అయోధ్య రామమందిర విరాళాల్లో నిబంధనల మార్పుతో నిలువు దోపిడీ
తేలని చోరీ గుట్టు .. మధ్యంతర నివేదికలో సమాధానం లేని ప్రశ్నలెన్నో ..
దొంగతనం జరిగినట్టు సిట్ ధ్రువీకరణ .. 40 రోజుల్లో 70 ఘటనలు.. సీసీటీవీలో నిక్షిప్తం
ఆరుగురి నుంచి రూ.78.94 లక్షల నగదు స్వాధీనం..
నాలుగేండ్లుగా ఆడిట్ హెచ్చరికలను పట్టించుకోని ట్రస్ట్.. భద్రతా వ్యవస్థలో తీవ్ర లోపాలున్నాయని వెల్లడి.. ట్రస్ట్ అగ్రనేతల బాధ్యతపై సిట్ మౌనం
న్యూఢిల్లీ : అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మధ్యంతర నివేదిక కీలక విషయాలను బయటపెట్టింది. హుండీల లెక్కింపు సమయంలో నగదు చోరీ జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన సిట్… భద్రతా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలు, నాలుగేండ్లుగా ఆడిట్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన విషయాలను ప్రస్తావించింది. అయితే ఎంత డబ్బు చోరీ అయ్యింది? దీనికి తుది బాధ్యులెవరు? ట్రస్ట్ అగ్రస్థాయి నాయకుల పాత్ర ఏమిటి? వంటి కీలక ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడిది పలు అనుమానాలకు దారి తీస్తోంది.
నేపథ్యం..
జూన్‌లో రామమందిర కానుకల దుర్వినియోగం, నగదు చోరీపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్వతంత్ర విచారణ కోరింది. జూన్ 17న యూపీ హోం శాఖ సిట్‌ను ఏర్పాటు చేసింది. కేవలం ఆరు రోజుల విచారణ అనంతరం జూన్ 23న తొమ్మిది పేజీల మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇందులో సిట్ ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సిఫారసు చేసింది. అయితే అప్పటి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, వీహెచ్‌పీ నేత చంపత్ రాయ్ పేరును మాత్రం నివేదికలో ప్రస్తావించలేదు. ట్రస్ట్ సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా, లెక్కింపు బాధ్యతలు చూసిన అధికారుల పర్యవేక్షణ వైఫల్యాలను ప్రస్తావించినప్పటికీ.. ట్రస్ట్ అగ్రస్థాయి నిర్ణయాధికారులు, నేతల బాధ్యతపై స్పష్టమైన అభిప్రాయం వెల్లడించలేదు.
నిర్వహణలో లోపాలు
వేర్వేరు హుండీల్లో వచ్చిన నగదును విడిగా లెక్కించకుండా ముందుగానే కలిపేయడం అత్యంత తీవ్రమైన లోపంగా సిట్ పేర్కొంది. దీని వల్ల ఏ హుండీలో ఎంత మొత్తం వచ్చిందో తర్వాత గుర్తించడం అసాధ్యమైందని వివరించింది. ఇది పారదర్శకత, జవాబుదారీతనాన్ని దెబ్బతీసిందని నివేదిక పేర్కొంది. బంగారం, వెండి నిర్వహణలోనూ నిర్లక్ష్యం జరిగిందని వెల్లడించింది. విలువైన వస్తువులను తూకం వేయడం, ఫొటోలు తీయడం, రికార్డులు నమోదు చేయడం, సీల్ చేయడం వంటి ప్రక్రియలను అనేక సందర్భాల్లో పాటించలేదని సిట్ తెలిపింది. కొంతమంది భక్తులకు రసీదులు కూడా ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. లాకర్లలో తనిఖీ చేసిన 11 విలువైన వస్తువులు ఉన్నట్టు గుర్తించింది.
సీసీటీవీలో బయటపడిన చోరీలు
ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన సిట్‌కు చోరీల ఘటనలు బయట పడ్డాయి. సుమారు 70 సందర్భాల్లో సిబ్బంది నగదును బట్టల్లో, జేబుల్లో, చెప్పుల్లో దాచుకుని బయటకు తీసుకెళ్లి నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే సీసీటీవీ రికార్డులు పరిమిత కాలం మాత్రమే స్టోరేజీ ఉండటంతో అంతకుముందు జరిగిన ఘటనలను పరిశీలించే అవకాశం లేకపోయిందని పేర్కొంది. దీంతో చోరీలు ఇంకా ముందే ప్రారంభమై ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది.
