నేడు టెట్‌ ఎగ్జామ్‌..

నవతెలంగాణ- హైదరాబాద్‌: నేడు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు 1,139 కేంద్రాలను, పేపర్‌-2కు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1కు 2,69,557 మంది, పేపర్‌-2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 4.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. టెట్‌ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు ఇవాళ ప్రత్యేక సెలవు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం నుంచే ఆయా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అదేవిధంగా పరీక్షల పర్యవేక్షణకు 2,052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లను నియమించారు. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించారు. అభ్యర్థులు కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నులు, హాల్‌టికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Spread the love