జీర్ణక్రియ మెరుగుదలకు…

జీవక్రియలను మెటబాలిజం అంటారు. అంటే మన శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటన్నమాట. మెటబాలిజం తగ్గితే అనారోగ్యం పాలవుతారు. లావెక్కుతారు, ఏం చేసినా సన్నబడరు. క్యాలరీలు త్వరగా ఖర్చు కావు కనుక గుండె జబ్బులు, డయాబెటీస్‌, బీపీ వంటివి వస్తాయి. మెటబాలిజం అనేది అందరిలో ఒకేలా ఉండదు. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. మెటబాలిజం పెంచాలంటే క్రమం తప్పకుండా ఎక్సర్‌ సైజులు చేయాలి, నీరు ఎక్కువ తాగాలి. ఇక మెటబాలిజం పెంచాలంటే అదంతా మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. చలికాలంలో కాస్త మెటబాలిజం సహజంగానే తగ్గుతుంది. కనుక శీతాకాలంలో మెటబాలిజం పెరగడానికి ఈ కింది ఆహారాన్ని తీసుకోండి.
గ్రీన్‌ టీ: టీలోని కెఫిన్‌ మెటబాలిజం పెరిగేందుకు సాయం చేస్తుంది. గ్రీన్‌ టీలో ఉన్న సుగుణాలు సమర్థవంతంగా కెలరీలను కరిగిస్తుంది.
కందిపప్పు: ఐరన్‌ పుష్కలంగా ఉన్న కందిపప్పు ఒంట్లో ఆక్సిజన్‌ ఫ్లో ను అమోఘంగా పెంచుతుంది. దీంతో మెటబాలిజం రేటు బాగా పెరిగి శక్తి వస్తుంది.
నట్స్‌: బాదం, పిస్తా వంటి నట్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు అరగాలంటే వాటికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇలా నట్స్‌ను అరిగించేందుకు ఎక్కువ శక్తి ఖర్చు చేసే క్రమంలో మీ శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. కనుక రోజూ గుప్పెడు బాదం, పిస్తా వంటివి లాగించండి. అయితే అతిగా తిని శరీరంలో కొవ్వు నిల్వలు పెంచుకోవద్దు.
కారం: కారం బాగా తింటే మెటబాలిజం వృద్దిచెందటం ఖాయం. దీంతో కెలరీలు బాగా ఖర్చు అయ్యి, ఒంట్లో కొవ్వు తగ్గుతుంది.
చేపలు: చేపలు తినటం వల్ల మెటబాలిజం బాగా పెరుగుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న చేపలు ఒంట్లో కొవ్వును బాగా కరిగిస్తాయి.
వీటికి దూరంగా: జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్‌ ఫుడ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ఇన్‌ స్టంట్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్లకండి. జంక్‌ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ పెరిగి మెటబాలిజం కుంటుపడుతుంది. కాబట్టి తేలికగా అరుగుతూ, స్వల్ప పరిమాణాల్లో గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటే బాడీ మెటబాలిజాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

Spread the love