- Advertisement -
ఒప్పందంతోనే విద్వేష వ్యాఖ్యలు అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా : మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలని బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పవన్ కళ్యాణ్ ఈ నటన స్టార్ట్ చేశారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మీద విషం కక్కి రాష్ట్ర ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చేయలేనిది ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే వినడానికి ఎవరూ సిద్దంగా లేరని తెలిపారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలన్నారు. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి తెలంగాణ బిడ్డా వేడుకలా, పండుగలా జరుపుకునే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్నించారు. నవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే మారు మాట్లాడని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదని, నిజజీవితంలో దేశభక్తి చూపించాలన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుండటంతో యువత ఇబ్బంది పడుతున్నదన్న పవన్ కళ్యాణ్.. మీ ఫ్యాన్స్‌లో చాలామంది నిరుద్యో గులే ఉన్నారు కాదా చేతనైతే వారికి ఉద్యోగాలు ఇప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, గ్రంథాలయ మాజీ చైర్మెన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ వైఎస్ చైర్‌పర్సన్ చిత్తరి పద్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


