భద్రాద్రి నుండి బాల సాహిత్య వీధుల్లో ‘డా||వీధుల రాంబాబు’

– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548
‘నిధి చాల సుఖమా… రాముని సన్నిధి చాలసుఖమా’ అని రామభక్తులు గానం చేస్తే,
భద్రాద్రి రాముని సన్నిధిలో ఉండి ‘బాలల సన్నిధే పెన్నిధి’గా భావించి రచనలు చేస్తున్న రచయిత, కవి, అనువాదకులు, బాల సాహితీవేత్త వీధుల రాంబాబు.
వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయులైన రాంబాబు ఏప్రిల్‌ 1, 1970లో నిన్నటి భద్రాద్రి తాలూకా లోని తోటపల్లి మండలంలోని ఏటపాకలో పుట్టారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ మండలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది. వీరి తల్లితంద్రులు శ్రీమతి లక్ష్మీకాంత, శ్రీ పాపారావు.
భద్రాద్రిలో జరిగే ఏ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమంలోనైనా ముందు వరుసలో నిలిచే వీధుల రాంబాబు తెలంగాణ సాహితి అధ్యక్షులుగా నిర్వహించిన కార్యక్రమాల పరంపర పెద్దది. భద్రాద్రి నుండి జాతీయస్థాయిలో ప్రదానం చేస్తున్న కామిశెట్టి పురస్కార వ్యవస్థాపకులు. ప్రతిష్టాత్మక దక్షణ భారత హిందీ ప్రచార సభ గవర్నింగ్‌ బాడి మెంబర్‌గా సేవలందిస్తున్న రాంబాబు లయన్స్‌ క్లబ్‌ సభ్యులుగా, స్కౌట్‌ మాస్టర్‌గా ఉన్నారు. హిందీ ప్రచారంలో ముందువరుసలో నిలిచి పనిచేస్తున్న వీరు, దక్షణ భారత హిందీ ప్రచారసభ నూరేండ్ల సభలో రాష్ట్రపతిగారితో ప్రతినిధిగా పాల్గొన్నారు.
హిందీ ఉపాధ్యాయునిగా, పరిశోధకునిగా రాంబాబు రాసిన వ్యాసాలు, పరిశోధనా పత్రాలు దేశవ్యాప్తంగా వస్తున్న జాతీయ హిందీ పత్రికల్లో అచ్చయ్యాయి. హైదరాబాద్‌ మొదలు హరిద్వార్‌ వరకు, త్రివేండ్రం మొదలు షిల్లాంగ్‌ వరకు జరిగిన ముప్పైకి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆకాశవాణి, ఈటివి, దూరదర్శన్‌ల కోసం రవీంద్రుడు, జానపదంతో పాటు ఇతర అంశాలపై ప్రసంగాలు, చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు మాతృభాష తెలుగుతో పాటు, తన బోధనా భాష హిందీలోనూ సమానంగా కృషిచేస్తున్న రాంబాబు రెండు భాషల్లోనూ రచనలు చేయడం విశేషం. ఇతర భాషల్లో బోధన చేస్తున్న అనేకమంది కేవలం మాతృభాషలో రచనలు చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాంబాబు రెండుభాషల్లో రెండు చేతులతో రచనలు చేయడం విశేషం. బహుశః గురువు డా.నలిమెల భాస్కర్‌ స్ఫూర్తి కావచ్చు. హిందీ సాహిత్యంలోనూ చక్కని రచనలు చేసిన రాంబాబు వాటిలో కొన్నింటిని పుస్తకాలుగా తెచ్చారు. వాటిలో ‘అతీత్‌కే చల్‌ చిత్ర్‌’ పేర ప్రచురించిన రేఖా చిత్రణలో సామాజిక సమస్యలు మొదటిది. మరో రచన ‘పంత్‌కావ్య్‌మే మానవతావాద్‌’ పిహెచ్‌.డి సిద్ధాంత గ్రంథం. హిందీ సాహిత్యానికి సంబంధించిన రచనలు హిందీలోనే కాక తెలుగువారి కోసం తెలుగులోనూ ప్రచురించారు రాంబాబు. వాటిలో ‘మహాదేవి వర్మ గద్య సాహిత్యం- సమీక్షాత్మక అధ్యయనం’ను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీరి మరోవ్యాస సంకలనం ‘సంవీక్షణం’ కూడా వీరికి విమర్శకునిగా గుర్తింపును తెచ్చింది. ‘విద్యాశిరోమణి’, ‘సాహిత్య మహోపాధ్యాయ’, ‘బాల సాహిత్య పరిషత్‌’ సత్కారంతో పాటు వివిధ సంస్థల పురస్కారాలు, ఉపాధ్యాయ అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.
