Thursday, June 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదేశంలో సన్నగిల్లుతున్న ‘సమాఖ్య’ స్ఫూర్తి

దేశంలో సన్నగిల్లుతున్న ‘సమాఖ్య’ స్ఫూర్తి

- Advertisement -

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి రాజకీయ రూపాలైన ప్రాంతీయ పార్టీల ఉనికి నానాటికి ప్రశ్నార్ధకమవున్నది. ఏక కేంద్ర రాజకీయాల వైపు దేశం వడివడిగా అడుగు లేస్తున్నది. వైవిధ్య భరితమైన ప్రాంతాలు జాతులు, మతాలు, కులాల సమాహారమైన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ భావనలకు దూరమైపోతున్నది. స్వాతంత్ర్యం వచ్చాక రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఏకచ్ఛత్ర పరిపాలన కొనసాగింది. 1967 నుండి ప్రాంతీయ అస్తిత్వ రాజకీయ శక్తులు నానాటికి బలపడుతూ వచ్చాయి. దేశ రాజకీయాలను శాసించే స్థితికి చేరుకున్నాయి. కానీ గత పుష్కర కాలంగా నానాటికి నీరసించి పోతున్నాయి. ఆసేతు శీతాచలం విస్తరించి ఏకఛత్ర అధికార ప్రతిష్టాపన కోసం బీజేపీ చతుర్విధో పాయాలతో ముందుకు సాగుతున్నది. దేశానికి సారధ్యం వహించేది ఆ రెండు పార్టీలేనా మూడవ ప్రత్యామ్నాయం ఇక ముగిసిన అధ్యాయమేనా అన్న విచికిత్స ప్రజలను కలవర పెడుతోంది.

79 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో కాంగ్రెస్‌‌కు చెందిన నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆరుగురు ప్రధానులు 54 ఏండ్లు పరిపాలిస్తే, బీజేపీకి చెందిన వాజపేయి, మోడీ పద్దెనిమిదేండ్లు (మోడీ పదవీకాలం ఇంకా ముగియలేదు) పాలించారు. ఈ రెండు పార్టీలకు చెందని మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ, గుజ్రాల్ ప్రధా నులుగా పరిపాలించిన మొత్తం కాలం కేవలం ఏడేండ్లు. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రధానులు అధికారంలో బతికి బట్టకట్టడం అంత సులభం కాదని ఆ గణాంకాలు చెప్తున్నాయి. 1989-2009 మధ్యలో జరిగిన ఏడు సాధారణ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మెజార్టీ సాధించలేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే కొలువు తీరాయి. మిత్రపక్ష పార్టీల దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడి కొనసాగాయి. పాతికేళ్ల తర్వాత మోడీ నాయకత్వంలో బీజేపీ 2014, 2019లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించి సొంత కాళ్లమీద నిలబడగలిగే స్థాయికి ఎదిగింది. దీనికి కారణాలనేకం. ఆరెస్సెస్‌ ‌పాత్ర, హిందూత్వ వాదం, కార్పొరేట్ల సహకారం కాదనలేం. కానీ, 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ దక్కలేదు.

మిత్ర పక్ష ప్రాంతీయ పార్టీల అండతో రెండేండ్లు నెట్టుకొచ్చింది. అయితే 1999లో వాజపేయి ప్రభుత్వం జయలలిత మద్దతు ఉపసంహరించడంతో కేవలం ఒక్కఓటు తేడాతో ఓడిపోయి 13 నెలలకే కూలిపోయిన పీడకలను బీజేపీ ఇంకా మరచిపోలేదు. వర్తమాన మోడీ ప్రభుత్వానికి ప్రధాన మద్దతు దారులైన చంద్రబాబు, నితీష్ ఎప్పుడు పుట్టి ముంచుతారోనన్న అనుమానంతో వారిని బీజేపీ నమ్మడం లేదు. ఇద్దరికీ వివిధ సందర్భాల్లో బీజేపీ కూటమి నుంచి వైదొలిగిన చరిత్ర ఉంది.అందుకనే ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలను చీల్చడం ద్వారా రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజార్టీకి చేరువైన బీజేపీ అదే ఫార్ములా ఉపయోగించి లోక్‌సభలో సొంతంగా మెజార్టీ సాధించడం కోసం దూకుడు పెంచింది. ప్రాంతీయ పార్టీల ధ్వంస రచనకు ఉపక్రమించింది. ఆ దెబ్బకు శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కకావికలమైపోయాయి. మరికొన్ని పార్టీలకు అదే వరుసలో ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఒకప్పటి కాంగ్రెస్‌లాగా ఇప్పుడు బీజేపీ ఏక కేంద్ర రాజకీయాధికార వ్యవస్థ కోసం డబులింజన్ సర్కార్ ధ్యేయంగా నడుం బిగించింది. అందుకోసం మోడీ-అమిత్ షా ద్వయం బహుముఖ పథక రచన చేస్తున్నది. తొలుత ప్రాంతీయ పార్టీలతో పొత్తు కలుపుకొని కాలక్రమంలో బలపడి పైచేయి సాధించడం. అధికారాన్ని లాక్కోవడం. బలమైన ప్రాంతీయ పార్టీలను చీల్చివిలీనం చేసుకోవడం, నయనా భయానా దారికి రాని ప్రాంతీయ పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, సోషల్ మీడియా వేదికగా విపరీతమైన దుష్ప్రచారానికి ఒడి కట్టడం, విభేదించిన వారిని హిందుత్వ వ్యతిరేకులనే ముద్ర వేయడం, ఇలా సామబేధదాన దండోపాయాలతో ఒక్కొక్క రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్నది. ఇటీవల చూస్తుండగా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రాంతీయ పార్టీల దశాబ్దాల ఆధిపత్యానికి గండి కొట్టి అధికారం కైవసం చేసుకున్న బీజేపీని నిలువరించడానికి ఒక మూడో ప్రత్యామ్నాయం తప్పదని పరిణామాలు ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ ను ఆదిశగా ఊహించలేం. ఇప్పుడు బీజేపీ చేస్తున్నదే ఒకప్పుడు కాంగ్రెస్ చేసింది.

చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు కాంగ్రెస్ స్వార్థం కోసం మిత్రపక్ష ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడా నికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్‌పై లేనిపోని అపనిందలు మోపింది. తమిళనాడులో డీఎంకేను చౌరస్తాలో వదిలేసింది. రాష్ట్రస్థాయిలో తాత్కాలిక లబ్ధి కోసం మిత్రపక్షాలను దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ వైఖరి పరోక్షంగా ప్రత్యర్థి ‌బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతున్నది.
ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అది జాతి సమైక్యత సమగ్రతలకు భంగం కలిగిస్తున్నట్లు, దేశభక్తి రాహిత్యమైనట్లు, దేశ అస్తిత్వానికి ప్రమాదకరమైనట్లు బీజేపీ ఒకబూచిని చూపిస్తున్నది. అవసరమైనప్పుడు అవే పార్టీలను అక్కున చేర్చుకుని పబ్బం గడుపుకుంటున్నది. ఇందిరమ్మ రాజీవ్ ప్రాణ త్యాగాలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అడ్డుపెట్టుకొని బీజేపీ ప్రత్యర్థి పార్టీలను దబాయిం చడానికి అలవాటు పడిపోయాయి. కేంద్రంలో అధికార వారసులం తామేనని, తమ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే మనగలుగుతాయని, తమకు మద్దతివ్వడం తప్ప ప్రాంతీయ పార్టీలకు మరో దారి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఇక రాష్ట్రాల విషయానికొస్తే ప్రాంతీయ పార్టీలకు తమ పొత్తు అనివార్యమన్న వాతావరణం కల్పించాయి. రెండు పార్టీలకు సమాన దూరంలో కొనసాగుతున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్, వైఎస్సార్‌‌సీపీ వంటి వేళ్లమీద లెక్క పెట్టగలిగే పార్టీలు ఏటికి ఎదురీదుతున్నాయి. మిగతావన్నీ బీజేపీ లేదా కాంగ్రెస్ ఏదో ఒక జాతీయ పార్టీ శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. ఈ విశాల భారతావనిలో ప్రధాని అభ్యర్థులు ఎవరంటే మోడీ, రాహుల్ తప్ప మరో పేరు వినిపించని శూన్యం ఏర్పడింది. ప్రాంతీయ పార్టీలు తమ తమపంతాలు పట్టింపులు, స్వాతిశయాలు వదిలి ఉమ్మడి ప్రణాళికతో ఒక్కతాటి మీదికి వస్తే కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో అధికారం లోకి రావడం అంత సులభం కాదు. అందుకే విభజించి పాలించే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. సాంకేతికంగా ఎన్నికల కమిషన్ జాబితాలో మరో నాలుగు జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థితిలో లేవు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 1977 లో అన్ని పార్టీలను ఒక్క తాటి మీద తెచ్చి జనతా పార్టీ తరఫున ఒకే గుర్తు మీద పోటీ చేసి తొలిసారిగా కేంద్రంలో కాంగ్రెస్‌ను గద్దె దించారు.

80వ దశకంలో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ సంకీర్ణానికి నాయకత్వం వహించి లోక్ సభలోని 543 స్థానాల్లో సొంతంగా 414సంఖ్యా బలమున్న కాంగ్రెస్‌ను గద్దె దించి మలివిజయం సాధించారు. దేవేగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు (1996-98) మూడో ప్రత్యామ్నాయంగా కాకుండా కాంగ్రెస్ మద్దతుతో స్వల్పకాలం అధికారంలో ఉన్నాయి. దశాబ్దాలపాటు తలవంచని ప్రాంతీయ శక్తులకు కాంగ్రెస్ ఒకటే ప్రత్యర్థి. ఆ స్థానంలో ఇప్పుడు ‌బీజేపీ కొత్తగా వచ్చి చేరింది. అయితే నాటికంటే నేడు ప్రాంతీయ పార్టీలు బలోపేతమ య్యాయి. అవి ప్రజాస్వామ్య, లౌకిక వాద, సామాజిక న్యాయాలు ఎజెండాగా సంఘటితం కావాలి. అందుకోసం కాంగ్రెస్ పట్టు విడుపులు ప్రదర్శించాలి. బీజేపీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న భావ సారూప్య పార్టీలతో గల శత్రు వైరుధ్యాలను పక్కన పెట్టాలి. ఆ మౌలిక సూత్రాన్ని విస్మరించి దీర్ఘకాలిక లక్ష్యం లేకుండా రాష్ట్రాల్లో తక్షణ ఫలితాలు ఆశించి బీజేపీ వ్యతిరేక శక్తులను దూరం చేసుకుంటూ పోతే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యం కాదు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ నిలువరించడానికి మూడవ ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చే ప్రాంతీయ శక్తులకు కాంగ్రెస్ సహా ఇతర జాతీయ పార్టీలు యధాశక్తి సహకరించాలి.

డా. అయాచితం శ్రీధర్, 9849893238

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -