సిరీస్‌ చిక్కింది ఇక్కడే!

సిరీస్‌ చిక్కింది ఇక్కడే!– ఛేదనలో గిల్‌, ధ్రువ్‌ అసమాన ఇన్నింగ్స్‌లు
– నాల్గో టెస్టులో 5 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు
– టెస్టు సిరీస్‌ 3-1తో టీమ్‌ ఇండియా వశం
ఊరించే లక్ష్యం. ఇంగ్లాండ్‌ స్పిన్‌ ఉచ్చు. పరుగులు అంత సులువుగా రావటం లేదు. 120 పరుగులకే ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో 72 పరుగులు అవసరమైన దశలో ఒత్తిడి భారత్‌పై నెలకొంది. ఇంగ్లాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో మాయ చేయటం మొదలెట్టింది. ఇంగ్లాండ్‌ ఆశలను ఆవిరి చేస్తూ ఆతిథ్య జట్టును గట్టెక్కించారు ధ్రువ్‌ జురెల్‌ (39 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌) అసమాన ప్రదర్శన చేశారు. ఆరో వికెట్‌కు అజేయ భాగస్వామ్యంతో భారత్‌కు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టారు.
బజ్‌బాల్‌కు తొలి దెబ్బ తగిలింది. స్టోక్స్‌, మెక్‌కలమ్‌ జోడికి తొలి సిరీస్‌ ఓటమి ఎదురైంది. సిరీస్‌ ఓటమి లేకుండా భారత్‌కు వచ్చిన బజ్‌బాల్‌ ఇంగ్లాండ్‌.. ఇక్కడ గట్టిగా పోరాడినా పరాజయం తప్పలేదు. మరోవైపు వరుస టెస్టులకు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయినా ఆతిథ్య భారత్‌ అదరగొట్టే ప్రదర్శన చేసింది. యువ జట్టుతోనే ఇంగ్లాండ్‌ మెడలు వంచింది. 3-1తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ నామమాత్రపు ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరుగుతుంది.
నవతెలంగాణ-రాంచి
ఇంగ్లాండ్‌ స్పిన్‌ వలను ఛేదిస్తూ రాంచి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌, 124 బంతుల్లో 2 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (39 నాటౌట్‌, 77 బంతుల్లో 2 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగటంతో 61 ఓవర్లలో 192 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపొందింది. ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (55, 81 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), యశస్వి జైస్వాల్‌ (37, 44 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. ఇంగ్లాండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ (3/79) ఆ జట్టుకు ఆశలు రేపినా.. గిల్‌, జురెల్‌ తుఫాన్‌లో స్టోక్స్‌సేన కొట్టుకుపోయింది. ఛేదనలో అజేయ మెరుపులకు తోడు తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 90 పరుగుల ఇన్నింగ్స్‌ నమోదు చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సాధించాడు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీమ్‌ ఇండియా.. మరో టెస్టు మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను లాంఛనంగా సొంతం చేసుకుంది.
ఓపెనర్ల దూకుడు
192 పరుగుల ఛేదనలో టీమ్‌ ఇండియా ఓపెనర్లు దూకుడు చూపించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (55) అర్థ సెంచరీతో కదం తొక్కగా యశస్వి జైస్వాల్‌ (37) ఆకట్టుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 40/0తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. యశస్వి ఐదు బౌండరీలతో దండెత్తగా.. రోహిత్‌ సైతం ఐదు ఫోర్లు బాదాడు. ఓపెనర్లు వడివడిగా పరుగులు చేయటంతో భారత్‌ లక్ష్యానికి చేరువైంది. 17.3 ఓవర్లలో 84 పరుగులు జోడించిన ఓపెనర్ల భాగస్వామ్యానికి రూట్‌ తెరదించాడు. రూట్‌ ఓవర్లో కండ్లుచెదిరే క్యాచ్‌ అందుకున్న అండర్సన్‌.. యశస్వి జైస్వాల్‌ను పెవిలియన్‌కు చేర్చారు. నం.4 బ్యాటర్‌ రజత్‌ పటీదార్‌ (0), రోహిత్‌ శర్మ (55) నిష్క్రమించటంతో లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 118/3తో నిలిచింది. 69 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన రోహిత్‌ శర్మ ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.
