విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి : మంత్రి పొంగులేటి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలపై నిరంతర నిఘా అవసరమని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తుగానే అన్ని అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో సోమవారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తూ రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుని వారం రోజులపాటు కొనసాగొచ్చని వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిం చాలని సూచించారు. రాష్ట్రంలో ఈనెల ఒకటి నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు ఉందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగించాలని స్పష్టం చేశారు. వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని జిల్లాల అధికారులు నిరంతర అప్రమత్తతతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



