ఇటు పుట్టిన ఊరుకు… అటు మెట్టిన ఊరుకు పేరు తెచ్చిన కవయిత్రి, గాయని, బాల సాహితీవేత్త… అన్నింటికి మించి బాలల వికాసం కోసం బడి వేదికగా దశాబ్దకాలంగా పనిచేస్తున్న నిబద్ధత గలిగిన ఉపాధ్యాయిని, బాల వికాసకార్యకర్త త్రిపురారి (రేపాక) పద్మ. పద్మ పుట్టింది ‘మానేరు మా కళ్ళకు ముత్యాల పేరు’ గా వర్ణించి, సినారెగారు తాను చిన్ననాడు జలకాలాడుకున్న మానేరు తీరంలో. 14 సెప్టెంబర్, 1973న సిరిసిల్లలో పుట్టిన పద్మ మెట్టినూరు నవాబుపేట. ప్రస్తుతం జనగామలో నివాసం ఉంటోంది. పద్మ తల్లితండ్రుల శ్రీమతి లక్ష్మీ, శ్రీ రేపాక కళానిధి శర్మలు.
ఉద్యోగరీత్యా ప్రస్తుతం జనగామ జిల్లా దేవరుప్పల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా ఉంది. బడిని, గుడిని రెంటిని దేవాలయాలుగా భావించి సేవ చేసే పద్మ త్రిపురారి రామకృష్ణసిద్ధాంతి-భగీరతమ్మల జ్ఞాపకంగా స్థాపించిన ‘బాలభారతి’ సంస్థ ద్వారా జనగామ జిల్లా స్థాయిలో బాలల వికాసం కోసం సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వృద్దాశ్రమాలు, సదనాలలో వారి మనోరంజన కొరకు పలు కార్యక్రమాలను భర్త త్రిపురారి ప్రసాద్‌తో కలిసి నిర్వహించింది. అచ్చయిన పద్మ తొలి రచన ‘మౌనవీణ’ వచన కవితా సంపుటి. వచనంతో పాటు గేయ రచన, సంగీత కూర్పు, పద్య రచనలో పద్మది అందెవేసిన చేయి. చక్కని పద్యాలతో రాసిన శతకం ‘చిద్విలాస శతకం’, ‘పుస్తకము హితకరమగు పుత్తడౌను/ పుస్తకముల కాంతి నొసగు పుణ్యధనము/ పుస్తకమ్మె జ్ఞానాంబుధి పూలతేరు/ చిన్మయ! శశిధరా! హర! చిద్దిలాస!’ అంటూ ఇందులోని పద్యాలు సాగుతాయి. వేయి సంవత్సరాల చరిత్ర గలిగిన వెంకన్న గుడిని ఆనుకుని వీళ్ళ ఇల్లు… అలా బాల్యం నుండి పద్మకు భక్తిపాలు కొంత ఎక్కువే. అందుకు ఆమె రాసిన వందలాది గేయాలు ఉదాహరణ. ఈ గేయాలను ఆమె స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు అందంగా గానం చేయడమే కాక వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచడం వల్ల గేయకారిణిగా కూడా పద్మ పేరు తెలుగునాట పరిచయం. జిల్లా ఉపాధ్యాయ పురస్కారం, ఉగాది పురస్కారం, కవిమిత్ర పురస్కారం, పివి మనోహర్‌రావు సేవా పురస్కారం, మల్లినాథసూరి పురస్కారం, రంగినేని సత్కారం మొదలుకుని వివిధ సంస్థల అవార్డులు, రివార్డులు, సత్కారాలు అందుకుంది పద్మ. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలతో పాటు, బాలల కార్యశాలల్లో నిపుణురాలుగా పాల్గొంది. కవన తరంగిణి పేర పిల్లల రాత పత్రికను నిర్వహిస్తూ, వారికి తరగతి గదిలో ఆ పత్రికను అందుబాటులో ఉంచే చక్కని పనిచేస్తోంది.
