అజేయ చాంపియన్‌

 The undefeated champion– టీ20 వరల్డ్‌కప్‌ విజేత భారత్‌
– ఉత్కంఠ ఫైనల్లో మెరుపు విజయం
– టైటిల్‌ పోరులో దక్షిణాఫ్రికాకు భంగపాటు
17 ఏండ్ల నిరీక్షణ ఫలించింది. దశాబ్ది దాహం తీరింది. టీమ్‌ ఇండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా అవతరించింది. బ్రిడ్జ్‌టౌన్‌లో శనివారం జరిగిన టైటిల్‌ పోరులో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రెండోసారి (2007, 2024) ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఘనత దక్కించుకుంది.
2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌. 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌. గత దశాబ్ది కాలంలో టీమ్‌ ఇండియా టైటిల్‌ పోరుకు చేరుకున్న సందర్భాలు. ఢాకా, లండన్‌, అహ్మదాబాద్‌.. మూడు చోట్ల భారత్‌కు గుండెకోత తప్పలేదు. ఎట్టకేలకు బ్రిడ్జ్‌టౌన్‌లో భారత్‌ దశాబ్ది టైటిల్‌ దాహం తీరింది.
దక్షిణాఫ్రికా 177 పరుగుల లక్ష్యం. 16 ఓవర్లలో 151/4. క్లాసెన్‌ (52), మిల్లర్‌ (21) క్రీజులో ఉండగా.. 24 బంతుల్లో 26 పరుగులే అవసరం. భారత ఆశలు ఇక్కడ ఆవిరైనట్టే కనిపించింది. స్పిన్‌పై ఎదురుదాడితో లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేసిన సఫారీలకు పేసర్లు చెక్‌ పెట్టారు. బుమ్రా, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ వరుస ఓవర్లలో కండ్లుచెదిరే బంతులు సంధించారు. చేజారింది అనుకున్న తరుణంలో.. పేసర్లు టైటిల్‌ను మన సొంతం చేశారు.
భారత్‌ సాధించింది. అజేయ రికార్డుతో టీ20 ప్రపంచకప్‌ను సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. విరాట్‌ కోహ్లి (76), అక్షర్‌ పటేల్‌ (47) విలువైన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను భారీ స్కోరు అందించగా.. స్పిన్నర్లు నిరాశపరిచినా పేసర్లు అద్భుతం చేశారు. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికాకు భంగపాటు తప్పలేదు.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ ఇండియా సొంతమైంది. 2007 తొలి ఎడిషన్‌ విజేతగా నిలిచిన భారత్‌.. 17 ఏండ్ల తర్వాత మళ్లీ పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. శనివారం బ్రిడ్జ్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో టైటిల్‌ పోరులో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (52, 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), క్వింటన్‌ డికాక్‌ (39, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (31, 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో ఓ దశలో దక్షిణాఫ్రికా విజయం లాంఛనమే అనిపించింది. కానీ భారత పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/18), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/20), హార్దిక్‌ పాండ్య (2/20) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అంతకుముందు, విరాట్‌ కోహ్లి (76, 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (47, 31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు), శివం దూబె (27, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ విజయంతో పొట్టి ఫార్మాట్‌కు కోహ్లి వీడ్కోలు పలికాడు.
