ఘనంగా హనుమాన్ దీక్ష హోమ కార్యక్రమం
నవతెలంగాణ – గీసుగొండ
గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో పురాతన శ్రీ ఆది మహాలక్ష్మి సమేత శ్రీ పాంచాల రాయస్వామి దేవాలయంలో హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో మండల దీక్ష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వాములు కలిసి ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “సర్వేజనా సుఖినోభవంతు – లోకా సమస్తా సుఖినోభవంతు” అంటూ భక్తులు ఏకనామ సంకీర్తనలు చేస్తూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు. 40 రోజుల పవిత్ర దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు ఆంజనేయస్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు కొండపాక రాజగోపాలాచార్యులు, సంతోష్ చార్యులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో యజ్ఞయాగాదులకు ఆధ్యాత్మిక, వైజ్ఞానిక మరియు పర్యావరణ పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. యజ్ఞాల్లో ఉపయోగించే నెయ్యి, ఔషధ మూలికలు, వేదమంత్రోచ్చారణల ప్రభావంతో పరిసరాలు శుద్ధి అవుతాయని తెలిపారు. యాగ భస్మం పంట పొలాలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
యజ్ఞయాగాదులు మనశ్శాంతిని పెంపొందించడమే కాకుండా త్యాగ భావన, నిస్వార్థతను పెంచుతాయని, దేవతల అనుగ్రహంతో సుఖశాంతులు కలుగుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో బొమ్మగాని రాజు,రాజబోయిన బిక్షపతి. జున్ను అశోక్, అట్ల కట్టమల్లు, శ్యామల నరేందర్, తండ మహేందర్, తండ దిలీప్, కందగట్ల లక్ష్మణ్ రాజబోయిన కోటి, తిమ్మాపురం శ్రీకాంత్, నగరబోయిన బిక్షపతి మాలాధారణ స్వాములు, గ్రామ ప్రజలు,మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హోమ కార్యక్రమం అనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.



