అప్పుడలా.. ఇప్పుడీలా…

– అధికార పార్టీ స్థాయి నుంచి అట్టడుగుకు…
– అసెంబ్లీ ఎన్నికల్లో పల్టీలు కొట్టి.. లోక్‌సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ కారు
– ఎంపీ ఎన్నికల్లో ఖాతాయే తెరవని బీఆర్‌ఎస్‌
– 2014లో 11 సీట్లు.. 2019లో 9 స్థానాలతో సత్తా చాటిన గులాబీ దళం
– ఇప్పుడు ఒక్క సీటూ దక్కని దైన్య స్థితి
– స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగినా ఫలితం శూన్యం
– గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజకీయాల్లో ఒక పార్టీ గెలవటం, మరో పార్టీ ఓడిపోవటం సర్వసాధారణం. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షంలోకి, ప్రతిపక్షంలో ఉన్న వారు అధికార పక్షంలోకి రావటం కూడా మామూలే. కానీ ఒకనాడు ఉచ్ఛస్థితిలో ఉన్న పార్టీ.. అందునా ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ… ఇప్పుడు సాధారణ స్థితిలో కాదు గదా… ఒక్కటంటే ఒక్క సీటు గెలవని, కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితిలోకి నెట్టబడటం దాని దైన్యస్థితికి దర్పణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఇప్పుడు అలాంటి దీనస్థితినే ఎదుర్కొంటోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తాం, అవసరమైతే ప్రధాని రేసులో ఉంటానంటూ ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంభీరంగా చెప్పిన మాటలు… ఫలితాల్లో గాలికి కొట్టుకుపోయాయి. ఆయన ఛరిష్మాతోపాటు తీవ్ర అనారోగ్యంతోనూ కేసీఆర్‌ చేసిన బస్సు యాత్ర కూడా ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఎంతమాత్రం పోటీలో నిలబెట్టలేకపోయింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు… కాలికి బలపం కట్టుకుని తిరిగినా, తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును గెలిపించుకోలేకపోవటం విస్మయకరం. ఇది నిజంగా ఆ పార్టీ స్వయంకృతా పరాధమా..? లేక ‘ఎవర్నో గెలిపించేందుకు…’ తమ పునాదుల్ని పెకిలించివేసుకున్న ఫలితసరిగ్గా ఆర్నెల్ల ముందు బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ చెప్పిందే శాసనం. అటు ప్రభుత్వంలోనైనా, ఇటు పార్టీలోనైనా ఆయన చెప్పిందే వేదవాక్కు. ఇదే ధోరణితో అసెంబ్లీ ఎన్నికలకు మూణ్నెల్ల ముందే ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించటం ద్వారా ఆయన అందర్నీ అవాక్కయ్యేలా చేశారు. కానీ కారు సారు అంచనాలను తలకిందులు చేస్తూ ఆ వ్యూహం బెడిసికొట్టింది. 88 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో రాష్ట్రాన్ని శాసించిన బీఆర్‌ఎస్‌… పదేండ్ల తర్వాత ప్రతిపక్ష హోదాలో కూర్చోవాల్సి వచ్చింది. ఊహించని ఈ పరిణామం నుంచి ఆ పార్టీ శ్రేణులు కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికల రూపంలో పెద్ద సవాలే ఎదురైంది. బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) ఏర్పడిన 2001 నుంచి ఇప్పటి వరకూ ఎన్నడూ తగలనంత ఎదురుదెబ్బ గులాబీ దళానికి తగిలింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్‌ మొత్తానికే గల్లంతైంది. ఒక్కరంటే ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూడా గెలవకపోవటం నిజంగా ఆ పార్టీ నేతలకు మింగుడు పడని అంశమే. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పని ఖతం…’ అంటూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో… ఇప్పుడు ఆ పార్టీ తిరిగి ఎలా పుంజుకుంటుందనేది నిజంగా ప్రశ్నార్థకమే.
అదే కారణమా…?
బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)కు మొదటి నుంచి బలం, బలగం తెలంగాణ వాదమే. సున్నితమైన ఈ విషయంలో ఆ పార్టీ అధినేత తీసుకున్న ఒక నిర్ణయమే ఇప్పుడా పార్టీ ఓటమికి ఒక ప్రధానంగా కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కోరికతో కేసీఆర్‌… తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ఉన్న పార్టీ పేరును 2022లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చారు. మొదటి నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు, క్రియాశీలక నేతలు, ముఖ్యంగా ఉద్యమకారులు దీన్ని జీర్ణించుకోలేకపోయారనే వాదనలు అప్పట్లోనే వినిపించాయి. ఈ కారణం వల్లే ఆర్నెల్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని క్యాడర్‌ ‘సొంతం’ చేసుకోలేదనే అభిప్రాయాలూ వెలువడ్డాయి. ఆ ఒరవడి ఇప్పుడు కూడా కొనసాగిందంటూ పలువురు నేతలు వాపోతుండటం గమనార్హం.
ప్రక్షాళనేది..?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించిన వివిధ అంతర్గత సమావేశాల్లో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించారు. 60 లక్షల సభ్యత్వమున్న బీఆర్‌ఎస్‌ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పటిష్టం చేస్తామంటూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. గతంలో వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించటం, అలా వచ్చిన నేతలకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలక పదవులను అప్పగించటం ద్వారా అసలు సిసలైన నాయకులను పార్టీ అధినేత దూరం చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. కానీ ఆ తర్వాత కూడా ఈ ఒరవడికి బ్రేకులు పడకపోవటం గమనార్హం. దీంతో తీవ్ర అసంతృప్తికి, అంతకుమించిన నైరాశ్యానికి గురైన సీనియర్లు, అనుభవజ్ఞులు బీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. వీరిలో అత్యధిక మంది అధికార పార్టీ కాంగ్రెస్‌ పంచన చేరగా, అక్కడ చోటు దక్కని వారు బీజేపీ గూటికి చేరిపోయారు. వీటికితోడు నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవటం, కష్టపడి పని చేసే వారికి గుర్తింపునివ్వకపోవటం కూడా కారు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులను మారిస్తే.. గెలిచేవాళ్లమని పశ్చాత్తాపడిన బీఆర్‌ఎస్‌…లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో సీనియర్లు, సౌమ్యులు, వివాదరహితులు, అవినీతి మరకల్లేని వారిని నిలబెట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Spread the love