– మాలిలో 48 మంది మృతి
బమాకో : పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం సంభ వించింది. పశ్చిమ మాలిలో శనివారం ఒక బంగారు గని కుప్పకూలడవంతో 48 మంది కార్మికులు మర ణించారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఆదివారం కూడా ప్రమాద ప్రాంతం వద్ద సహాయక చర్యలు కొనసాగుతు న్నాయని అధికారులు తెలిపారు. పేద దేశమైన మాలి ప్రపంచంలో ప్రముఖ బంగారు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ముడి బంగారాన్ని వెలికి తీసి ఇతర దేశాలకు తరలిస్తుంటారు. అయితే ఇక్కడ గనులను అక్రమంగానూ లేదా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే మాలి బంగారు గనుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. శనివారం జరిగిన ప్రమాదం నెల రోజుల వ్యవధిలోనే రెండోది. శనివారం కొండచరియలు విరిగిపడ్డంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. కొంత మంది కార్మికులు నీటిలో కొట్టుకుపోయారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. కాగా, జనవరి 29న తూర్పు మాలిలో కౌలికోరో అనే ప్రాంతంలోని ఒక బంగారు గని కూలడంతో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. అలాగే, గతేడాది జనవరిలోనూ మాలి రాజధాని బమాకో సమీపంలో జరిగిన దుర్ఘటనలో 70మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా విషాదం రేపింది. మాలి జనాభాలో 2 మిలియన్లు (10శాతం) కన్నా ఎక్కువ మంది మైనింగ్ రంగంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లోనూ పనిచేస్తుంటారు.