పేసర్ల ప్రతాపం
ఛేదనలో సఫారీలకు బుమ్రా, అర్ష్‌దీప్‌ ఝలక్‌ ఇచ్చారు. హెండ్రిక్స్‌ (4) వికెట్లను బుమ్రా గిరాటేయగా..మార్‌క్రామ్‌ (4) కథ సింగ్‌ ముగించాడు. బుమ్రా, అర్ష్‌దీప్‌ పేస్‌కు విలవిల్లాడిన సఫారీ బ్యాటర్లు.. స్పిన్నర్లపై దాడి చేశారు. డికాక్‌ (39), స్టబ్స్‌ (31) అక్షర్‌, కుల్దీప్‌ ఓవర్లలో దండిగా పరుగులు పిండుకున్నారు. ఈ ఇద్దరు నిష్క్రమించినా.. క్లాసెన్‌ (52), మిల్లర్‌ (21) ధనాధన్‌తో సఫారీ లక్ష్యానికి మరింత చేరువైంది. సఫారీ విజయం ఇక లాంఛనమే అనుకున్న తరుణంలో.. బుమ్రా, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ డెత్‌ ఓవర్లలో అద్భుతం చేశారు. క్లాసెన్‌, జాన్సెన్‌ వికెట్లతో పాటు పరుగుల నియంత్రణతో సఫారీలను ఒత్తిడిలోకి నెట్టారు. 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులకు చేరుకుంది. ఆఖరు ఓవర్లో హార్దిక్‌ పాండ్య.. డెవిడ్‌ మిల్లర్‌ వికెట్‌తో పాటు ప్రపంచకప్‌ టైటిల్‌ను సైతం అందించాడు.
పవర్‌ప్లేలో షాక్‌
ఫైనల్లో టాస్‌ నెగ్గిన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పవర్‌ప్లేలోనే స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ను ప్రయోగించిన దక్షిణాఫ్రికా.. భారత్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9), రిషబ్‌ పంత్‌ (0) స్వీప్‌ షాట్‌ ఆడబోయి మహరాజ్‌ ఓవర్లో నిష్క్రమించారు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లతో సఫారీల ఉత్సాహం రెట్టింపైంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (3) దూకుడుగా ఆడే ప్రయత్నంలో రబాడ ఓవర్లో వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో 4.3 ఓవర్లలో 34 పరుగులకే భారత్‌ 3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లేలో భారత్‌ 45/3తో నిలిచింది.
కోహ్లి, అక్షర్‌ దూకుడు
టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు కీలక బ్యాటర్లు విఫలమైన వేళ బ్యాటింగ్‌ లైనప్‌లో ముందుకొచ్చిన ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (47) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. దూకుడు వ్యూహం అమలు చేసిన అక్షర్‌ పటేల్‌ వస్తూనే బౌండరీ బాదాడు. విరాట్‌ కోహ్లి, అక్షర్‌ పటేల్‌ జోడీ నాల్గో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించింది. కోహ్లి, అక్షర్‌ దూకుడుగా పరుగులు రాబట్టారు. ఓ ఫోర్‌, నాలుగు సిక్సర్లు సంధించిన అక్షర్‌ పటేల్‌ అర్థ సెంచరీ ముంగిట రనౌట్‌గా నిష్క్రమించాడు. నాలుగు ఫోర్లతో మెరిసిన కోహ్లి 48 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి నెమ్మదిగా ఆడినా.. అక్షర్‌ దూకుడుతో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగింది. శివం దూబె (27) సైతం ధనాధన్‌ మోత మోగించాడ. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. అర్థ సెంచరీ తర్వాత రెండు ఫోర్లు, సిక్సర్లు కొట్టిన కోహ్లి గేర్‌ మార్చాడు. ఆఖర్లో కోహ్లి అవుటైనా.. హార్దిక్‌ పాండ్య (5 నాటౌట్‌), రవీంద్ర జడేజా (2)లు భారత్‌ను 170 మార్క్‌ దాటించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోకియా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) క్లాసెన్‌ (బి) మహరాజ్‌ 9, విరాట్‌ కోహ్లి (సి) రబాడ (బి) జాన్సెన్‌ 76, రిషబ్‌ పంత్‌ (సి) డికాక్‌ (బి) మహరాజ్‌ 0, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 3, అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ (డికాక్‌) 47, శివం దూబె (సి) మిల్లర్‌ (బి) నోకియా 27, హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 5, రవీంద్ర జడేజా (సి) మహరాజ్‌ (బి) నోకియా 2, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176.
వికెట్ల పతనం : 1-23, 2-23, 3-34, 4-106, 5-163, 6-174, 7-176.