భక్తిగేయాలేకాక వివిధ సామాజిక అంశాలు, విషయాలపై కూడా సమయానుసారంగా పద్మ రచనలు చేసింది. వాటిలో తన అమ్మ నాన్న మొదలు ఎందరికో అక్షర చిత్రాలు గీసింది. ‘కడలియంత ప్రేమే ఉన్నా/ కనపడని మమతవు నాన్నా/ కరుగుతున్న కొవ్వత్వివి నీవై/ వెలుగు పంచు జ్యోతివి నాన్నా’ అంటూ తన తండ్రి గురించి ఎంత గొప్పగా చెబుతుందో… ‘అపురూప రూపం అమ్మ/ అనురాగ దీపం అమ్మ/ అలవికాని మమతల మణిదీపం అమ్మ/ అత్మీయానుబంధాల ఆరాధ్య దైవం అమ్మ/ కరుగుతూ వెలుగులనిచ్చే కోటి దీపాల కాంతి అమ్మ’ను గురించి రాసింది. ఇక భక్తి గేయాల విషయం చెప్పాల్సిన పనిలేదు. ఫేస్‌బుక్ నుండి మాధ్యమాల వరకు ఆ గీతాలు మారుమోగి పోతునే ఉంటాయి. ఆ కోవలో రాసిందే సీతారాముల కళ్యాణగీతం, ‘పచ్చని పందిరి ముత్యాల ముంగిలి/ రతనాల లోగిలి రమణీయ లాహిరి/ సీతారాముల కళ్యాణమే ఇది/ సీతా రాముల కళ్యాణమే ఇది’ అన్న గీతంలో ‘రఘురాముని ప్రేమే చెంపన కెంపై/ రఘునందని పిలుపే ఊహల సిరులై’ వంటి అనేక ఉపమానాలు పద్మ గేయపద్మాల వికాసానికి తార్కాణాలు. బాలల వికాసం కోసం బడిలో పద్మ చేసిన పనుల గురించి ఎంత రాసినా తక్కువే! ముఖ్యంగా ‘అమృత లేఖలు’ పేరుతో ప్రముఖుల లేఖలతో తెచ్చిన సంకలనం పద్మ బడి కేంద్రంగా చేసిన ఒక నిర్మాణాత్మక పనికి నిదర్శనం. ఇది ప్రముఖుల లేఖల ఉత్తర ప్రత్యుత్తరాల సంకలనం.
బాల గేయకర్తగా పద్మ తెచ్చిన గేయ సంపుటి ‘పూలదండ’… పేరులోనే కాదు ఇది అచ్చంగా… అక్షరాలా బాలల చేతిలో ఒదిగిన పూలచెండు. పద్మ చెప్పుకున్నట్టు చదువులమ్మ మెడలో బంతిపూల దండ. ఇందులోని గేయాలు ఆడుకుంటూ పాడుకునే విధంగా ఉండడం గేయంపై పద్మకున్న పట్టును తెలుపుతాయి. ‘అమ్మమ్మంటే అమ్మమ్మ/ ఆనందాల మా బామ్మ/ యిప్పుడే యింటికి వచ్చింది/ అప్పాలెన్నో తెచ్చింది’, ‘తాతయ్యంటే నాకిష్టం/ తాతయ్యంటే నా ప్రాణం/ బహుమతులెన్నో ఇస్తాడు/ బంగారంలా చూస్తాడు’ వంటి గేయాలతో పాటు ‘.. నీటి కొరకు మనమంతా ఏకమవుదాం/ ఇంకుడుగుంత కట్టమని చెబుదాం’ వంటి చక్కని ప్రయోజనాత్మక విషయాలు కూడా ఈ ‘పూలదండ’లో ఉన్నాయి. పిల్లలకు నచ్చేలానే కాకుండా వారు మెచ్చేలా రాయడం పద్మకు తెలుసు. అటువంటిదే ఆమె రాసిన ‘కూరగాయల బడి’ గేయం. ఇది పిల్లలకు కూరగాయలపట్ల అవగాహనతో పాటు బడిపట్ల, గురువుపట్ల గురుతును తెలుపుతుంది. కథలను గేయకథలుగా, వివిధ అంశాలను గేయాలుగా పూలదండలో కూర్చింది పద్మ. ‘సిరిసిల్ల సిరివెలుగు’ చెల్లెలు పద్మకు ఆశీరాభినందనలు! జయహో బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్, 9966229548