గుంటూరులో భారీ ర్యాలీ, బోర్డు కార్యాలయం వద్ద బైఠాయింపు
నవతెలంగాణ- గుంటూరు
వేలం కేంద్రాల్లో నో బిడ్డింగ్ విధానాన్ని అరికట్టాలని, కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు కదం తొక్కారు. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది రైతులు గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ నుంచి పొగాకు బోర్డు కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఆవరణంలో బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. పొగాకు బోర్డు కార్యాలయానికి రాయబారం కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వి.శోభనాద్రీశ్వరరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్‌కెఎం కన్వీనర్ చుండూరు రంగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (దాసరి భవన్) రాష్ట్ర అధ్యక్షులు జి.ఈశ్వరయ్య తదితరులు బోర్డు చైర్మన్ సిహెచ్.యశ్వంత్ కుమార్, బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీతో చర్చలు జరిపారు. నాయకులు మాట్లాడుతూ… సిగరెట్లపై పన్నుల పెంపుతో విక్రయాలు తగ్గుతాయన్న సాకు చూపి రైతుల వద్ద కొనుగోలుకు కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. అనేక వ్యయ ప్రయాసల కోర్చి వేలం కేంద్రాలకు తెచ్చిన పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వాటిని తీసుకువెళ్తున్నారని, ఇది వారికి మరింత భారంగా మారిందన్నారు. సాధారణంగా ఈ సమయానికి సగానికి పైగా కొనుగోళ్లు జరగాలని, కానీ ఇంత వరకూ పది శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయన్నారు. రూ.ఏడువేల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం పొగాకు ద్వారా వస్తుందని, ఇటువంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం సిగరెట్లపై ఇటీవల జిఎస్‌టి 28 శాతం నుండి 40 శాతానికి పెంచిందన్నారు. ఎగుమతులు పెంచడానికి, కంపెనీలు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం కొనుగోళ్లు చేయించటానికి చర్యలు చేపట్టాలని, కేంద్రంతో చర్చలకు రైతు నాయకుల బృందాన్ని తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకట్రావు, జె.జయంతిబాబు పాల్గొన్నారు.
మొత్తం కొనుగోలుకు కట్టుబడి ఉన్నాం : చైర్మన్
చర్చల అనంతరం బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. రైతుల డిమాండ్లపై మూడో తేదీన బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేయించడానికి బోర్డు కట్టుబడి ఉందని చైర్మన్ యశ్వంత్‌కుమార్ హామీ ఇచ్చారు. ఇండెంట్ ప్రకారం కంపెనీలు కొనుగోలు చేయాలని, లేదంటే నోటీసులు ఇస్తామని, అవసరం అయితే మెడలు వంచి కొనుగోలు చేయిస్తామని చెప్పారు. రూ.500 కోట్లు అడ్వాన్స్ కేటాయింపునకూ రాష్ర్ట వ్యవ సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి కేంద్ర ఫైనాన్స్ శాఖను కలిసి ప్రాతినిధ్యం చేస్తామన్నారు.
కదం తొక్కిన పొగాకు రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



