బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కావాలనే చేస్తున్నరు..

– ప్రతిపక్షం కూడా దక్కదు
– వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
కీలకమైన బడ్జెట్‌ చర్చల్లో పాల్గొనాల్సిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కావాలనే బయటకు వెళ్లారని, 10 ఏండ్ల తర్వాత కింద కూర్చున్నామని జీర్ణించుకోలేక పోతున్నా రని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకుండానే ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నా డ్రామా ఆడుతున్నారని, అసెంబ్లీలో కీలకమైన చర్చ జరుగుతుంటే ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ప్రజలే సమాధానం చెబుతారన్నారు. ముఖ్యమైన బడ్జెట్‌ సమావేశం జరుగుతుంటే రకరకాల కారణాలతో కేసీఆర్‌ అసెంబ్లీకే రావడం లేదన్నారు. సభలో పాల్గొనకుండా నల్లగొండ లో సభ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి అనవసరమైన సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అక్రమాలను బట్టబయలు చేస్తామన్నారు. తెలంగాణ సభ్యసమాజం తలదించేసుకునే విధంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, వారికి ప్రతిపక్షం హౌదా కూడా దక్కదన్నారు. రాజ్యసభ తీసుకుని కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినా ఆశ్చర్యం లేదన్నారు.కాళేశ్వరంలో వేలకోట్లు అక్రమాలు జరిగాయని, మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టుల్లో నీళ్లు నింపితే ప్రమాదం జరుగుతుందన్న ఇంజినీర్ల సూచనల మేరకే నీళ్లు నింపలేదన్నారు. రేవంత్‌ రెడ్డి కష్టపడి అధికారంలోకి వచ్చారని స్పష్టం చేశారు.

Spread the love