రేపే వరల్డ్ కప్ ఫైనల్స్..

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో ఇంత వరకు ఓటమిని ఎరుగని టీమిండియా ఫైనల్స్ లో సైతం సత్తా చాటి, ప్రపంచకప్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అహ్మదాబాద్ లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలు పెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ ను పరిశీలించాడు. బీసీసీఐ పిచ్ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్ జయేశ్ పటేల్ తో కాసేపు మాట్లాడారు. మరోవైపు, ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో ఇదే స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ కు నల్లమట్టితో కూడిన పిచ్ ను రూపొందించారు. ఇప్పుడు కూడా అదే రకమైన పిచ్ ను తయారు చేసినట్టు సమాచారం. ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీలతో పాటు బీసీసీఐ జీఎం (డొమెస్టిక్ క్రికెట్) అభే కురువిల్లా పిచ్ ను క్లోజ్ గా మానిటర్ చేశారు. ఫైనల్స్ కోసం స్లో ట్రాక్ రెడీ చేసినట్టు సమాచారం. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉండొచ్చని స్టేట్ అసోసియేషన్ క్యూరేటర్ ఒకరు తెలిపారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉందని చెప్పారు. 315 పరుగులు చేస్తే… సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బంది తప్పదని అభిప్రాయపడ్డారు.
బలాలు.. బలహీనతలు..
బలాలు..
కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుతో ఆడుతూ భారత్‌కు శుభారంభాన్ని ఇస్తున్నాడు. ఇప్పటివరకూ ఏకంగా 550 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ భారత్‌కు మరో ప్రధాన బలం. మ్యాచుల్లో సందర్భానికి తగ్గట్టు బౌలర్లను రొటేట్ చేస్తూ విజయాలను అందిస్తున్నాడు.  విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పలు సందర్భాల్లో తమ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ఆధిపత్యా్న్ని నిలబెట్టారు. వరల్డ్ కప్‌లో భారత బౌలింగ్ స్క్వాడ్‌కు షమీ పర్యాయపదంగా మారాడు. దీనికి తోడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ముహ్మద్ సిరాజ్ కూడా కీలకసమయాల్లో వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశారు.
బలహీనతలు..
భారత్ ఎంత శత్రు దుర్భేధ్యంగా ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ప్రస్తుతం ఐదు ప్రధాన బౌలర్లే అందుబాటులో ఉన్నారు. రోహిత్, కోహ్లీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి పార్ట్‌టైం బౌలర్లకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే బౌలింగ్ ప్రాక్టీస్‌కు అవకాశం లభించింది. దీంతో, ఏ బౌలర్ అయినా భారీ పరుగులు ఇచ్చుకుంటున్న పరిస్థితి వస్తే టీంను ఆదుకునేందుకు మరో ప్రధాన బౌలర్ లేరని చెప్పకతప్పదు. ఓవైపు ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్ మరింత అప్రమత్తంగా ఉండకతప్పదు. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ ఒకానొక సందర్భంలో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఫైనల్స్‌లో ప్రమాదకరంగా మారొచ్చు.  గత మూడు వన్డే టోర్నీల్లోనూ ఆతిథ్య జట్లే కప్ గెలుచుకున్నాయి కాబట్టి ఈసారి భారత్ జగజ్జేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత క్రీడాకారులకు బాగా పరిచయమైన పిచ్‌లు, వాతావరణం, ఫాంలో ఉన్న క్రీడాకారులు, అభిమానుల మద్దతు.. ఇవన్నీ కలిసొచ్చే అంశాలే. 2011లో వరల్డ్ కప్‌ చేజార్చుకున్న భారత్ తరపున ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌ శర్మకు మరో అవకాశం ముందుకొచ్చింది.

Spread the love