బీఆర్‌ఎస్‌ను నిందించేందుకే ఈ బడ్జెట్‌ : కవిత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఆత్మస్తుతి పరనిందలాగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత ప్రభుత్వాన్ని నిందించటం కోసమే బడ్జెట్‌ పెట్టారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలపై సరైన స్పష్టత లేదని చెప్పారు. ఆరు గ్యారెంటీలకు తగిన విధంగా బడ్జెట్‌ పెట్టలేదన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పారనీ, ఇంత వరకు ఎక్కడా ఇవ్వలేదని చెప్పారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగాయన్నారు. ఇచ్చిన వాగ్దానాల అమలుకు సాధ్యం కాని బడ్జెట్‌ పెట్టారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి రోజూ ప్రజలను సీఎం కలుస్తారని చెప్పి, ప్రజావాణి పెట్టామని చెప్పారు..ఒక్క రోజు మాత్రమే సీఎం ప్రజలకు కలిశారని గుర్తు చేశారు. ఆ తరువాత ఇద్దరు ముగ్గురు మంత్రులే ప్రజావాణిలో ఉన్నారనీ, చివరకు ఐఏఎస్‌లే ప్రజా వాణిలో ఉంటున్నారని గుర్తు చేశారు. ఆ కార్యక్రమాన్ని వింటామంటూ ఢిల్లీ వాణి వింటున్నారని ఎద్దేవా చేశారు. కౌన్సిల్‌ గౌరవ మర్యాదలను కించపరిచిన సీఎం తన మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీకీ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాహుల్‌గాంధీ పాదయాత్రకు తెలంగాణ బస్సులు పెట్టారని కవిత ఆరోపించారు.

Spread the love