Thursday, June 11, 2026
E-PAPER
Homeమానవిరోజంతా యాక్టివ్​గా ఉండాలంటే….

రోజంతా యాక్టివ్​గా ఉండాలంటే….

- Advertisement -

మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే​ చేసే పనులు కీలకం. అయితే కొద్దిమంది ఉదయం లేవగానే పరగడుపున టీ, కాఫీ తాగడం, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్​ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేవగానే ఈ చిన్న పొరపాట్లను దూరం చేసుకుంటే హెల్దీ లైఫ్​స్టైల్​ అలవర్చుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం…

లేవడం: రాత్రి పడుకునేటప్పుడు చాలా మంది వెల్లకిలా పడుకుంటుంటారు. నైట్​ ఎలా పడుకుంటారో ఉదయాన్నే అదే పొజిషన్‌లో సడెన్​గా లేచి కూర్చుంటారు. అయితే అలా లేవడం వల్ల బిగుసుకుపోయిన కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి నైట్​ ఏ పొజిషన్​లో పడుకున్నా ఉదయం లేచేటప్పుడు కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిదంటున్నారు. అలాగే కాస్త అటూ ఇటూ కదలడం వల్ల శరీర భాగాలకు బ్లడ్​ సర్క్యులేషన్​ మెరుగవుతుందని వివరిస్తున్నారు.

కంగారు వద్దు: చాలా మంది లేవడానికి ఉదయమే లేస్తారు. కానీ పనులు మాత్రం పూర్తికావు. ఆఫీసు టైం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఫలితంగా ఆఖరి క్షణాల్లో కంగారు పడటమే కాకుండా.. మానసిక ఒత్తిడికి గురవుతుంటారని చెబుతున్నారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే వంటకు కావాల్సిన కూరగాయలను ముందురోజే రాత్రి కట్​ చేసి పెట్టుకోవడం, ఆఫీసుకి వేసుకునే డ్రస్ తీసి పెట్టుకోవడం.. వంటి పనుల్ని కంప్లీట్​ చేసుకోవాలంటున్నారు. ఫలితంగా మరుసటి రోజు ఉదయం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవడానికి, పనులు ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని సలహా ఇస్తున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌ మానద్దు: స్కూల్​కు, ఆఫీస్‌కు టైమవుతోందని, బస్​ మిస్​ అవుతోందని కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ తినడం కూడా మానేస్తుంటారు. ఒకటి రెండు రోజులు ఏమో కానీ దీర్ఘకాలంలో ఈ అలవాటు రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల స్థూలకాయం, మధుమేహం.. వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌కు సమయం సరిపోతుందని వివరిస్తున్నారు.

లేవగానే మొబైలా: చాలా మంది ఉదయం లేవగానే చేసే మరో పెద్ద పొరపాటు మొబైల్‌ చెక్ చేసుకోవడం. రీల్స్​ను అదే పనిగా స్ర్కోల్​ చేస్తుంటారు. అయితే ఫోన్​ చూసినంత సేపు అంతా పాజిటివ్​ న్యూస్​ ఉండదు. ప్రతికూల సమాచారం కంట పడితే మూడ్ మొత్తం అప్‌సెట్ అవుతుంది. తద్వారా ఆరోగ్యం పాడవుతుందంటున్నారు. కాబట్టి అత్యవసర కాల్స్, మెసేజెస్ చేసే పనుంటే తప్ప ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు. దీనికి బదులుగా ఉదయం లేవగానే కాసేపు పుస్తకం చదివితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని వివరిస్తున్నారు.

వార్మప్‌తో షురూ: ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే వ్యాయామాలు చేస్తున్నారు. అయితే లేవగానే అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి కండరాల ఆరోగ్యానికి అంత మంచిది కావంటున్నారు. ఎందుకంటే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఉదయం లేచే సమయానికి కండరాలు, ఎముకలు బిగుసుకుపోతాయని చెబుతున్నారు. కాబట్టి వీటిని వెంటవెంటనే కదిలించడం, ఒకేసారి ఎక్కువ బరువులెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం కాకుండా నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇందుకోసం వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్ చేయడం, యోగా, ధ్యానం.. వంటివి చేయడం మంచిదంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -