అప్పుడు ప్రతినెలా చెల్లించాం : ఇప్పుడు బకాయి ఉన్నాం

నవ తెలంగాణతో సెస్ చైర్మన్ ఇంటర్వ్యూ
నవతెలంగాణ –  సిరిసిల్ల
దేశంలోనే తెలంగాణ ప్రాంతంలో ఏకైక విద్యుత్ సహకార సంస్థ సిరిసిల్లలో ఉంది. ఈ సంస్థ గతంలో లాభాల బాటలోనే ఉండేది. ప్రస్తుతం లాభనష్టాలు లేకుండా ఉంది పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో నవ తెలంగాణ సెస్  చైర్మన్ చిక్కాల రామారావు తో ఇంటర్వ్యూ చేసింది.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో 2007 నుంచి 2010 వరకు నేను ఈ సెస్ సంస్థకు చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్పీడీసీఈఎల్ కు ప్రతినెల విద్యుత్ బిల్లు చెల్లించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 2020 కి సంబంధించిన విద్యుత్ బిల్ ను ఎన్పీడీసీఈఎల్ కు చెల్లిస్తున్నాం. సెస్ సంస్థ రూ.698 కోట్లు బకాయి ఉన్నట్లు చూపిస్తున్నారు. కానీ మాకు ప్రభుత్వం నుంచి, వినియోగదారుల నుంచి రూ.700 కోట్లు రావాల్సి ఉంది. ట్రాన్స్ కో తో చర్చించి మూడు రూపాయలు టారిఫ్ చేయాలని కోరడం జరుగుతుందని, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు నవ తెలంగాణతో పేర్కొన్నారు. ఈ విషయం గురించి విపులంగా మాట్లాడగా వెల్లడించిన వివరాలు….
నవ తెలంగాణ: సేస్ పరిధిలో రూ. 82 కోట్ల నిధులకు సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఎందుకు క్లోజ్ చేయలేదు దాంట్లో పాలకవర్గం, అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది.
సెస్ చైర్మన్: వర్క్ ఆర్డర్లు గత పాలకవర్గం కు సంబంధించినవి 2023 జనవరి లో బాధ్యతలు తాము స్వీకరించగా , రూ.82 కోట్ల నిధులకు సంబంధించిన వర్కు ఆర్డర్లు క్లోజ్ చేయలేదు. మా పాలకవర్గం వచ్చిన ఏడాదిలోనే రూ.20 కోట్ల వర్క్ ఆర్డర్లను క్లోజ్ చేయడం జరిగింది. వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోవడానికి ప్రధానంగా అప్పటి పాలకవర్గం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే అని చెప్పవచ్చు.  కానీ ఎలాంటి అవకతవకలు మాత్రం జరగలేదు. తాము బాధ్యతలు తీసుకోకముందు రూ. 10 కోట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. ఈ ఏడాదిలోనే ఆ డిమాండ్ ను రూ.20 కోట్లకు తీసుకురావడం జరిగింది. మార్చి మాసం వరకు రూ.30 కోట్లకు తీసుకురావడానికి టార్గెట్ పెట్టుకున్నాం. లైన్ లాస్ 15 నుంచి 20 లోపు ఉంది. 10లోపు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. పైలెట్ ప్రాజెక్టుగా తంగళ్ళపల్లి ఇల్లంతకుంట మండలాలను తీసుకోవడం జరిగింది.
నవ తెలంగాణ: విద్యుత్ యూనిట్ ధర ఎందుకు పెంచారు, దీంట్లో అధికారుల పాత్ర ఉందా.. పాలకవర్గం పాత్ర ఉందా ..
సెస్ చైర్మన్: విద్యుత్ యూనిట్ ధర పెరగడానికి కారణం ప్రధానంగా 2018లో అప్పటి ఎండి కుట్రపూరితమైన ఆలోచన అని చెప్పవచ్చు. అతను డిస్కంలో కలిపి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేసి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలికి పంపించాడు. గతంలో రూ.90 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసే వారం, ఆయన వల్ల ప్రస్తుతం రూ.4.84 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రూ.3.96 పైసలు యూనిట్కు పెరిగింది. ఎన్ పి డి సి ఈ ఎల్ కు సెస్ సంస్థ రూ.400 కోట్ల బకాయి ఉంది. దానికి రూ.298 కోట్లు సర్ చార్జ్ వేశారు.రూ. 698 కోట్ల బకాయి ఉన్నట్లు చూపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి, వినియోగదారుల నుంచి సెస్ సంస్థకు రూ. 700 కోట్లు రావాల్సి ఉంది . ట్రాన్స్కో తో చర్చించి మూడు రూపాయల టారిఫ్ చేయాలని కోరడం జరిగింది.
నవతెలంగాణ: విద్యుత్ బకాయిలు పెరగడానికి ఎవరి వైఫల్యం అని చెప్పవచ్చు..