గిల్‌, ధ్రువ్‌ అదుర్స్‌
లంచ్‌ విరామం అనంతరం భారత్‌కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0)లు వరుస బంతుల్లో వికెట్‌ చేజార్చుకున్నారు. షోయబ్‌ బషీర్‌ అద్భుత బంతులతో వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టాడు. దీంతో 120/5తో భారత్‌ ఒత్తిడిలో పడింది. మరో 72 పరుగులు అవసరమైన దశలో పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలించింది. చివరి వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయిన గత చేదు రికార్డులు మదిలో మెదులుతున్న తరుణంలో భారత శిబిరంలో ఆందోళన, ఇంగ్లాండ్‌ అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ శుభ్‌మన్‌ గిల్‌ (52) తోడుగా ధ్రువ్‌ జురెల్‌ (39 నాటౌట్‌) అద్భుతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లు తోడుగా విలువైన భాగస్వామ్యాలు నిర్మించిన ధ్రువ్‌ జురెల్‌.. ఛేదనలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ జతగా దంచికొట్టాడు. 77 బంతుల్లో 2 బౌండరీలతో అజేయంగా 39 పరుగులు జోడించాడు. శుభ్‌మన్‌ గిల్‌ 122 బంతుల్లో 2 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. విజయానికి చేరువైన దశలో గిల్‌ రెండు సిక్సర్ల మోతతో ఇంగ్లాండ్‌ ఆశలను ఆవిరి చేయగా.. జురెల్‌ గెలుపు పరుగులతో భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 353/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 307/10
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 145/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) బెన్‌ ఫోక్స్‌ (బి) టామ్‌ హర్ట్‌లీ 55, యశస్వి జైస్వాల్‌ (సి) అండర్సన్‌ (బి) జో రూట్‌ 37, శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 52, రజత్‌ పటీదార్‌ (సి) పోప్‌ (బి) షోయబ్‌ బషీర్‌ 0, రవీంద్ర జడేజా (సి) బెయిర్‌స్టో (బి) షోయబ్‌ బషీర్‌ 4, సర్ఫరాజ్‌ ఖాన్‌ (సి) పోప్‌ (బి) షోయబ్‌ బషీర్‌ 0, ధ్రువ్‌ జురెల్‌ నాటౌట్‌ 39, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (61 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం : 1-84, 2-99, 3-100, 4-120, 5-120.
బౌలింగ్‌ : జో రూట్‌ 7-0-26-1, టామ్‌ హర్ట్‌లీ 25-2-70-1, షోయబ్‌ బషీర్‌ 26-4-79-3, జేమ్స్‌ అండర్సన్‌ 3-1-12-0.
‘పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అనుకుంటాను. తొలి ఇన్నింగ్స్‌లో కంటే ఇప్పుడే ఎక్కువ పరుగులు చేశామని అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు వేగంగా పడిపోయాయి. టెయిలెండర్లతో కలిసి భాగస్వామ్యాలు నమోదు చేశాను. నా ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ల ఘనత సైతం ఉంది. అండర్సన్‌, మార్క్‌వుడ్‌ బౌలింగ్‌ను టెలివిజన్‌లో చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారిపై ఆడటం ఎంతో బాగుంది. క్రీజులో ఉన్నప్పుడు ఫోకస్‌ పూర్తిగా బంతిపైనే కానీ బౌలర్‌పై కాదు. ఛేదనలో గిల్‌, నేను చిన్న లక్ష్యాలపై దృష్టి నిలిపాం. పదేసి పరుగుల చొప్పున టార్గెట్‌ పెట్టుకుని ఛేదించాం’
– ధ్రువ్‌ జురెల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

Spread the love