బౌలింగ్‌ : మార్కో జాన్సెన్‌ 4-0-49-1, కేశవ్‌ మహరాజ్‌ 3-0-23-2, కగిసో రబాడ 4-0-36-1, ఎడెన్‌ మార్‌క్రామ్‌ 2-016-0, ఎన్రిచ్‌ నోకియా 4-0-26-2, షంసి 3-0-26-0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : రీజా హెండ్రిక్స్‌ (బి) బుమ్రా 4, క్వింటన్‌ డికాక్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 39, మార్‌క్రామ్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 4, స్టబ్స్‌ (బి) అక్షర్‌ 31, క్లాసెన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 52, మిల్లర్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 21, జాన్సెన్‌ (బి) బుమ్రా 2, మహరాజ్‌ నాటౌట్‌ 2, రబాడ (సి) సూర్య (బి) హార్దిక్‌ 4, నోకియా నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169.
వికెట్ల పతనం : 1-7, 2-12, 3-70, 4-106, 5-151, 6-156, 7-161, 8-168.
బౌలింగ్‌ : అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-20-2, జశ్‌ప్రీత్‌ బుమ్రా 4-0-18-2, అక్షర్‌ పటేల్‌ 4-0-49-1, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-45-0, హార్దిక్‌ పాండ్య 3-0-20-3, రవీంద్ర జడేజా 1-0-12-0.
ఫలించని స్పిన్‌ మంత్ర!
ప్రపంచకప్‌లో భారత్‌ విజయాల్లో స్పిన్నర్లది కీలక పాత్ర. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్రతి మ్యాచ్‌లోనూ మ్యాజిక్‌ చేశాడు. క్లిష్ట సమయంలో వికెట్లు కూల్చి గెలుపు బాటలు పరిచాడు. ఫైనల్లో అదే ప్రదర్శన ఆశించినా.. కుల్దీప్‌ సహా అక్షర్‌, జడేజా నిరాశపరిచారు. అక్షర్‌, జడేజా, కుల్దీప్‌లు 54 బంతుల్లో ఏకంగా 106 పరుగులు ఇచ్చుకున్నారు. పేస్‌పై తడబడిన డికాక్‌, స్టబ్స్‌ స్పిన్‌పై ఎదురుదాడి చేసినా.. రోహిత్‌ శర్మ రెండు ఎండ్‌ల నుంచి స్పిన్‌ ప్రయోగించాడు. క్రమం తప్పకుండా ప్రతి ఓవర్లో బౌండరీ బాదిన సఫారీలు భారత్‌పై ఒత్తిడి పెంచారు. డికాక్‌, స్టబ్స్‌, క్లాసెన్‌లు స్పిన్‌పై విశ్వరూపం చూపించారు.
పేసర్ల అద్భుతం
16 ఓవర్లలో దక్షిణాఫ్రికా 151/4. సఫారీ విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరం. క్రీజులో క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌. దక్షిణాఫ్రికా విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ హార్దిక్‌ పాండ్య, జశ్‌ప్రీత్‌ బుమ్రా వరుస ఓవర్లలో మ్యాజిక్‌ చేశారు. ప్రమాదకర క్లాసెన్‌ను హార్దిక్‌ పాండ్య అవుట్‌ చేయగా.. బుమ్రా కండ్లుచెదిరే బంతితో జాన్సెన్‌ను సాగనంపాడు. ఈ రెండు ఓవర్లలో కలిపి ఆరు పరుగులే వచ్చాయి. అర్ష్‌దీప్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. ఆఖరు 6 బంతుల్లో 16 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి డెవిడ్‌ మిల్లర్‌ భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ లైన్‌ దగ్గర సూర్యకుమార్‌ యాదవ్‌ సంచలన క్యాచ్‌ అందుకున్నాడు. ఇక తర్వాత ఐదు బంతుల్లో భారత్‌ లాంఛనం ముగించింది.

Spread the love