సెస్ చైర్మన్: విద్యుత్ బకాయిలు పెరగడానికి మా పాలకవర్గం వైఫల్యం కాదు. గతంలో నేను 2007 నుంచి 2010 వరకు చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్ పి డి సి ఈ ఎల్ కు అడ్వాన్స్ గా విద్యుత్ బిల్లులు చెల్లించే వారం మధ్యలో వచ్చిన పాలకవర్గం పూర్తి నిర్లక్ష్యం వహించడంతో , విద్యుత్ బకాయలు పెరిగిపోయాయి. ప్రస్తుతం 2020 సంవత్సరానికి సంబంధించిన బిల్లులు కడుతున్నాం. సిరిసిల్ల ,వేములవాడ ప్రాంతాల్లో విద్యుత్తు చౌర్యంతో పాటు, బకాయిలు ఎక్కువగా ఉన్నాయి విద్యుత్ సిబ్బంది వినియోగదారులతో మాట్లాడుతూ బకాయిలు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రూ. 80 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ప్రధానంగా సిరిసిల్లలో ఎస్ ఎస్ ఐ యూనిట్లు కేటగిరి మూడు లో ఉండాలి. కానీ కేటగిరి నాలుగులో నడుస్తున్నాయి. ఏడాది మే మాసం నుంచి ఇప్పటివరకు ఎస్ ఎస్ ఐ యూనిట్లకు సంబంధించిన వారు హైకోర్టులో కేసు ఉంది అని బిల్లులు చెల్లించడం లేదు.
నవతెలంగాణ: సెస్ పరిధిలో విద్యుత్ అంతరాయం బాగా పెరిగిపోయింది, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు, పాలకవర్గం పట్టించుకోకపోవడమా, అధికారుల నిర్లక్ష్యమా తెలియడం లేదు.
సెస్ చైర్మన్: ప్రధానంగా విద్యుత్ వైర్ల కింద హరితహారం మొక్కలు నాటారు. అవి చెట్లుగా పెరిగి, విద్యుత్ తీగల తగిలి అనేకసార్లు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. ప్రధానంగా 20 ఏళ్ల కింది కండక్టర్లు ఉన్నాయి .వాటిని తొలగించి కొత్తవి వేస్తున్నాం.అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం అవి ఆగిపోయాయి .అండర్ గ్రౌండ్ లో కేబుల్ ఏర్పాటు చేస్తే ,విద్యుత్ కు అంతరాయం ఉండదు. పాలకవర్గం ఐకమత్యంగా సెస్ అభివృద్ధి కోసం పని చేస్తుంది. కొంతమంది అధికారులు విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా వినని వారిపై శాఖాపరమైన చర్యలు తప్ప, తప్పడం లేదు ఉద్యోగులు ఉదయం 10 .15 గంటలకు తప్పనిసరి విధులకు రావాలి. 1. 15 కు వెళ్లాలి మధ్యాహ్నం 2. 15 కు వచ్చి 5. 30 వరకు ఉండాలి బయోమెట్రిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయినా సమయపాలన పాటించడం లేదనేది నా దృష్టికి వచ్చింది క్రమశిక్షణ చర్యలు చేపడతాం .
నవ తెలంగాణ: సెస్ స్టోర్ కు సంబంధించి స్థలం ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు, అలాగే వారసత్వ ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన నియామకం చేస్తున్నారు , ఉద్యోగాలు ఇప్పిస్తామని సెస్ కార్యాలయంలోనే సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
సెస్ చైర్మన్: సెస్ స్టోర్ కు సంబంధించిన స్థలం అప్పటి పాలకులు ఎలా ప్రభుత్వంకు ఇచ్చారో నాకు తెలియదు కానీ ప్రస్తుతం సెస్ స్టోర్ కోసం స్థలం అద్దెకు తీసుకోవడం జరిగింది. ప్రతి నెల రూ. 80000 అద్దె చెల్లించడం జరుగుతుంది. ఇది అదనపు భారంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని విన్నపం చేయడం జరిగింది. సెస్ పరిధిలోని రుద్రంగి వేములవాడ అర్బన్ తంగళ్ళపల్లి ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లో 15 గుంటల స్థలం ఇస్తే సెస్ భవనాలు నిర్మాణం చేస్తాం . ప్రభుత్వ విప్ తో పాటు వివిధ మండలాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను 15 నుంచి 18 సబ్ స్టేషన్ లు అవసరమని చెప్పడం జరిగింది. ఇక వారసత్వ ఉద్యోగాలు మా పాలకవర్గం హయాంలో మరిచిపోవాలి . 2014 నుంచి 2022 నవంబర్ వరకు అక్రమంగా నియామకాలు జరిగాయి. రూల్స్ కు విరుద్ధంగా వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  ప్రస్తుతం మాత్రం హెల్పర్ నుంచి ఏఈ వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి జేఏవో వరకు 95% నోటిఫికేషన్ వేసి, పారదర్శకంగా నియామకాలు జరుపుతాం. ఎవరైనా సెస్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నా,  అడిగినా మా దృష్టికి తీసుకురావాలి. పాలకవర్గం మాత్రం ఉద్యోగాలు ఇవ్వదు. గతంలో ఇలా డబ్బులు తీసుకుంటే వాటిని తిరిగి ఇప్పించి, తీసుకున్న వారిపై చర్యలు చేపట్టడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది.

Spread the love