నవ్వుతూనే ఉంటారు..

తిరువీర్‌ హీరోగా రూపక్‌ రొనాల్డ్సన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్‌’. వాల్తేరు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి హీరో రానా దగ్గుబాటి సమర్పణ.
జూన్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో తిరువీర్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు విలక్షణమైన పాత్రలు చేశాను. తొలిసారి హాస్య ప్రధానమైన జోనర్‌ని ఎంచుకున్నాను. దర్శకుడు రూపక్‌ తను చూసిన జీవితం, ఊరు, స్నేహం, అక్కడి ప్రజల పాత్రలని తీసుకుని ఒక ఇమాజినరీ వరల్డ్‌ని క్రియేట్‌ చేశాడు. కథ, పాత్రలు, లొకేషన్స్‌ .. అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణి పోరగాళ్ళ కథ. మంచిర్యాల ఊరుని ఒక బయోపిక్‌లా తీస్తే అదే ఈ కథ. ఇందులో చాలా నేచురల్‌ కామెడీ ఉంటుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ డ్రామా. ఇందులో ప్రతి పాత్రకు ఏదో పరేషాన్‌ ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి ‘పరేషాన్‌’అని పేరు పెట్టాం. రానా ఈ సినిమా చూసిన తర్వాత.. డైరెక్టర్‌, నిర్మాతతో ‘నేను మీకు ఏం చేయగలుగుతాను. సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఏం చేద్దాం’ అని మాత్రమే అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆయన నవ్వుతూనే ఉన్నారు’ అని అన్నారు.

Spread the love