వారి భవిష్యత్‌కు స్వచ్ఛంద సంస్థలు బంగారు బాటలు వేయాలి
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు జి.వినోద్, నవీన్ యాదవ్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందనతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నారుల చిరునవ్వులో ఎంత ప్రశాంతత ఉంటుందో.. వారి అల్లరిలో అంత ఆహ్లాదకరం ఉంటుందన్నారు. అటువంటి చిన్నారులను పనిలోకి పంపకుండా బడులకు పంపే విధంగా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని కోరారు.
కార్మిక శాఖ అధికారులు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలతోపాటు తల్లిదండ్రులు, ప్రజలు ఆలోచించి అందరికీ అవగాహన కల్పించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. కొంతమంది తల్లిదండ్రులు వారి ఆర్థిక ఇబ్బందులతో చిన్నారులను చదువుకునే సమయంలో వివిధ పనుల్లో పెట్టి బాలుర కోరికలు, ఆశలు, బాల్యం గుర్తులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల్లో బాల కార్మికులను నియమించకూడదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు ఎంతో నాణ్యతతో విద్యా బోధనలు చేస్తున్నాయని, చిన్నారులను అందులోకే పంపాలని కోరారు. అక్కడ అన్ని వసతులతో విద్యాబోధన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్, డిప్యూటీ లేబర్ కమిషనర్ జాన్సన్ , చైల్డ్ రైట్స్ సామాజికవేత్త శాంతి సిన్హా తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



