Thursday, June 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపేదలపై కాంగ్రెస్‌ కర్కశత్వం

పేదలపై కాంగ్రెస్‌ కర్కశత్వం

- Advertisement -

హనుమకొండ-వరంగల్ మహానగరంలో కాలే కడుపులు, కరిగే ఆశల మధ్య బతుకులీడుస్తున్న నిలువ నీడలేని నిరుపేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ల రాజకీయాన్ని ప్రయోగిస్తోంది. ఇండ్ల కిరాయిలు కట్టలేక, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద శ్రామికులు, రోజువారీ అడ్డకూలీలు తల దాచుకున్న గుడిసెలను తెల్లవారుజామున పోలీసుల నిర్బంధంలో, కనీస ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేయడం అత్యంత అప్రజాస్వామికం, అమానుషం. గోపాలపురం చెరువు, గుండ్ల సింగారం పరిధిలో పేదలు వేసుకున్న ఇండ్లను కూల్చివేసిన తీరు ప్రజాస్వామ్య సమాజం తల దించుకునేలా చేసింది. నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల స్టడీ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేయడం ప్రభుత్వ కర్కశత్వానికి పరాకాష్ట. ఈ చర్యల వల్ల వందలాది కుటుంబాలు వీధిన పడి, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇదే గోపాలపురం చెరువు, గుండ్ల సింగారం సర్వే నంబర్లలో ఇప్పటికే పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను ఆక్రమించి కోట్లు గడిస్తుంటే వారి జోలికి వెళ్లని యంత్రాంగం.. కేవలం అరవై గజాల స్థలంలో తలదాచుకున్న పేదలపై ఏకపక్షంగా విరుచుకుపడటం వెనుక అంతరార్థం ఏమిటో పాలకులు సమాధానం చెప్పాలి. ‘హయాగ్రీవ చారి’ లాంటి విలువైన భూములను ఆక్రమణదారుల కబంధహస్తాల నుండి రక్షించి, ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర ఎర్రజెండా పార్టీలది. భవిష్యత్తు తరాల కోసం భూములను కాపాడటం అంటే.. పేదల పొట్టకొట్టడం కాదు, భూ బకాసురుల గుండెల్లో నిద్రపోవడం అని పాలకులు గ్రహించాలి.

​ మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కమిటీ వేసి ‘ల్యాండ్ బ్యాంక్’ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు లక్ష్యం కార్పొరేషన్ అభివృద్ధి కాదు, పేదల భూములను లాక్కొని లేఅవుట్ల పేరుతో అమ్ముకోవడం లాంటి పరిస్థితే కనిపిస్తున్నది. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకే సొంత భవనాలు లేక అద్దె కొంపల్లో నడుస్తుంటే, ఉన్న భూములను నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వకుండా అమ్ముకోవాలని చూడటం భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. భూకబ్జా దారుల భూములను వెలికితీసేందుకు వామపక్షాలు సహకరిస్తామని చెబుతున్నా, ఆ పని చేయకుండా కేవలం పేదల ఇండ్లనే టార్గెట్ చేయడం దుర్మార్గం. రోజువారీ అడ్డ కూలీలు, ఇండ్లల్లో పని చేసేవారు మౌలిక వసతులు, కరెంటు, నీరు, రోడ్లు లేకపోయినా, విష పురుగుల నడుమ అత్యంత దుర్భర జీవితాన్ని ఈ గుడిసెలలో గడుపుతున్నారు. వీరికి జీవో 58 ప్రకారం పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సింది పోయి, ఉన్న గూడును చెడగొట్టడం ప్రజా ప్రభుత్వ లక్షణం కాబోదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండడు అని చెబుతున్న పాలకులు, ఉన్న ఇల్లును నేలమట్టం చేయడం మే ఇందిరమ్మ రాజ్యమా అనే ప్రశ్న తలెత్తతుంది. ​ఈ క్రూరమైన ప్రభుత్వ విధానాలకు నిరసనగా వరంగల్-హనుమకొండ జిల్లా వామపక్ష పార్టీలు (సీపీఐఎం, సీపీఐ) ఉద్యమ శంఖారావాన్ని పూరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి, పేదల గూడును కూల్చే ప్రయత్నాలను ఆపాలి. లేనిపక్షంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రజాపోరాటానికి పాలకులు సమాధానం చెప్పుకోక తప్పదు.

బొట్ల చక్రపాణి, 9959779455

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -