Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. పరకాల మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, మున్సిపాలిటీ పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సోమవారం ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల తరలింపు, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూళ్లు మరియు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే పనులను వెంటనే అడ్డుకోవాలని సూచించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, మున్సిపల్ సేవల్లో పారదర్శకతను పెంచేలా వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి మంజూరైన నిధులను ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సద్వినియోగం చేస్తూ, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణలో విద్యుత్ పొదుపు చర్యలు పాటించాలని, నిరంతరం పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. నూతన కమిషనర్ పోతరాజు పవన్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరకాల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమిషనర్ పోతరాజు పవన్, ఏఈ రవీందర్, టీపీఎస్ సుమన, టీపీబీఓ సందీప్, జూనియర్ అకౌంట్స్ అధికారి అర్షద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -