Thursday, July 30, 2026
E-PAPER
Homeఖమ్మంజూలైలో వానలు కరువు.. 

జూలైలో వానలు కరువు.. 

- Advertisement -

– గతేడాది అధికం, ఈసారి భారీ లోటు
– అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో 28.7 శాతం వర్షపాతం లోటు
– ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఋతు చక్రంలో వస్తున్న మార్పులు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వానాకాలంలో ఎండలు, చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనికితోడు ఎల్ నినో ఉపధ్రవం పొంచివుందని వాతావరణ శాఖ అంచనాలు ఉండనే ఉన్నాయి. రాబోయే ఆగష్టు,సెప్టెంబర్ మాసాల్లో కూడా లోటు వర్షపాతమే అని సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. అపరాల విత్తనాలను రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి రైతులకు అందుబాటులో పెట్టింది.

అశ్వారావుపేట వ్యవసాయ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 30, 2026 నాటికి ఐదు మండలాల్లో నమోదైన వర్షపాతం ఇలా ఉంది. అన్నపురెడ్డిపల్లి: సాధారణం 431.1 మి.మీ. కాగా, 296.3 మి.మీ. మాత్రమే నమోదై 31.3 శాతం లోటు నమోదైంది. అశ్వారావుపేట: సాధారణం 417.8 మి.మీ.కు గాను 206 మి.మీ. మాత్రమే కురవడంతో 57.7 శాతం లోటు నమోదైంది. చంద్రుగొండ: సాధారణం 409.1 మి.మీ.కు గాను 540.8 మి.మీ. వర్షం కురిసి 32.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దమ్మపేట: సాధారణం 463.8 మి.మీ.కు గాను 196 మి.మీ. మాత్రమే నమోదై 50.7 శాతం లోటు నమోదైంది. ములకలపల్లి: సాధారణం 502.6 మి.మీ.కు గాను 346 మి.మీ. నమోదై 31.2 శాతం లోటు కనిపించింది.

మొత్తం అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో జూలై 30 నాటికి సాధారణంగా కురవాల్సిన 444.8 మి.మీ. వర్షపాతానికి బదులుగా 317 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో డివిజన్ వ్యాప్తంగా 28.7 శాతం వర్షపాతం లోటు నమోదైంది. కాగా, గత ఏడాది (2025) ఇదే తేదీ నాటికి సాధారణ వర్షపాతంతో పోలిస్తే 21.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గతేడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -