సమాజంలో ఒక వర్గానికో, వ్యక్తికో అన్యాయం జరుగుతున్న ప్పుడు ‘‘మనకెందు కులే’’ అని ముఖం తిప్పుకోవడం అంటే… మన వినాశనానికి మనమే రహదారి వేసుకోవడమే. చట్టం అనేది పౌరుల ప్రాణాలకు, హక్కులకు భద్రతనిచ్చే ఒక గొడుగులా ఉండాలి. కానీ, అదే చట్టం ఒక అదృశ్య సంకెళ్లలా మారి మనిషి స్వేచ్ఛను బందీ చేస్తే, ఆ వ్యవస్థను ప్రజా స్వామ్యం అనగలమా? కనీసం నేరం ఏమిటో నిరూపించకుండా, కేవలం దర్యాప్తు పేరుతో తిహార్ జైలు గదుల మధ్య యవ్వనాన్ని కరిగించుకుంటున్న ఉమర్ ఖాలిద్ ఉదంతం ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఉమర్ వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు. దేశంలో ఏ మూలనైనా, ఏ పాపమూ ఎరుగని ఒక సగటు పౌరుడి స్వేచ్ఛను కూడా ఈ వ్యవస్థాగత పోకడలు ఎంత సులభంగా హరించగలవో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏదైనా ఒక నేరం జరిగితే, నిందితుడిపై మోపిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై ఉంటుంది. అది మన రాజ్యాంగం కల్పించిన కనీస హక్కు. కానీ ‘ఉపా’ లాంటి ప్రత్యేక చట్టాల పరిధిలోకి వచ్చేసరికి ఈ మొత్తం వ్యవహారం తలకిందులవుతోంది. పోలీసులు ఒక చార్జ్‌షీట్ రాసి కోర్టు ముందు పెడితే చాలు… ‘‘నేను నేరస్తుడిని కాదు’’ అని నిరూపించుకునే భారం పూర్తిగా సగటు మనిషి పైనే పడుతోంది. ఈ క్రమంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ, జీవితంలో అత్యంత విలువైన వసంతాలను జైలు గోడల మధ్యే కోల్పోవాల్సి వస్తోంది.
ఒక అడవిలో అగ్నిప్రమాదం జరిగి చెట్లన్నీ కాలిపోయాయి. ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన లేదా ఆ ప్రమాదంపై అధికారులను ప్రశ్నించిన ఒక సామాన్యుడిని పట్టుకుని బోనులో నిలబెట్టారు. ‘‘ఈ అడవికి నువ్వే నిప్పు పెట్టావు. నువ్వు పెట్టలేదని అడవిలోని జంతువులన్నింటితో సాక్ష్యం చెప్పించుకో.. అంతవరకు నిన్ను వదిలేదే లేదు’’ అని అతన్ని ఏళ్ల తరబడి నిర్బంధిస్తే ఎంతటి అంధకారం అవుతుందో… నేటి ప్రత్యేక చట్టాల తీరు కూడా అదే బాటలో సాగుతోంది. ఒక పద్ధతి ప్రకారం సాగే కేసుల వెనుక మానసిక క్షోభ ఉంటుంది. ఒక వ్యక్తి ఎంతో శ్రమించి, తన నిర్దోషిత్వాన్ని చాటుకుని ఒక కేసు నుండి ఉపశమనం పొందేలోపే… దర్యాప్తు సంస్థల డైరీల నుండి మరో పాత ఫైలు, ఇంకో వారెంట్ సిద్ధంగా వస్తాయి. ఈ నిరంతర కేసుల చక్రబంధంలో చిక్కుకున్న వ్యక్తి సమాజంలో తన ఉనికిని, గౌరవాన్ని, మానసిక స్థిరత్వాన్ని పూర్తిగా కోల్పోవాలనేదే ఈ సుదీర్ఘ ప్రక్రియఅంతరార్థంలా అనిపిస్తోంది. ఇక్కడ న్యాయస్థానాలు శిక్ష ఖరారు చేయనవసరం లేదు… ఈ ‘సుదీర్ఘ విచారణా కాలమే’ ఒక దారుణమైన శిక్షగా మారి మనిషిని నిలువునా దెబ్బతీస్తోంది. ప్రభుత్వ విధానాలలోని లోపాలను వేలెత్తి చూపడం, పౌరుల పక్షాన నిలబడి గొంతు విప్పడం ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత సహజమైన ప్రక్రియ. విమర్శలను స్వీకరించి సరిదిద్దుకోవాల్సిన వ్యవస్థలు, భిన్నాభిప్రాయాలను సైతం దేశద్రోహపు రంగుతో ముడిపెట్టడం ఆందోళనకరమైన పరిణామం. సమాజం ఎప్పుడు బలహీన పడుతుంది అంటే… అన్యాయాన్ని చూసి జనం మాట్లాడటం మానేసినప్పుడు.
ఉమర్ ఖాలిద్ కేసును మనం ఒక సాధారణ చట్టపరమైన సమస్యగా మాత్రమే చూసి వదిలేయలేము. సమాజ హక్కుల కోసం, న్యాయం కోసం మాట్లాడే ప్రతి ఒక్కరికీ… ‘‘మీరు గొంతు విప్పితే మీ భవిష్యత్తు కూడా ఇలాగే ముగుస్తుంది’’ అని పరోక్షంగా భయపెట్టే వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఈ తరహా కఠినమైన చట్టాలు ఒక అమాయకుడిపై ప్రయోగించబడినప్పుడు సమాజం ముఖం చాటేస్తే… రేపు ఆ ప్రమాదం మన ముంగిటకు వచ్చినప్పుడు మన తరఫున మాట్లాడే గొంతు ఒక్కటీ మిగలదు. ఎన్ని చట్టాలు తెచ్చినా, న్యాయస్థానాలు ఎంతగా విశ్లేషించినా… పౌర సమాజం తన స్పందనను కోల్పోతే ప్రజాస్వామ్యం కేవలం ఒక నామ మాత్రపు కట్టడంగా మిగిలిపోతుంది. అధికారం ఎవరు హస్తగతం చేసుకున్నా, ప్రశ్నించే స్వభావాన్ని నేరంగా పరిగణించే ధోరణి పెరిగినప్పుడు సమాజంలో భయమే ఏలుతుంది. భయంతో బతికే సమాజం ఎప్పటికీ ప్రగతి సాధించలేదు. ఈ రోజు ఉమర్ ఖాలిద్ విషయంలో ఎదురుచూస్తున్న ఆఖరి లీగల్ ముగింపు కేవలం జైలు తలుపులు తెరుచుకోవడం గురించి మాత్రమే కాదు. వ్యక్తుల భావజాలంతో సంబంధం లేకుండా, ప్రతి సామాన్యుడి కనీస స్వేచ్ఛకు దేశంలో ఎంత రక్షణ ఉంది అనే భరోసాను తిరిగి నిలబెట్టడం గురించినది. చట్టం పౌరులను వేటాడే ఆయుధంగా కాకుండా, వారి హక్కులకు కాపలాదారుగా మారినప్పుడే సమాజంలో ప్రతి ఒక్కరికీ నిజమైన రక్షణ దొరుకుతుంది. ఆ మార్పు కోసమే ఇవాళ పౌర సమాజం మేల్కొనాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, నేడు ఉమర్ ఖాలిద్… రేపు ఆ బోనులో నిలబడే వంతు ఇంకొకరిది, ఆ వంతు మీదే కావచ్చు..!
రాజేందర్
దామెర
నేడు ఉమర్, మరి రేపు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



