ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం ఈ ప్రక్రియ
గ్రామ సభలో పెట్టి ఓటరు లిస్టు తయారు చేయాలి :
సర్‌పై అవగాహనా సదస్సులో పరకాల ప్రభాకర్, మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో రక్తపాతం లేని నరమేధమే కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ అని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యులు మాడభూషి శ్రీధర్, శాసన మండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘సర్‌పై అవగాహన’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సర్ అంశాన్ని మీడియా, రాజకీయ పార్టీలు ఎన్నికల కోణంలో చూస్తున్నాయన్నారు. అందువల్ల దీని అసలు విశ్వరూపం బహర్గతం కావటం లేదని తెలిపారు. బెంగాల్‌లో 93లక్షలు, తమిళనాడులో 97లక్షలు,బీహార్‌లో 63లక్షలు, కేరళంలో 24లక్షల ఓట్లను తీసేశారని గుర్తు చేశారు. ఎన్నికలు జరగని రాష్ర్టాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 16.5కోట్ల ఓట్లను ఏరి వేసేందుకు ఈసీ లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే 6.5కోట్ల ఓట్లను సర్ పేరుతో తొలగించిందని పేర్కొన్నారు. తీసేసిన ఓటర్ల పరిస్థితి ఏంటి? వారి గురించి ఎవరు మాట్లాడాలని ప్రశ్నించారు. గెలిచిన పార్టీకీ, ఓడిన పార్టీకీ ఓటు లేనోళ్లతో ఎలాంటి అవసరమూ ఉండబోదని, అందుకే ఆయా పార్టీల నేతలు నోరు మెదపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తీసేసిన ఓటర్లను కూడగట్టి సంఘం పెట్టాలని సూచించారు.దీన్ని ప్రజలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. గ్రామ సభలు నిర్వహించి ఓటర్ల ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు.
మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ సర్ పరిణామాలను గమనిస్తే ఓటు లేని వారిని సిటిజన్లు అనటానికే అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ప్రమాకరంగా ఉందని హెచ్చరించారు. ఇది ఒక్క సర్‌తో ఆగుతుందా? లేక ఇంకెక్కడికి పోతుందో? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. సమస్యలన్నీ దీనితోనే మొదలవుతాయని చెప్పారు. జీవించే హక్కు అసలు ఉంటుందా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. ఓటు చాలా విలువైందని, మనం ఆర్థికంగా కోటీశ్వరులం కాకపోయినా.. ‘ఓటీ’శ్వరునిగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఓటేయకపోతే చనిపోయినకిందే లెక్క అనే ప్రచారం కూడా ఉందని గుర్తు చేశారు. అంత విలువ కలిగిన ఓటు పోయిన తర్వాత సామాన్యులకు గుర్తింపేదని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే..భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య భవిష్యత్తును ప్రతికూలంగా ప్రభావితం చేసే సమస్యగా ఉందని హెచ్చరించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో ఒక సెక్షన్‌కు మాత్రమే హక్కులుంటాయన్నారు. ఓటు హక్కు అనేది మాత్రం అందరికీ సమానమైందని తెలిపారు. ముఖేష్ అంబానీ అయినా..గేటు కీపర్ అయినా పోలింగ్ కేంద్రం వద్దకు పోయి ఓటు వేయాల్సిందేనని గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాలను చూస్తే రాబోయే కాలంలో మానవ హక్కులు ఉంటాయా? లేదా? అని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ప్రశ్నించేవారిని వివిధ రూపాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు తొలగించే ప్రక్రియ మొదలు, ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు, బెదిరింపులు, చివరికి మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీలను సైతం గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురిచేయటం, అప్పటికీ లొంగకపోతే పార్టీలను చీల్చటం, ఈడీ, సీబీఐ ప్రయోగాలు.. తదితర రూపాల్లో లొంగదీసుకునే విధానం కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, అనుసరిస్తున్న పద్దతలు వల్ల బొద్దింకలు పుట్టుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు.
రక్తపాత రహిత రాజకీయ నరమేధమే ‘సర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



