మానవత్వం చాటుకున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

నవతెలంగాణ – ఒడిశా:  బాలాసోర్ రైలు దుర్ఘటన అందర్ని కలిచి వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 280కి పైగా మంది చనిపోయారు. 1100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ ప్రమాదంపై సెలబ్రెటీలు చలించిపోతున్నారు. వివిధ దేశాని నేతలు, ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో అనాథలుగా మిగిలిన పిల్లలకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ బిలియనీర్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు. ఉచితంగా విద్యను అందిస్తానని ప్రకటించారు. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అనాథలైన పిల్లలను అదుకునేందుకు ముందుకు వచ్చారు. తన స్కూల్ లో ఉచితంగా విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ చిత్రం చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద సమయంలో, ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడమే నేను చేయగలిగింది. నేను అలాంటి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ సదుపాయంలో ఉచిత విద్యను అందిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Spread the love