Sunday, May 17, 2026
E-PAPER
Homeజాతీయంఅత్యంత పేలవ కరెన్సీ రూపాయి

అత్యంత పేలవ కరెన్సీ రూపాయి

- Advertisement -

న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా రూపాయి నమోదయ్యింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధికంగా పడిపోయిన కరెన్సీగా చోటు చేసుకోవడం ఆందోళనకరం. ఇరాన్-యుఎస్ యుద్ధం, విపరీతంగా పెరిగిన ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఉపసంహరణ, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించడం వంటి కారణాల వల్ల శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో 96 మార్క్‌‌కు పడిపోయింది. 2026 లోనే దాదాపు 6 శాతం పతనమైంది. భారత్‌ ‌కంటే చిన్న దేశాలైనా మలేషియన్‌ ‌రింగ్‌‌గిట్‌ ‌విలువ 3.3 శాతం, సింగపూర్‌ ‌డాలర్‌ 1 శాతం చొప్పున పెరిగాయి. పొరుగు దేశం చైనా యువాన్‌ ఏకంగా 2.9 శాతం బలపడింది. తైవాన్‌ ‌డాలర్‌ 0.3 శాతం, హాంకాంగ్‌ ‌డాలర్‌ 0.6 శాతం, జపనీస్‌ ‌యెన్‌ 0.7 శాతం చొప్పున స్పలంగా తగ్గాయి. వీటితో పోల్చితే భారత కరెన్సీ తీవ్ర పతనాన్ని చవి చూడటం మోడీ పాలనలో విఫలాన్ని స్పష్టం చేస్తోంది. ఈ కరెన్సీ పతనం దేశీయంగా ఇంధన సంక్షోభానికి దారితీసి, సామాన్యులపై భారీ ద్రవ్యోల్బణ ముప్పును తెచ్చిపెట్టింది. ముడి చమురు, ఇతర నిత్యావసరాల దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల రాబోయే రోజుల్లో రవాణా భారమై, మార్కెట్లలో వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

​100కు పడొచ్చు..
పశ్చిమ ఆసియా సంక్షోభం ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగితే రూపాయి విలువ మున్ముందు మరింత క్షీణించి, సైకలాజికల్ మార్క్ అయిన 100 స్థాయిని తాకవచ్చని ఐసిఐసిఐ బ్యాంక్ రీసెర్చ్‌ నివేదిక హెచ్చరిస్తోంది. ‌పశ్చిమాసియా వివాదానికి తగిన పరిష్కారం లభించే వరకు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే యుఎస్‌ డాలర్ వైపే మొగ్గు చూపుతారని, దీనివల్ల డాలర్ మరింత బలపడి భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ వాణిజ్య సమతుల్యతపై ఒత్తిడి పెరగొచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం అనేది కేవలం పెద్ద ఆర్థిక సంక్షోభంలా అనిపించినప్పటికీ, ఇది సామాన్య ప్రజల రోజువారీ బడ్జెట్‌ను నేరుగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. గత ఏడాది కాలంలో రూపాయి దాదాపు 11 శాతంగా పడిపోగా.. అందులో 5 శాతం మేర పతనం కేవలం ఇరాన్ వివాదం ప్రారంభమైన తర్వాతే సంభవించడం గమనార్హం.

​రవాణా ఖర్చులు తడిసి మోపెడు
భారత్‌ తన చమురు అవసరాల కోసం దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇటీవల ఇంధన ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచడం ఈ ఒత్తిడికి నిదర్శనం. ఇంధన ధరలు పెరగడం వల్ల ట్రక్కులు, రవాణా వాహనాల నిర్వహణ ఖర్చులు పెరిగి మార్కెట్లలో కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. అదే విధంగా చమురుతో పాటు దేశం తన గ్యాస్ అవసరాలలో 51 శాతం దిగుమతి చేసుకుంటున్నందున ఈ ఒత్తిడి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.

​బంగారం ధరలు చుక్కలే..
రూపాయి పతనం వల్ల దేశీయంగా బంగారం దిగుమతి ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఇది దేశీయ మార్కెట్లలో బంగారం ధరలను మరింత ఆకాశానికి చేరుస్తుంది. రూపాయి బలహీనపడినప్పుడు విదేశాల నుండి వచ్చే ముడిసరుకులు, విడిభాగాలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అధిక ఉత్పత్తి ఖర్చులను ఎదుర్కొనే కంపెనీలు ఆ భారాన్ని ఉత్పత్తులు, సేవల ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై బదిలీ చేస్తాయి. ఫలితంగా కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గి.. కాలక్రమేణా సామాన్యుడి రోజువారీ జీవితం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది.

​పెట్టుబడుల ఉపసంహరణ
పశ్చిమ ఆసియాలో వివాదం తీవ్రం కావడంతో మార్చి నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పిఐ) భారత మార్కెట్ల నుండి ఏకంగా 13.6 బిలియన్ యూఎస్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఇది గత ఆరేళ్లలో అత్యధిక నెలవారీ తరలింపులుగా కాగా.. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు కూడా మందగించడం రూపాయిపై భారాన్ని పెంచింది. కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం ముడి చమురు ధరలు ఇలాగే ఉంటే భారత కరెంట్ ఖాతా లోటు (సిఎడి) మరింత పెరిగే ప్రమాదం ఉంది. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -