పదవీ కాలం పొడగించాలి

– 1994-96 మాదిరి రెండేళ్లు పెంచాలంటున్న సర్పంచ్‌లు
– ఈ నెలాఖరుతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు
– ప్రత్యేక పాలన వద్దు.. పదవీ కాలం పొడగింపే కావాలి
– నిధుల్లేక.. బిల్లులు రాక పంచాయతీలు డీలా
– ప్రభుత్వంపై వత్తిడి పెంచే దిశగా సర్పంచ్‌లు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఐదేళ్ల పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రజా ప్రతినిధుల పదవి కాలం ముగిసే లోపే ఎన్నికలు జరపాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు తమ పదవి కాలాన్ని రెండేళ్ల పాటు పొడగించాలనే కొత్త డిమాండ్‌ను తెరమీదికి తెస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలన వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదవి కాలం పొడగించాలనే కొత్త డిమాంత్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు సర్పంచ్‌లు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్‌ జిల్లాలో 467 పంచాయతీ లున్నాయి. వీటితో పాటు వేలాది వార్డులున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న 1613 గ్రామ పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఐదేళ్ల పదవి కాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. పదవి కాలం ముగిసిన వెంటనే సర్పంచ్‌లు, వార్డు సభ్యులంతా కూడా మాజీలవుతారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అందుకు అనుకూల పరిస్థితులేకపోవడంతో వాయిదా తప్పట్లేదు. పంచాయతీల్లో పరిపాలనా వ్యవహారాలు నడిచేందుకు వీలుగా ప్రత్యేక అధికారుల్ని నియమించడం లేదంటే ప్రస్తుత సర్పంచ్‌ల పదవి కాలాన్ని కొంత కాలం పాటు పొడగించడం ఇందులో ఏదో విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ నెల 31తో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవి కాలం ముగి యనున్నందున అంతలోపు ఎన్నికలు జరపాలి. కానీ..! నవంబర్‌ 30 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చిలో పార్ల మెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోపే సర్పంచ్‌ల పద వి కాలం ముగుస్తున్నందున అంతలో ఎన్నికలు జరపడం వీలుకాని పరిస్థితి ఉంది. పైగా 2018లో వచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. అప్పట్లో నిర్ణయించిన రిజర్వే షన్లు పదేళపాటు కొనసాగాల్సి ఉంది. అంటే చట్ట సవరణ చేస్తే తప్ప మార్పు చేయడం వీలుకాదంటున్నారు. పైగా బీసీ జన గనన చేయాలనే డిమాండ్‌ ఉంది. జనాభా లెక్కలు తేలాకనే రిజర్వేషన్ల విషయంలో స్పష్టత రానుంది. ఎన్నికలు జరిపే పరిస్థితులు లేకపోవడమే కాకుండా ఇలాంటి సాంకేతిక సమస్యలున్నందున తక్షణమే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాల్లేవని అధికారులు చెబుతున్నారు.
పదవి కాలం పొడగింపు డిమాండ్‌
గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. 1994-96లో చేసిన మాదిరిగా సర్పంచ్‌ల పదవి కాలాన్ని రెండేళ్ల పాటు పొడగించాలని పలువురు సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పట్లో కూడా సర్పంచ్‌ల పదవి కాలం ముగియకముందే ఎన్నికలు జరపలేకపోయారు. దీంతో రెండేళ్ల పాటు పాత సర్పంచ్‌లకే పదవి కాలాన్ని పొడగించారు. ప్రస్తుతం కూడా సర్పంచ్‌ల పదవి కాలాన్ని రెండేళ్ల పాటు పొడగించాలని కోరుతున్నారు. తొమ్మిది నెళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావట్లేదు. పైగా వివిద పద్ధుల కింద చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా పంచాయతీలకు పది నుంచి రూ.30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సర్పంచ్‌ల పెండింగ్‌ బిల్లుల్ని చెల్లించాలనే డిమాండ్‌ కూడా తెరమీదికి వచ్చింది. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం స్పందించారు. సర్పంచ్‌లు గ్రామానికి సంబంధించి క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ దామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాల ఇతర పనుల్ని చేశారు. వాటికి సంబంధించిన బడ్జెట్‌ సకాలంలో విడుదల కాకపోవడంతో గత ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. వీటన్నిటి దృష్టా ప్రస్తుత సర్పంచ్‌ పదవి కాలాన్ని రెండేళ్లు పొడగిస్తే ప్రజలకు పరిపాలనా పరమైన విషయాల్లో ఏలాంటి ఇబ్బందులు రావనే అభిప్రాయాన్ని పలువురు సర్పంచ్‌లు వ్యక్తం చేస్తున్నారు. పైగా కొత్త ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఆయా శాఖలకు నిధులు కేటాయించనుంది. దీంతో పంచాయతీల్లో కొత్త పనులు చేయడమే కాకుండా పాత వాటికి కూడా నిధులొస్తాయి. దీంతో పాత బిల్లులు క్లియర్‌ అయితే పాత సర్పంచ్‌లకు కొత్త ఊరట లభిస్తుందని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఆయా మండలాల్లోని సర్పంచులు స్థానిక ఎంపీడీఓలకు వినతి పత్రాలిస్తున్నారు. సర్పంచుల పదవి కాలాన్ని పొడగించాలని, ప్రత్యేక అధికారుల పాలన పెట్టొద్దంటూ సిద్దిపేట, సిద్దిపేట అర్బన్‌ మండలాల్లో పలువురు సర్పంచ్‌లు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు వినతి పత్రం ఇచ్చారు.
ప్రత్యేక అధికారులా…? పదవి కాలం పొడగింపా..?
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరో 11 రోజుల్లో సర్పంచ్‌ల పదవి కాలం ముగియనున్నందున ఇంతలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఉన్నది. వారి పదవి కాలం ముగిసిపోనున్నందున చెక్‌ పవర్‌ చెల్లదు. దీంతో సర్పంచ్‌ల పదవి కాలాన్ని పొడగించాల్సి ఉంది. లేదంటే ప్రత్యేక అధికారుల్ని నియమించాలి. గతంలో అనేక సార్లు పంచాయతీ ఎన్నికల్ని సకాలంలో నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. అయితే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులనే ప్రత్యక అధికారుల్నిగా నియమిస్తారా..? లేక ఎంపీడీఓలు, ఇతర అధికారుల్ని కూడా మేజర్‌ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తారా…? అనేది చూడాలి. సర్పంచ్‌లు కోరుతున్నట్లు పదవి కాలాన్ని పొడగిస్తారా చూడాలి.
రాష్ట్రంలో అత్యధికమంది సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లున్నారు. వాళ్లకు పదవి కాలాన్ని పొడగించడం ద్వారా ప్రభుత్వానికి లాభమా నష్టమా అనేది కూడా పరిశీలించే అవకాశముంది. లేదంటే పదవి కాలం పెంచి సర్పంచ్‌లందర్నీ కాంగ్రెస్‌ వైపు తిప్పుకునే అవకాశమూ లేకపోలేదంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల పేరిట కాంగ్రెస్‌ తమ పట్టును పెంచుకుంటుంది. అలాగే గ్రామ పంచాయతీల్లోనూ పట్టు బిగించేందుకు ఏ రూపంలో ప్రయత్నిస్తుందో చూడాలి.

Spread the love