చోరీలకు కారణమైన భద్రతా వైఫల్యాలు
దర్యాప్తు బృందం చోరీలకు కారణమైన పలు భద్రతా వైఫల్యాలను గుర్తించింది. సిట్ తాను గుర్తించిన ప్రధాన లోపాలను నివేదికలో పొందుపర్చింది. లోపలికి వెళ్లే ముందు, బయటకు వచ్చే సమయంలో తనిఖీలు లేవు. ప్రత్యేక యూనిఫాం అమలు కాలేదు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత వస్తువులు లోపలికి తీసుకెళ్లారు. నగదు కట్టలు సిబ్బందికి అందుబాటులోనే ఉంచారు. సీసీటీవీలు ఉన్నా ప్రత్యక్ష పర్యవేక్షణ జరగలేదు. ఈ లోపాల వల్లే చోరీలు సులభమ య్యాయని నివేదిక స్పష్టం చేసింది.
నిబంధనల్లో మార్పులపై అనుమానాలు
2024 సెప్టెంబర్‌లో ఎస్‌బీఐతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి వ్యక్తిని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అయితే 2025 ఫిబ్రవరిలో ట్రస్ట్ సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)లో ఈ నిబంధనను తొలగించింది. ‘యాదృచ్ఛిక తనిఖీలు’ (ర్యాండమ్ సెర్చెస్) అనే విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ మార్పు ఎందుకు చేశారు? ఎవరు నిర్ణయం తీసుకున్నారు? అనే అంశాలపై లోతైన దర్యాప్తు అవసరమని సిట్ పేర్కొన్న ప్పటికీ.. ఎలాంటి నిర్ధారణా ఇవ్వలేదు.
రూ.78.94 లక్షల స్వాధీనం
సిట్ ఏర్పాటుకు ముందే ట్రస్ట్ చర్యలు ప్రారంభించింది. ఆరుగురు వ్యక్తుల వద్ద నుంచి రూ.78.94 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. విదేశీ కరెన్సీ, నగలు కూడా లభించాయి. జూన్ 4న లెక్కింపు గదికి అనుబంధం గా ఉన్న మరుగుదొడ్డిలో రూ.2.25 లక్షల నగదు దొరికింది. ఇది చోరీ వ్యవస్థీకృతంగా జరిగిందనే అను మానాన్ని బలపరుస్తుందని సిట్ నివేదిక పేర్కొంది. ఇక 2022-23 నుంచి 2025-26 వరకు జరిగిన అంతర్గత ఆడిట్లు పదేపదే పలు సూచనలు చేశాయి. అయితే ట్రస్ట్ అధికారులు మాత్రం ఈ సూచనలను పట్టించు కోలేదని సిట్ స్పష్టంగా పేర్కొంది.
ఇంకా సమాధానం లేని ప్రశ్నలు
సిట్ మధ్యంతర నివేదిక అనేక కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. మొత్తం ఎంత డబ్బు చోరీ అయింది? నాలుగేండ్లుగా ఆడిట్ హెచ్చరికలను ఎందుకు పట్టించుకోలేదు? తప్పనిసరి తనిఖీల నిబంధనను ఎందుకు మార్చారు? బంగారం, వెండి విలువను స్వతంత్ర సంస్థతో అంచనా వేయించారా? రసీదులు రాలేదని ఫిర్యాదు చేసిన భక్తుల సమస్యలను ఎలా పరిష్కరించారు? ట్రస్ట్ అగ్రస్థాయి నిర్ణయాధికారుల బాధ్యత ఏమిటి? అనే ప్రశ్నలు, అనుమానాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం కొందరు ఉద్యోగులకే పరిమితమా? లేక దీర్ఘకాలంగా కొనసాగిన సంస్థాగత వైఫల్యమా? అనే అత్యంత కీలక ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. తుది నివేదిక వెలువడితేనే చోరీలు, బాధ్యుల పాత్ర, ట్రస్ట్ అగ్రస్థాయి జవాబుదారీతనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అమలు కాని నిబంధనలు
నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను భక్తులు… ఆలయంలోని హుండీల్లో వేయడం, ట్రస్ట్ ఏర్పాటు చేసిన కౌంటర్లలో నేరుగా ఇవ్వడం, గర్భగుడి వద్ద రామలల్లా పాదాల వద్ద సమర్పించడం అనే మూడు మార్గాల ద్వారా సమర్పిస్తారు. ఈ కానుకలను ప్రత్యేక లెక్కింపు గదికి తీసుకెళ్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సిబ్బంది సమక్షంలో లెక్కించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. ప్రతి హుండీని విడివిడిగా తెరవాలి. ప్రతి హుండీకి ప్రత్యేక లెక్కలు నమోదు చేయాలి. సిబ్బందిని లోపలికి వెళ్లే ముందు, బయటకు వచ్చే సమయంలో తనిఖీ చేయాలి. జేబులు లేని ప్రత్యేక దుస్తులు ధరించాలి. మొబైల్ ఫోన్లు అనుమతించకూడదు. మొత్తం ప్రక్రియ సీసీటీవీ పర్యవేక్షణలో జరగాలి. అయితే ఈ నిబంధనల్లో చాలా వరకు అమలు కాలేదని సిట్ తేల్చింది.


