– పెవిలియన్ గ్రౌండ్‌లో భారీ సభ, హాజరుకానున్న బి.వి రాఘవులు
– సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
పాలేరు, ఖమ్మం అసెంబ్లీల సీపీఐ(ఎం) అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న తమ్మినేని వీరభద్రం, ఎర్రా శ్రీకాంత్‌ల నామినేషన్ కార్యక్రమం గురువారం ఉందని, పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలోని సీపీఎం అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమం జరిగే పెవిలియన్ గ్రౌండ్‌ను సీపీఎం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ఉద్యమిస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించడం ద్వారా చట్టసభలలో ప్రజావాణి వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నామినేషన్ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఉదయం 10 గంటలకు భారీ సభ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర, రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, బండారు యాకయ్య, ఎస్.నవీన్‌రెడ్డి, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.