ఏకపక్ష ఒప్పందంపై అప్రమత్తం
సుంకాలతో భారత్‌కు ముప్పు జిటిఆర్‌ఐ హెచ్చరిక
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్‌ఐ) హెచ్చరించింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భారత్ తొందరపడకూడదని స్పష్టం చేసింది. తగిన ప్రతిఫలం లభించని పక్షంలో ఇది కేవలం అమెరికా ప్రయోజనాలకే ఉపయోగపడే ఏకపక్ష ఒప్పందంగా మిగిలిపోయే ప్రమాదం తెలిపింది. ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య విధానాలపై లోతైన విశ్లేషణలు చేసే జిటిఆర్‌ఐ తాజాగా అమెరికా-భారత్ చర్చలు కీలక దశకు చేరుకున్న వేళ ఈ ప్రకటన చేసింది. ఆ వివరాలు.. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ని వినియోగించుకుంటూ ట్రంప్ ప్రభుత్వం విధించిన హెచ్చు సుంకాలను అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు తాజాగా కొట్టివేసింది. కేవలం వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి ఈ సెక్షన్‌ను ఆయుధంగా వాడటం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు నుంచి కూడా ఇటువంటి ఎదురుదెబ్బలే తగిలిన నేపథ్యంలో అమెరికా వాణిజ్య విధానం అత్యంత అస్థిరంగా మారిందని జిటిఆర్‌ఐ తెలిపింది. అమెరికా ప్రభుత్వం ఒక చట్టం కింద సుంకాలు విధించడం, కోర్టులు వాటిని కొట్టివేస్తే మరో సెక్షన్‌ను తెరపైకి తీసుకురావడం వంటి చర్యలతో ప్రపంచ సరఫరా గొలుసులో అనిశ్చితి నెలకొంటోందని నివేదిక విశ్లేషించింది. భారత్ విషయానికి వస్తే అమెరికా తన సొంత సుంకాలను తగ్గించుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని.. అదే సమయంలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మాత్రం అనేక రంగాల్లో పన్ను మినహాయింపులు కోరుతోందని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ తన మార్కెట్ అవకాశాలను శాశ్వతంగా అమెరికాకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంటే ప్రతిగా లభించే ప్రయోజనాలు శూన్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఒక స్థిరమైన, చట్టబద్ధమైన వాణిజ్య విధానం అమల్లోకి వచ్చే వరకు భారత్ వేచి చూడటమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.