బాల సాహితీవేత్తగా కథలు, గేయాలతో పాటు పలు అనువాదాలు చేశారు రాంబాబు. వీరి రచనలు నవతెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త మొదలగు పత్రికల్లోని బాల సాహిత్య శీర్శికల కింద అచ్చయ్యాయి. అచ్చులో వచ్చిన తొలి బాలల రచన ‘బంతిపూలమాల’ బాలల కథా సంపుటి. ఒకరకంగా ఇది కొత్తపాతల మేలు కలయికగా వచ్చిన కథా సంపుటి. కొన్ని కథలు వినోదాత్మకంగా ఉంటే.. ఇంకొన్ని నీతిని, మంచిని బోధించే కథలు. నాస్టాల్జియాను రచనలుగా అందరం రాస్నున్నవాళ్ళమే. వీరు కూడా ‘అమ్మమ్మ చెప్పిన మా ఊరి కథ’ పేర తన ఊరు గురించి, దాని పేరుగురించి చక్కగా రాస్తారు. తన చుట్టూవున్న వాతావరణాన్ని, పరిసరాల్ని తన రచనల్లో నిక్షిప్తంచేసిన రాంబాబు దండకారణ్యం, పాపికొండలు, గోదావరి తీరాలు, కిన్నెరసాని వంటి వాటిని అక్కడి పిల్లలకే కాదు, ఇతర ప్రాంతాల పిల్లలకు చక్కగా అక్షరచిత్రాలుగా తన రచనల్లో చూపిస్తారు. ఆవిష్కరణ దిశగా సిద్ధమైన వీరి బాలల గేయ సంపుటి ‘పూల సింగిడి’. ఈ గేయాలన్నీ గతంలో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ‘బతుకునిచ్చే తల్లి/ ఓయి బతుకమ్మ’ అంటూ బతుకమ్మను గురించి గానం చేస్తూనే, తాను హిందీ ఉపాధ్యాయులైనా ‘అందరికి ఆత్మబంధువు/ అనురాగ సింధువు తెలుగు/ మనకిదె బతుకు దెరువు’ అంటారు. ‘పాలపిట్ట పాలపిట్ట/ ఈక నియ్యవే/ పుస్తకంలో పెట్టుకొని/ మురిసి పోదును/ కోకిలమ్మ కోకిలమ్మ/ పాటపాడవె’, ‘పంతులమ్మ! పంతులమ్మ!/ ఎంత మంచిదమ్మ/ గుణింతాల గోరుముద్ద/ తినిపించెను కమ్మగా…./ దేశ భవితకు గుడి/ అదే మన బడి’ వంటి చక్కని లయాత్మక గేయాలు ఇందులో ఉన్నాయి. సామెతలను గేయాలుగా రాయడం రాంబాబుకు తెలిసిన చక్కని విద్య, ‘చింతకాయ పులుపు/ చెట్టెక్కి దులుపు/ చింతకాయ తొక్కు/ దేవునికి మొక్కు’ వంటివి ఉదాహరణ. బాలలకు చక్కని కథలు, గీతాల నందిస్తున్న భద్రాచల బాలదాసు డా||వీధుల రాంబాబుకు జయహో!

Spread the love