్చిన కూలీలను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం జరిగింది. దీంతో గుత్తేదారు పనులను మధ్యలో నిలిపివేశారు. వచ్చిన నిధులు వెనక్కి వెళతాయని గ్రామస్తులకు పంచాయతీ కార్యదర్శికి సైతం తెలియజేయడం జరిగింది. అవసరమైతే పనులు బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు నిర్మించి వదిలి వేస్తామని ఆయన నవతెలంగాణకు తెలిపారు.

Spread the love