భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వరద నీటి చేరికపై
అధికారులతో సమీక్ష
ఎస్సారెస్పీని సందర్శించిన
మంత్రులు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ- బాల్కొండ(మెండోరా)
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా చెక్కుచెదరకుండా లక్షలాది ఎకరాలకు సాగు నీరందిస్తున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్షలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తదితరులు సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతోపాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికిప్పుడూ వర్షాలు నిలిచిపోయినా, మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు.. 80 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 1072.30 అడుగులు.. 27.376 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు.
శనివారం మధ్యాహ్నం సమయానికి 85వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి ఆయకట్టు పంటలకు ఏ మేరకు విడుదల చేయాలన్న విషయమై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, మూడు సంవత్సరాలతో పోలిస్తే ఎస్సారెస్పీలో ఈసారి కొంత తక్కువ మేరకే నీటి నిల్వలు ఉన్నాయని, ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. గత సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్‌లో 38 టీఎంసీల నీరు నిలువ ఉండగా, ప్రస్తుతం 27 టీఎంసీలకే పరిమితం అయిందన్నారు. నిజానికి 112 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక చేరడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఎస్సారెస్పీలో పూడిక తొలగింపు ప్రక్రియ చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రజలపై ఎనలేని భారం మోపిందని విమర్శించారు.
మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల ద్వారా గత ప్రభుత్వం 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే ఒక్క కరెంట్ బిల్లు రూపంలోనే రూ.3వేల కోట్ల చార్జీలు అయ్యాయని అన్నారు. పంప్ హౌజ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తే బ్యారేజీలను ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన మంత్రులకు కలెక్టర్ భవేష్ మిశ్రా, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఎస్సారెస్పీ సీఈ సునితాదేవి తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్‌బిన్ హందాన్, నుడా చైర్మెన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మెన్ నగేష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మాజీ చైర్మెన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ మాజీ చైర్మెన్ అన్వేష్‌రెడ్డి, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ సీఈ సుమతిదేవి, ఈఈ లాల్‌సింగ్, డీఈఈలు సురేష్, సుకుమార్, రఘుపతి, గణేష్, శ్రీనివాస్, ఏఈఈలు రవి, వంశీ, సుశాంత్, శ్యామ్ పాల్గొన్నారు.
ఆ ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


