కాళ్లు పట్టుకున్న కనికరం లేకపాయే..!

– వివాదాస్పదంగా 566 బైపాస్ రోడ్  నిర్మాణం
– అలైన్మెంట్ పై అభ్యంతరాలు
– భారీగా  నష్టపోతామని బాధితుల ఆవేదన
– పోరుబాట పట్టిన నిర్వాసితులు
– అధికార పార్టీకి తలనొప్పిగా మారిన వైనం
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణాన్ని నందనవనంగా మారుస్తానని హామీ  ఇచ్చారు. అయితే పట్టణ  అభివృద్ధిలో భాగంగా నల్లగొండ పట్టణం చుట్టూ  నూతనంగా వేయనున్న   565 జాతీయ రహదారి బైపాస్ రోడ్ నిర్మాణం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. పాలకవర్గం, జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయమే ఇందుకు ప్రధాన కారణం. వారు  తీసుకున్న నిర్ణయంతో నల్లగొండ బైపాస్ రోడ్డు పట్టణం మధ్య గుండా పోతుండడంతో నల్లగొండ పట్టణ రెండు ముక్కలుగా అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్లాట్లను, ఇళ్ల స్థలాలను కోల్పోతున్న ప్రజలు తీవ్రంగా  ఆందోళన చెందుతున్నారు. పోరు బాట పట్టారు. ఇటీవలే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండలంలోని ధర్వేశిపురం  రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి వెళ్తుండగా భూ నిర్వాసితులు మంత్రి  కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే మంత్రి మాత్రం కాళ్లు పట్టుకున్న తమ ఆవేదనను పట్టించుకోలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో అలాన్మెంట్ మార్పు చేయడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఈ విషయం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమై అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.
ఆప్షన్లు ఏం చెబుతున్నాయంటే..
రింగ్ రోడ్డు నిర్మాణం కోసం నేషనల్ హైవే (ఎన్ హెచ్) అధికారులు మూడు రకాల ప్రతిపాదనలను సూచించారు.ఆప్షన్ 1అంటే ఉదయ సముద్రం గేట్స్ లెఫ్ట్ సైడ్ నుండి అద్దంకి హైవే వయా కేశరాజు పల్లి నుండి ముషాంపల్లి రోడ్డు లో ఉన్న గుట్ట కింది అన్నారం ఉూరు బయట నుంచి ఎస్ ఎల్ బి సి  సాగర్ రోడ్డు, కేబి  తండ  వరకు.ఆప్షన్ 2 లో  చర్లపల్లి, మునుగోడు రోడ్ రాజీవ్ గృహ కల్ప, మామిల్లగూడెం,కొత్తపల్లి మీదుగా కేబి తండ సాగర్ రోడ్డు వరకు. 3 వ  ఆప్షన్ సిటీ మధ్యగుండా  అంటే అద్దంకి హైవే మార్రిగూడ సర్కిల్  (వెల్కమ్ టు నల్లగొండ)  సర్కిల్ నుంచి మరిగూడ, గిరికబావి గూడెం, మునుగోడు రోడ్, గుండ్ల పల్లి రోడ్డు సర్కిల్ మీదుగా దేవరకొండ రోడ్డు లో ఉన్న వినాయక హౌసింగ్ బోర్డు కాలనీ, శివాంజనేయ ఫంక్షన్ హాల్ మీదుగా సాగర్ రోడ్డు దగ్గరలో ఉన్న గ్రీన్ సిటీ,  దగ్గరలో ఉన్న పోప్ పాల్ కాలేజీ,  మెడికల్ కాలేజీ మీదుగా సాగర్ రోడ్డు ఎస్ఎల్బిసి  మీదుగా వెళుతుంది.
 మూడో ఆప్షన్ ఆమోదంలో ఆంతర్యం ఏంటి?
నేషనల్ హైవే అధికారులు ప్రజలకు తక్కువగా నష్టం కలిగించి పట్టణ అభివృద్ధి కి దోహదం చేసే ఆప్షన్ 1, 2 ను కాదని 3వ  ఆప్షన్ ఎంచుకోవడంలో ఆంతర్యం ఏంటో  ఎవరికి అర్థం కాని ప్రశ్న. పట్టణ ప్రజల మాత్రం  అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల  అండదండలతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆప్షన్ 1 లో 11 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు వేయాల్సి వస్తుంది. ఆప్షన్ 2లో 20 కిలోమీటర్ల మేర రోడ్డును వేయాలి. ఆప్షన్ 1, 2 లో  వ్యవసాయ భూములు మీదిగానే రోడ్డు వెళుతుంది. ఇక ఆప్షన్ 3 లో 15 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణం చేయాలి. ఇందులో వ్యవసాయ భూములతో పాటు  రోజు కాయకష్టం చేసుకునే పేద ప్రజలు ప్లాట్లు, ఇళ్ల స్థలాలను కోల్పోవాల్సి వస్తుంది. ఎఫ్ సి ఐ గోదాములో పనిచేసే రైల్వే కూలీలు, అధికంగా దేవరకొండ రోడ్డు లో ఉన్న వ్యవసాయ చేసుకునే పేద ప్రజలకు సంబంధించి  సుమారుగా 2,950 ప్లాట్లు, 200 ఇండ్లను  నష్టపోతున్నారు.
ఆప్షన్ 1 వల్లే పట్టణ అభివృద్ధి…
బైపాస్ అనేది పట్టణం  బయట నుంచి రావడం వల్ల  అభివృద్ధి చెందే  అవకాశం ఎక్కువగా ఉంది. పట్టణం లోపల కొత్త వెంచర్లు, పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఇతర వ్యాపారాలు అభివృద్ధి చెంది అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీకి టాక్సీలు  విరివిగా  వస్తాయి. దీంతో నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. నల్గొండ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు,  పట్టణ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా బైపాస్ చుట్టూ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, గోదాములు, షోరూమ్ లు, మెకానిక్ షెడ్స్, ఏర్పడి భూముల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.  రీయల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగే అవకాశం ఉంది.
న్యాయం చేయాలని బాధితుల ఆందోళన..
ప్రజలకు తక్కువ నష్టాన్ని కలిగించి, పట్టణాభివృద్ధికి ఎక్కువగా దోహదపడే ఆప్షన్ 1ని  ఎంచుకొని బైపాస్ రోడ్డు నిర్మించాలని, 3 వ  ప్రతిపాదనను రద్దు చేయాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. మొదట గత సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాగా గత కొద్దిరోజుల క్రితం  మంత్రిని  నేరుగా కలిసి తమ ఆవేదనను వెల్లడించారు. కాగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సిపిఐ (ఎం) పట్టణ కార్యదర్శి ఎండి. సలీం  ఆధ్వర్యంలో బాధితులు మరోసారి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఎవరికి అన్యాయం జరగనీయమని హామీ ఇచ్చిన బాధితులు ఆందోళన తగ్గడం లేదు.ఎన్నో ఏళ్ల క్రితం వేల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసిన ప్లాట్ల విలువ ప్రస్తుతం లక్షలకు చేరుకుంది.అయితే ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం తక్కువగానే ఉంటుంది. బహిరంగ మార్కెట్ ధర ఇవ్వదు.అధికారికంగా నిర్ణయించిన ధరనే నిర్వాసితులకు ఇవ్వనున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. 3వ  ఆప్షన్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.బైపాస్ రోడ్డు నిర్మాణానికి తాము  వ్యతిరేకం కాదని, ఆప్షన్ 3 గా  తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రజలకు తీవ్రంగా నష్టాన్ని చేకూర్చే ఆప్షన్ 3 ను రద్దుచేసి 1వ ఆప్షన్ ఎంచుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలనికోరుతున్నారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో ఆలోచించిన ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి   ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించి  కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అదే విధంగా   నల్గొండ బైపాస్ రోడ్డును ను సిటీ బయట నుంచి తీసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టణ ప్రజలకు కోరుతున్నారు. మరి పట్టణ ప్రజల కోరిక ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి.
బయట నుండి బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలి…
దండంపల్లి సత్తయ్య (సీపీఐ(ఎం) జిల్లా కమిటీ)

ఎక్కడైనా జాతీయ రహదారులకు బైపాస్ రోడ్లు వేసే చోట పట్టణాల గుండా కాకుండా మున్సిపల్ పరిధి బయట నుండి చేపడతారు.పట్టణం వెలుపల నుండి  రోడ్డు నిర్మాణం గ్రామీణ ప్రాంతాల నుండి రావడం ద్వారా ఆ ప్రాంతాలకు భూమి విలువ పెరిగి చిన్న పరిశ్రమలు, షోరూం లు, హోటల్స్ మెకానిక్ షెడ్లు ఏర్పాటు అవుతాయి. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. 3వ  ఆప్షన్ వెంటనే రద్దు చేసి,  1 లేదా 2 ఆప్షనులను అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బిజెపి కేంద్ర ప్రభుత్వం బాధితుల పక్షాన ధర్నాలు చేయడం కాకుండా వెంటనే కేంద్ర మంత్రిని కలిసి ఆప్షన్ మూడు రద్దు చేయించే విధంగా తీసుకోవాలని  బిజెపి నాయకులను డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్, బిజెపిలు పేద మధ్యతరగతి ప్రజలు కష్టపడి పైసా పైసా కూడా పెట్టి కొనుక్కున్న ప్లాట్లు, ఇండ్లు పోకుండా బాధితుల బాధలు అర్థం చేసుకోని  ఆప్షన్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Spread the love