ఇదేం తీరు..!

This is the way..!– కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీలో అదానీ సలహాదారు
– ఈ కమిటీ పర్యవేక్షణలోనే పలు కంపెనీల హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు
– అందులో ఆరు అదానీ ప్రాజెక్టులే..
వడ్డించే వాడు మనవాడైతే..ఏమూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలకు కొదవ ఉండదని నానుడి. ఇపుడు మోడీ ప్రభుత్వం తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. పర్యావరణం ప్రగతికి ఎంతో కీలకమని చెప్పే బీజేపీ సర్కార్‌..ఇపుడు ఏకంగా అడవులనుంచి గిరిజనుల్ని తరిమికొట్టి అటవీసంపదను కొల్లగొట్టేలా చట్టాలు మార్చుతోంది. మరోవైపు కార్పొరేట్లను ప్రసన్నం చేసుకోవటానికి ఓ కీలకమైన కేంద్రప్రభుత్వకమిటీలో అదానీ గ్రూపు సలహాదారుడికి చోటు కల్పించింది.దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను పర్యవేక్షించే నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ)లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు కీలకమైన సలహాదారుడైన జనార్దన్‌ చౌదరియోన్‌ సభ్యుడిగా ఉన్నట్టు స్పష్టం అయింది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా మోడీ సర్కార్‌ చర్యలను ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు. వివిధ కంపెనీలు సమర్పించిన హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే అంచనా కూడా వేస్తుంది. ప్రస్తుతం అదానీ కంపెనీకి చెందిన ఆరు హైడల్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు ఈ కమిటీ ముందు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి సమయంలో కమిటీలోని ఏడుగురు నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ సభ్యులలో ఒకరిగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జనార్దన్‌ చౌదరియోన్‌ను సెప్టెంబర్‌ 27న పేర్కొంది. జల విద్యుత్‌, నదీ లోయ ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖ నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ)ని పునర్వ్యవస్థీకరించినప్పుడు ఆయనను సభ్యుడిగా చేర్చారు. పునర్వ్యవస్థీకరించబడిన ఈ కమిటీ (ఈఏసీ) ప్రారంభ సమావేశం అక్టోబర్‌ 17-18 తేదీలలో జరిగింది. కాగా మహారాష్ట్రలోని సతారాలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీ ఈఎల్‌)కు చెందిన 1500 మెగావాట్ల తరాలి పంపింగ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలతో అక్టోబర్‌ 17 సమావేశానికి చౌదరి హాజరైనట్లు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి.
ఈ కమిటీ ఏజీఈఎల్‌ ప్రాజెక్ట్‌ లే అవుట్‌లో మార్పులకనుగుణంగా ప్రాజెక్ట్‌ నిబంధనల (టీఓఆర్‌)లో మార్పులను కోరింది. ప్రతిపాదిత నీటి వాహక వ్యవస్థ ఇప్పటికే ఉన్న విండ్‌ ఫామ్‌తో కలుస్తుందని తెలుసుకున్నప్పుడు ఈ సర్దుబాటు అవసరం అయింది. ఈ వ్యవస్థ భూగర్భంలో నిర్మించబడిందా? లేదా విండ్‌ టర్బైన్‌ పునాదుల క్రింద నిర్మించబడిందా? అనే నిర్మాణ సవాళ్లను ఎదుర్కొంటుంది. చర్చల తర్వాత, అదానీకి చెందిన ఏజీఈఎల్‌ అభ్యర్థనను ఈఏసీ ఆమోదించడం గమనార్హం. ఈ విషయంలో, చౌదరి మాట్లాడుతూ ఏజీఈఎల్‌ ప్రాజెక్ట్‌పై ఈఏసీ చర్చలో తాను పాల్గొనలేదని అన్నారు. ”విషయం చర్చకు వచ్చినప్పుడు నేను దూరంగా ఉన్నాను” అని ఆయన అన్నారు. అయితే, సమావేశం మినిట్స్‌లో ఆయన తిరస్కరణ ప్రస్తావనే లేదు.
పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం 2006 ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఈఐఏ) నోటిఫికేషన్‌ ద్వారా నిర్దేశించబడిన ప్రాజెక్ట్‌లకు అనుమతి మంజూరు చేసే బాధ్యత ఈఏసీకి ఉంది. నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు ముందస్తు పర్యావరణ అనుమతి (ఈసీ) అవసరం. వివిధ రంగాల్లోని ప్రతిపాదనల క్లియరెన్స్‌పై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఈఏసీలు కలిగి ఉంటాయి. అలాంటి కీలకమైన ఈఏసీ సభ్యునిగా చౌదరి నియామకం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి అదానీకి చెందిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌లన్నీ అదే కమిటీ పరిశీలనలో ఉన్న సమయంలో ఈ నియామకం జరగటమే ఈ ఆందోళనలకు కారణం.
కమిటీ ముందు అనుమతి కోసం అదానీ ప్రాజెక్టులు
ఈఏసీ ముందు అనుమతులు కోసం అదానీ కి సంబంధించిన ఆంద్రప్రదేశ్‌ లోని రైవాడలో 850 మెగావాట్లు, పెదకోటలో 1800 మెగావాట్లు, మహారాష్ట్రలోని పట్‌గావ్‌ లో 2100 మెగావాట్లు, కోయినా-నివాకనేలో 2,450 మెగావాట్లు, మల్షేజ్‌ ఘాట్‌ లో 1500 మెగావాట్లు, తాలూలో 1500 మెగావాట్లు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.15,740 కోట్ల పెట్టుబడితో అదనంగా 3.7 గిగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
ప్రతిపక్షాల ఆగ్రహం
అదానీకి చెందిన 10,300 మెగావాట్లతో కూడిన 6 ప్రాజెక్టులు అనుమతుల కోసం కమిటీ ముందు ఉన్నాయని, ఆ కమిటీ సభ్యుడిగా అదాని కంపెనీ సలహాదారుడిని నియమించడం దారుణమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ”జాతీయ భద్రత పేరుతో ఎన్నికైన ఎంపీపై ఎథిక్స్‌ కమిటీ చర్యలకు ప్రతిపాదించింది. మరి పర్యావరణ మంత్రిత్వ శాఖలో ప్రయివేట్‌ కంపెనీ వ్యక్తిని ఏ నిబంధనలు ప్రకారం నియమించారు?” అంటూ ప్రశ్నించింది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ”మోడీజీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అదానీ ఉద్యోగి జనార్దన్‌ చౌదరిని ఈఏసీలో సభ్యునిగా నియమించింది. అదానీకి చెందిన ఆరు ప్రాజెక్టుల ఆమోదానికేనా ..?” అంటూ విమర్శించారు.

Spread the love