Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచెత్త ఆలోచన విరమించాలి

చెత్త ఆలోచన విరమించాలి

- Advertisement -

నవతెలంగాణ-కొత్తూరు
‘నాయకులను బట్టి ఆలోచనలు ఉంటాయి.. వారి ఆలోచనలను బట్టి అభివృద్ధి ఉంటుంది.. నాడు కేసీఆర్‌ హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో పల్లెలకు పచ్చందాలు తీసుకొచ్చారు. నేడు రేవంత్ రెడ్డి పట్నం చెత్తను పల్లెలకు తీసుకొచ్చి పర్యావరణాన్ని కలుషితం చేయాలని చూస్తు న్నారు.. ఇదీ నాయకుల ఆలోచనల తీరుకు మధ్యనున్న వ్యత్యాసం..’ అంటూ.. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ విషయంలో ప్రభుత్వం తమ చెత్త ఆలోచనను విరమించు కోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు ఎమ్మే సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం సిద్ధాపూర్ టూ చలో కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌‌తో కలిసి ఆమె జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ.. సిద్ధాపూర్, మహేశ్వరం మండలానికి ఆనుకుని ఉందని, ఈ డంపింగ్ యార్డ్ వల్ల వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. నాడు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో రైతుల నుంచి భూములు సేకరిస్తే నేడు చెత్త వేయడానికి ఆ భూములను కేటాయించాలని చూడటం సబబు కాదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి కమిషనర్‌‌తో మాట్లాడినట్టు చెప్పారు. బలవంతంగానైనా ఏర్పాటు చేయాలని చూస్తే ప్రజా పోరాటాలతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు సేకరించి టీజీఐఐసీకి అప్పజెప్పితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భూములను పప్పు బెల్లం లాగా పంచి పెడుతుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. షాద్‌‌నగర్‌, కొత్తూరు ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కాలుష్య పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతానికి ఒరిగేదేమీ లేదని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్, కేసీఆర్‌‌ను కలిసి ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ ప్రాంతంలో బంగారం లాంటి పొలాలు ఉన్నాయని, పాడిపంటలు సమృద్ధిగా పండి రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ప్రాంతంలో చెత్త కుప్పను వేసి పంట పొలాలను నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. సమీపంలోనే సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన జాంగీర్ పీర్ దర్గాతోపాటు గురుకుల పాఠశాల సైతం ఉన్నాయని, ఇలాంటి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ కు స్థలం ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ర్యాలీగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వై.రవీందర్ యాదవ్, ఎల్‌‌హెచ్‌‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, బాతుక దేవేందర్ యాదవ్, వడ్డే బాలయ్య, మెండే ‌కృష్ణ యాదవ్, అంబయ్య యాదవ్, మాజీ జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, కోస్గి శ్రీనివాస్, మహేశ్వరం సర్పంచ్ నవీన్, రాజ్య లక్ష్మి, సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -