గెలుపు వాకిట!

గెలుపు వాకిట!– విజయానికి 152 పరుగుల దూరంలో భారత్‌
– ఛేదనలో మెరిసిన రోహిత్‌ శర్మ, యశస్వి

– స్పిన్నర్లు అశ్విన్‌, కుల్దీప్‌ 9 వికెట్ల మాయజాలం
– రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 145 ఆలౌట్‌

– భారత్‌, ఇంగ్లాండ్‌ నాల్గో టెస్టు మూడో రోజు
రాంచి టెస్టు టీమ్‌ ఇండియా గుప్పిట్లోకి వచ్చింది. తొలి రెండు రోజుల ఆటలో కాస్త వెనుకంజ వేసిన ఆతిథ్య భారత్‌ మూడో రోజు బలంగా పుంజుకుంది. స్పిన్‌ పిచ్‌పై వికెట్ల మాయజాలంతో ఏకంగా గెలుపు వాకిట నిలిచింది. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ (5/51), కుల్దీప్‌ యాదవ్‌ (4/22) మాయజాలం చేయగా ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. ధ్రువ్‌ జురెల్‌ (90) వీరోచిత ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ అసమాన పోరాటం చేసింది. టెయిలెండర్లు తోడుగా విలువైన పరుగులు జోడించిన జురెల్‌.. తొలి ఇన్నింగ్స్‌ లోటును 46 పరుగులకు కుదించాడు. 192 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌ (24), యశస్వి (16) అజేయంగా దంచికొడుతున్నారు. 8 ఓవర్లలోనే 40 పరుగులు పిండుకున్న ఓపెనర్లు భారత్‌ను విజయ తీరాలకు చేర్చే పనిలో ఉన్నారు. స్పిన్నర్ల స్వర్గధామ పిచ్‌పై నేడు మరో 152 పరుగులు చేస్తే టెస్టు సిరీస్‌ 3-1తో టీమ్‌ ఇండియా సొంతం కానుంది!.
నవతెలంగాణ-రాంచి : 152 పరుగులు. రాంచి టెస్టులో టీమ్‌ ఇండియా విజయానికి, ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ విజయానికి ఆతిథ్య భారత్‌ చేయాల్సిన పరుగులు. 192 పరుగుల సవాల్‌తో కూడిన ఛేదనలో భారత్‌ 40/0తో లక్ష్యం దిశగా సాగుతోంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (24 నాటౌట్‌, 27 బంతుల్లో 4 ఫోర్లు), యశస్వి జైస్వాల్‌ (16 నాటౌట్‌, 21 బంతుల్లో 1 ఫోర్‌) అజేయంగా ఆడుతున్నారు. భారత బ్యాటర్లు అంచనాలను అందుకుంటే.. రాంచి టెస్టులో టీ విరామం లోపే భారత్‌ గెలుపు సంబురాలు చేసుకోవచ్చు!. ఇక ధ్రువ్‌ జురెల్‌ (90, 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసమాన అర్థ సెంచరీతో మెరువగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌ (28, 131 బంతుల్లో 2 ఫోర్లు), ఆకాశ్‌ దీప్‌ (9, 29 బంతుల్లో 1 సిక్స్‌) జురెల్‌కు మంచి సహకారం అందించారు. జురెల్‌ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 పరుగుల వెనుకంజతో సరిపెట్టుకుంది. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ (5/51), కుల్దీప్‌ యాదవ్‌ (4/22) మ్యాజిక్‌తో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఓపెనర్‌ జాక్‌ క్రావ్లీ (60, 91 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కినా.. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ స్పిన్‌ మాయలో పడింది. జానీ బెయిర్‌స్టో (30), బెన్‌ ఫోక్స్‌ (17), బెన్‌ డకెట్‌ (15) రెండెంకల స్కోరు చేయగలిగారు. 54.5 ఓవర్లలో 145 పరుగులకే ఇంగ్లాండ్‌ కథ ముగియగా.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలిపి భారత్‌ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
మాయ చేశారు : తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం. భారత స్పిన్నర్లపై ఎదురుదాడితో వేగంగా పరుగులు చేసిన రికార్డు. దీంతో సహజంగానే ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధిస్తుందనే అంచనాలు కనిపించాయి. కానీ భారత మాయగాళ్లు ఇంగ్లాండ్‌ ఆశలను ఆవిరి చేశారు. ఓపెనర్లు జాక్‌ క్రావ్లీ (60), బెన్‌ డకెట్‌ (15) దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలెట్టారు. ఇంగ్లాండ్‌ జోరుకు తొలి బ్రేక్‌ అశ్విన్‌ వేశాడు. ఇన్నింగ్స్‌తో ఐదో ఓవర్లో వరుస బంతుల్లో బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌ (0)లను సాగనంపాడు. డకెట్‌ షార్ట్‌ లెగ్‌లో సర్ఫరాజ్‌ చేతికి చిక్కగా.. ఒలీ పోప్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 19/2తో ఇంగ్లాండ్‌ వరుస బంతుల్లో ఇద్దరు బ్యాటర్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌ శతక హీరో జో రూట్‌ (11) జతగా జాక్‌ క్రావ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ రూట్‌ ఈసారి అశ్విన్‌ వల నుంచి తప్పించుకోలేకపోయాడు. 65/3తో ఇంగ్లాండ్‌ ఒత్తిడిలో పడినా.. జానీ బెయిర్‌స్టో (30, 42 బంతుల్లో 3 ఫోర్లు), జాక్‌ క్రావ్లీ దూకుడుగా ఆడారు. క్రావ్లీ 96 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడికి కుల్దీప్‌ యాదవ్‌ విడదీశాడు. క్రావ్లీ కోసం కవర్స్‌ను వదిలేసిన కుల్దీప్‌ యాదవ్‌… అతడు ఏ షాట్‌ ఆడాలో తను నిర్దేశించాడు!. కుల్దీప్‌ మాయలో పడిన క్రావ్లీ కవర్స్‌లో షాట్‌ కోసం ప్రయత్నించి వికెట్‌ను కోల్పోయాడు. ఇక్కడ్నుంచి ఇంగ్లాండ్‌ పతనం వేగవంతమైంది. 110 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌.. మరో 35 పరుగులకే చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. బెన్‌ స్టోక్స్‌ వికెట్లను సైతం గిరాటేసిన కుల్దీప్‌ యాదవ్‌..పర్యాటక జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. జానీ బెయిర్‌ స్టోను జడేజా పెవిలియన్‌కు చేర్చగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ 41వ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. టామ్‌ హర్ట్‌లీ (7), ఒలీ రాబిన్సన్‌ (0)లను అవుట్‌ చేసి ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ దిశగా తీసుకెళ్లాడు. వరుస వికెట్లతో ఇంగ్లాండ్‌ పతనాన్ని మొదలెట్టిన అశ్విన్‌.. ఒకే ఓవర్లో మరోసారి రెండు వికెట్లు కూల్చి లాంఛనం ముగించాడు. బెన్‌ ఫోక్స్‌ (17), జేమ్స్‌ అండర్సన్‌ (0) వికెట్లతో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. 53.5 ఓవర్లలో 145 పరుగులకే ఇంగ్లాండ్‌ చేతులెత్తేసింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో ఏకంగా మూడు సార్లు రెండేసి వికెట్లు కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకుంది.
సూపర్‌ జురెల్‌ : 177/7. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ ఇండియా దీన స్థితి. స్పెషలిస్ట్‌ బ్యాటర్లలో ధ్రువ్‌ జురెల్‌ మినహా అందరూ పెవిలియన్‌కు చేరారు. ఇక్కడ్నుంచి మరో 30 పరుగులు చేసినా గొప్పే అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోక తప్పదేమో అనిపించింది. కానీ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (90) అదరగొట్టాడు. ఎం.ఎస్‌ ధోని, రిషబ్‌ పంత్‌ తరహాలో టెయిలెండర్లతో కలిసి అసమాన భాగస్వామ్యాలు నిర్మించాడు. కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి 202 బంతుల్లో 76 పరుగులు జోడించిన జురెల్‌.. ఆకాశ్‌ దీప్‌ (9)తో కలిసి 75 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగల్గింది. 96 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించిన జురెల్‌.. సెంచరీ ముంగిట వికెట్‌ కోల్పోయాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 219/7తో మూడో రోజు ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ 30.3 ఓవర్లలో మరో 88 పరుగులు జోడించింది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు షోయబ్‌ బషీర్‌ (5/119), టామ్‌ హర్ట్‌లీ (3/68) మాయ చేయగా.. పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (2/48) రాణించాడు.
ఛేదనలో దూకుడు : 192 పరుగుల ఛేదనలో భారత్‌ దూకుడుగా ఆడుతోంది. బజ్‌బాల్‌కు బజ్‌బాల్‌తోనే బదులు ఇచ్చేందుకు దంచికొడుతుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగు ఫోర్లు బాదగా.. యశస్వి జైస్వాల్‌ ఓ బౌండరీ కొట్టాడు. ఓపెనర్ల మెరుపులతో రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలోనే భారత్‌ 40 పరుగులు చేసింది. విజయానికి రోహిత్‌సేన మరో 152 పరుగుల దూరంలోనే నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ క్రీజులో అజేయంగా నిలిచారు.

స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 353/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 307/10
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రావ్లీ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 60, బెన్‌ డకెట్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) అశ్విన్‌ 15, ఒలీ పోప్‌ (ఎల్బీ) అశ్విన్‌ 0, జో రూట్‌ (ఎల్బీ) అశ్విన్‌ 11, జానీ బెయిర్‌స్టో (సి) పటీదార్‌ (బి) జడేజా 30, బెన్‌ స్టోక్స్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 4, బెన్‌ ఫోక్స్‌ (సి,బి) అశ్విన్‌ 17, టామ్‌ హర్ట్‌లీ (సి) సర్ఫరాజ్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 7, ఒలీ రాబిన్సన్‌ (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 0, షోయబ్‌ బషీర్‌ నాటౌట్‌ 1, జేమ్స్‌ అండర్సన్‌ (సి) జురెల్‌ (బి) అశ్విన్‌ 0, ఎక్స్‌ట్రాలు : 0,
మొత్తం : (53.5 ఓవర్లలో ఆలౌట్‌) 145.
వికెట్ల పతనం : 1-19, 2-19, 3-65, 4-110, 5-120, 6-120, 7-133, 8-133, 9-145, 10-145.
బౌలింగ్‌ : రవిచంద్రన్‌ అశ్విన్‌ 15.5-0-51-5, రవీంద్ర జడేజా 20-5-56-1, మహ్మద్‌ సిరాజ్‌ 3-0-16-0, కుల్దీప్‌ యాదవ్‌ 15-2-22-4.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ 24, యశస్వి జైస్వాల్‌ బ్యాటింగ్‌ 16, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (8 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 40.
బౌలింగ్‌ : జో రూట్‌ 4-0-17-0, టామ్‌ హర్ట్‌లీ 3-0-22-0, షోయబ్‌ బషీర్‌ 1-0-1-0.

Spread the love